మరో పంచామృతం!

ఆసక్తిగా ఎదురుచూసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ఒకింత ఉత్సాహం ఇచ్చేలా వున్నాయి. ఉత్సాహం మాట అటుంచి వూపిరి పోశాయి. ఈ అయిదు రాస్ట్రాలోనూ అధికారపీఠంపై వారు ఆశలు పెట్టుకున్న ఒకే ఒక రాష్ట్రం అస్సాం ఆశించిన ఫలితాలే అందించింది. హర్యానా, మహారాష్ట్రలు కొత్తగా తమ జాబితాలో వేసుకుని జమ్మూ కాశ్మీర్లో మిశ్రమ ఫ్రభుత్వ భాగస్వామ్యం చేస్తున్న బిజెపికి ఇది పెద్ద విషయమే. ఉత్తరాదికి పరిమితమైందిగా పేరు పొందిన బిజెపి గతంలోనూ కర్ణాటకను పాలించి, 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లోనూ అధికారంలో వాటా పొందగలిగింది. ఇప్పుడు కేరళలోనూ ప్రాతినిధ్యం సంపాదించి బెంగాల్లో బలం పెంచుకుంది. ఇక ఈశాన్యాన అస్సాంలో ఏకంగా అధికారంలోకి రాబోతున్నది. ఈ అన్నిచోట్టా బిజెపికన్నా బలం కలిగిన కాంగ్రెస్ నిశ్శబ్బంగా తలవంచి నిష్క్రమిస్తున్న స్థితి. ఆ కోణంలో చూస్తే బిజెపికి ఇది చాలా అవసరమైనసమయంలో వచ్చిన అనుకూల ఫలితాలు. పైగా దేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా మారిన అసహనం, మతతత్వ దాడులు, గోవధ నిషేదం, విశ్వవిద్యాలయాలపై దాడి వంటి అంశాలు అసలు చర్చకే రాకుండా ఎన్నికలు జరగడం కూడా బిజెపి కోరుకునే పరిణామమే. బీహార్, ఢిల్లీలలో దారుణంగా దెబ్బతిన్న ఆ పార్టీ అస్సాం విజయాన్ని అమితంగా ప్రచారం చేసుకోవడం తథ్యం. అందులోనూ బంగ్లాదేశ్‌తో సరిహద్దు, ముస్లిం శరణార్థులు, జాతుల సమస్య వంటివన్నీ మేళవించిన అస్సాం సైద్దాంతికంగానూ బిజెపికి మంచి రంగస్థలమే. మూడు దఫాలుగా పాలిస్తూ అనేక అరోపణలు అసమర్థతలకు పేరు మోసిన కాంగ్రెస్ మరోసారి గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు.అక్కడ ప్రధాన ప్రాంతీయ శక్తిగా వుండిన ఎజిపి స్వయంకృతాలతో క్షీణించి బిజెపికి ఉపగ్రహంగానే మిగిలిపోయింది. గతంలో కాంగ్రెస్‌తో జతకట్టిన బోడో పీపుల్స్ ఫ్రంట్ ఇప్పుడు బిజెపికి వైపునకు వచ్చింది. ప్రాంతీయ పార్టీ ఎజిపి ఖాళీ చేసిన స్థానాన్ని బిజెపి చేజిక్కించుకోగలిగింది. హర్యానాలోనూ చౌతాలా ప్రాంతీయ పార్టీని, మహారాష్ట్రలో శివసేనను అది ఇలాగే పక్కకు నెట్టగలిగింది. ప్రాంతీయ పార్టీలతో జూనియర్ భాగస్వామిగా చేరి నెమ్మదిగా తనే ప్రధాన శక్తిగా ఎదగడం బిజెపి వ్యూహంలో ముఖ్యభాగం. దాన్ని జయప్రదంగా అమలు చేసిన మూడవ రాష్ట్రం అస్సాం. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుడా పోరాడిన బీహార్వంలె గాక ముందుగానే కేంద్ర సహాయమంత్రి సర్వానంద్ సోనేవాలాను భావి నేతగా ప్రకటించడం కూడా ఈ విజయాన్ని సులభం చేసినట్టుంది. అయితే అస్సాం ప్రత్యేక సమస్యలు జాతి మత వివాదాల పూర్వాపరాలు దృష్టిలో వుంచుకుని చూస్తే అక్కడ బిజెపి రావడం వల్ల కలిగే పర్యవసానాలు చాలానే వుంటాయి.వాటిని భవిష్యత్తులో చూడబోతున్నాం. గతానుభవాల రీత్యా బిజెపి తగు సంయమనం పాటించి ఈశాన్య భాగాన ప్రశాంతతకు తోడవుతుందని ఆశించాలి.
తమిళనాడులో పురుచ్చి తలైవి జయలలిత పునరాగమనం అస్సలు వూహకందనిది కాదు గాని చాలామంది వూహలకు భిన్నమైంది.ఒకటి మినహా ఎ గ్జిట్పోల్స్ అన్నీ ఆమె ఓడిపోయి డిఎంకె గెలుస్తుందని చెప్పాయి. గత మూడు దశాబ్దాలలోనూ అక్కడ పాదుకొన్న అనవాయితీ అదేగనక పరిశీలకులు కూడా దాన్ని తేలిగ్గానే ఆమోదించారు. అవినీతి ఆరోరపనల విషయంలో ఉభయ దిఎంకెల అధినేతలు ఒకరికొకరు తీసిపోరు. అందుకే ఎన్నికల ప్రసంగాలలో ఒకరి అవినీతిని మరొకరు విమర్శించే పని కూడా పెట్టుకోలేదంటారు! అయితే జయలలిత జైలుశిక్ష తర్వాత ఉపశమనం తో పోలిస్తే కరుణానిధి సపరివార అవినీతి అప్రతిష్టాకర పోకడలు ఓటర్లకు ఎక్కువ జుగుప్స కలిగించి వుంటాయి. వ్యక్తులుగా చూస్తే ఆయన కన్నా ఆమె, దాంతో పాటు అమ్మ పథకాలు ఆకట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా వుంది. పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ పేరిట వామపక్షాలు కొన్ని సామాజిక పార్టీలు ప్లస్ కెప్టెన్ విజయకాంత్ కలసి చేసిన ప్రయత్నం బొత్తిగా ప్రభావం చూపడంలేదని మొదటే తేలిపోయింది. అసలాయనకు అంత దృశ్యం లేకపోగా విపరీత పోకడలతో వున్నది కూడా పోగొట్టుకున్నారు. వెరసి జయలలితకు మరోసారి తమిళపీఠం దక్కింది. ఇది మోడీకి కూడా సంతోషం కలిగించే పరిణామమే. తమిళనాడు ఎన్నికల ఫలితం తర్వాత అవినీతి ఆరోపణలు, జనాకర్షక పథకాలు, వ్యక్తిగత ఏకపక్ష రాజకీయాలే జయలలితకు ఆకర్షణగా మారాయా అన్న సందేహం కూడా కలుగుతుంది.
మూడున్నర దశాబ్దాల వామపక్ష పాలన తర్వాత కంచుకోటలో పాగా వేసిన అగ్గిబరాటా మమతా బెనర్జీ మరోసారి ఇనుమడించిన ఆధిక్యతతో అధికారం కైవశం చేసుకోవడం మరో సంచలన పరిణామం. ఆమె విజయం ఖాయమని వామపక్షాలకూ తెలిసినా ఇంత దారుణమైన ఫలితాలు అవి వూహించలేదు.విమర్శలను కూడా ఖాతరు చేయకుండా అస్తిత్వం కోసం కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చినా సహజంగానే అది ఎప్పటికప్పుడు పరిధి దాటినా చివరకు ఫలితంమాత్రం దక్కకపోవడం తీవ్ర విషయమే.అంతకాలం పాలించి ఓడిపోయిన వారు ఒక్కసారికే మళ్లీ తిరిగిరాలేకపోవడం ఎన్నికల తర్కంలో ఏమంత ఆశ్చర్యం కాదు గాని దీని వెనక వున్న ప్రజాస్పందనను సరిగ్గా అర్థం చేసుకోవడం మరింత ముఖ్యం. ఇన్నేళ్ల పాలనలో అనేక ప్రజానుకూల చర్యలు తీసుకున్నా పారిశ్రామిక విధానం భూసేకరణ లేదా నందిగ్రామ్, లాల్‌గడ్ వంటి పరిణామాల ప్రభావం ఇంకా పనిచేస్తూనే వుందని స్పష్టమవుతుంది. మమత సర్కారు శారద నుంచి నారద వరకూ అనేక కుంభకోణాల్లో చిక్కుకుపోయినా ఓటర్లు పట్టించుకోలేదు. ఆమె పాలనలో అరాచకం బీభత్సం అందరూ అంగీకరించినవే. ఎన్నికల సంఘం కూడా ఎన్నిసార్లు జోక్యం చేసుకుందో చెప్పడానికి లేదు. అయినా సరే అంతిమంగా వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే వామపక్ష సంఘటనకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం ఆత్మవిమర్శ చేసుకోవలసిన గుణపాఠాలు తీసుకోవలసిన అవసరం చాలా కనిపిస్తుంది. కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాలు రావడం బట్టి చూస్తే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగిందా లేక ఒకవైపుకే జరిగిందా అని కూడా సందేహం కలుగుతుంది. బిజెపి కూడా వామపక్షాలు తిరిగిరావడం కన్నా మమత వుంటేనే మెరుగని భావించిందనేది స్పష్టం.లోక్‌సభ ఎన్నికల్లో 17శాతం ఓటింగు తెచ్చుకున్న బిజెపి పాత్రను కూడా తక్కువ అంచనా వేయలేం గనక వారిమధ్య అప్రకటిత అవగాహన వుందేమో కూడా చూడాలి.
ఈ నేపథ్యంలో కేరళ ఫలితమే కమ్యూనిస్టులకు పెద్ద వూరట. మామూలుగా కేరళలో రెండు కూటముల మధ్య వుండే తేడాను మించి అనేక రెట్లు విజయం లభించింది. దీనికి వూమెన్ చాందీ ప్రభుత్వ కుంభకోణాలు కళంకాలతో పాటు ఎల్‌డిఎప్ నిరంతరాయంగా సాగించిన ప్రజా కార్యచరణ కూడా ఒక పెద్ద కారణం.విజయన్ అచ్యుతానందన్‌ల మధ్య స్పర్థ గురించి ఎంత ప్రచారం జరిగినా వారిద్దరూ క్రమశిక్షణగానూ ఐక్యంగానూ ప్రచారం చేయడం వల్ల కూడా సత్పలితాలు కలిగాయి. ఒకసారి ఒకరు అన్న సిద్ధాంతం తమిళనాడుకూ కేరళకూ ఒకేలా వర్తింపచేయలేము. ఇక్కడ గత సారి కూడా సిపిఎం పెద్దపార్టీగా వుంది. అక్షరాస్యతలోనూ అనేక అభివృద్ధి సూచికలలోనూ ముందుండే కేరళను సోమాలియాతో పోల్చిన మోడీ వ్యాఖ్యలను కూడా ప్రజలు ఆగ్రహంతో తిరస్కరించారని చెప్పాలి.
చివరగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ క్షీణతలో మరో అధ్యాయం రచించాయి.2014 ఎన్నికల తర్వాత ఇప్పటికి వరుసగా 12 రాష్ట్రాల్లో అది ఓడిపోయింది. కర్ణాటక మినహా మరే చెప్పుకోదగిన రాష్ట్రం దానిపాలనలో లేదు. ఫ్రధాన జాతీయ పార్టీగా దానిస్థానాన్నికార్పొరేట్ ఇండియా ఆశీస్సులతో క్రమేణా మితవాద(మతవాద) బిజెపి ఆక్రమించేస్తుందా? ఈ క్రమంలో మొదటిదానికన్నా రెండవది ఆందోళన కలిగించే పరిణామం కావచ్చు గాని సూచనలు అటే వున్నాయి. 2014 నాటి మోడీ మోత తగ్గుముఖం పట్టినా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల పొత్తులతో వచ్చే ఎన్నికల్లోనూ అధికారం నిలబెట్టుకోవడానికి అది ప్రయత్నించే అవకాశం చాలా వుందని స్పష్టమవుతుంది. అయితే 2017లో జరిగే యుపి ఎన్నికల ఫలితాలు ఈ విషయంలో చాలా నిర్ణయాత్మక పాత్ర వహిస్తాయి. విధానాలు మార్చుకోకుండా వ్యవస్థాగత ధోరణులు మెరుగుపడకుండా కాయకల్ప చికిత్సతో కాంగ్రెస్ కోలుకుంటుందని ఆశించడం అవాస్తవికతే. కాంగ్రెస్ బిజెపిల మధ్యనే గిరిటీలు కొట్టకుండా ప్రజానుకూల ఆర్థికవిధానాలతో లౌకిక విలువలతో ఆయా చోట్ల గల పార్టీలు ముందుకు వస్తే జాతీయంగానూ ప్రత్యామ్నాయాలు పెరుగుతాయి. పూర్తిఫలితాలు ఓట్ల వివరాలు వస్తే అలాటి మరింత లోతైన పరిశీలన సాధ్యమవుతుంది
(ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి, గమనం- 20.5.16)