కేరళ సారథిగా విజయన్‌ – వూహలకు స్వస్తి

dc-Cover-1h5fvo90n8c4f1emecpsj8sv44-20160228062458.Medi
కేరళ నూతన ముఖ్యమంత్రిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ ఎంపికవడంతో వూహాగానాలకు తెరపడింది. సిపిఎం విధానాలు, అంతర్గత పనివిధానం తెలిసిన వారికి విజయన్‌ ఈ స్థానానికి ఎన్నికవుతారని ముందేతెలిసినా మీడియా అది ఒక సమస్యగా మారొచ్చనే కథనాలు ప్రచారంలో పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌, గతంలో కార్యదర్శిగా పనిచేసిన పినరాయిల మధ్య విభేదాలు వుండటం అవి బయిటకు కూడా రావడం సిపిఎంలో చాలా అరుదైన పరిణామం. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఇలాటి పరిస్థితి ఎదురవలేదు. అయితే దానికి గాను వారిద్దరూ నాయకత్వం కమిటీలు తీసుకునే నిర్ణయాలకు బద్దులై వ్యవహరించారన్నది కూడా గమనించాల్సిన విషయమే. ఇద్దరినీ కొంతకాలం పొలిట్‌బ్యూరో నుంచి సస్పెండ్‌ చేయడం, విచారణ తర్వాత అచ్యుతానందన్‌పై చర్య తీసుకోవడం బహిరంగంగానే జరిగింది. అయినా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల్లో గాని తర్వాత ప్రతిపక్ష నేత బాధ్యతల్లో గాని లోపంచేసింది లేదు. వయస్సును బట్టి ఎప్పుడైనా నిర్ణయాలను అతిక్రమించినా విమర్శల తర్వాత మళ్లీ సమిష్టి నిర్ణయాలకే కట్టుబడుతూ వచ్చారు. ఇక విజయన్‌ విద్యార్థి నాయకుడుగా జీవితం ప్రారంభించి 26 వ ఏటనే సిపిఎం కన్నూరు జిల్లా కమిటీ సభ్యుడుగా 28వ ఏట ఎంఎల్‌ఎగా ఎన్నికైనారు. నయనార్‌ మంత్రివర్గంలో విద్యుత్‌శాఖను సమర్థంగా నిర్వహించారని పేరుంది. ఆ సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ మరణించడంతో పినరాయి మంత్రి పదవి వదలిపెట్టి కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 1998 నుంచి 2015 వరకూ ఈ బాధ్యతల్లోవుండి అనేక ఒడుదుడుకుల మధ్య నడిపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనపై లావలిన్‌ కేసు పెట్టి వేధించింది. చివరకు సిబిఐ స్వయంగా తన కేసు వెనక్కు తీసుకుంది. అచ్యుతానందన్‌ ప్రజాభిమానం విశుద్ధ ప్రవర్తన గల నాయకుడనేది నిజమే. ఆయన వల్ల సిపిఎంకు ఎల్‌డిఎప్‌కు ప్రజాదరణ పెరిగిన మాటా నిజమే. కాని పార్టీ యంత్రాంగాన్ని నిర్మించడంలోనూ నిర్వహించడంలోనూ గత రెండు దశాబ్దాలలో పినరాయి విశేషంగా శ్రమించారనేది కూడా నిజం.ఇప్పుడు 93వ ఏట అచ్యుతానందన్‌ రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవడమంటే భారం మోపడమే. ఆయన ఆరోగ్యం బాగానే వున్న మాట నిజమే గాని నిరంతరం సహాయకులు లేకుండా జరగదు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నట్టు క్యూబాలో ఫైడెల్‌ కాస్ట్రో వలె అచ్యుతానందన్‌ పెద్దరికం వహించే అవకాశాలు ఏమైనా కల్పించవచ్చు. పశ్చిమబెంగాల్‌లోకూడా మరోసారి వామపక్షాలకు ఘోరపరాజయం ఎదురైన సందర్భంలో – దేశానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ను అందించిన కేరళ మళ్లీ ప్రత్యామ్నాయాన్ని పెంపొందించే కృషికి మూలపీఠం అవుతుంది. నిర్మాణ దక్షుడైన పినరాయి విజయన్‌ వంటి వ్యక్తి సారథ్యం అందుకు బాగా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *