అనుకున్నట్టే ఎగ్జిట్‌పోల్స్‌ కూడా…

_33dc1546-bce6-11e5-9fa5-7bc8f9858c8d
పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఇప్పుడు రాజకీయ మీడియా సంస్థలలో సర్వసాధారణమైపోయాయి. నాలుగురాష్ట్రాలకు సంబంధించి వివిధ సంస్థలు వెలువరించిన ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి గనక మళ్లీ ఏకరువు పెట్టడం లేదు. ఏప్రిల్‌2న(ఇదే బొమ్మతో) వెబ్‌ మిత్రులతో పంచుకున్న అభిప్రాయాలకు ఇవి అనుగుణంగానే వున్నాయి.
అస్సాంపై బిజెపి పెట్టుకున్న ఆశలు ఫలించడంతో మోడీ అమిత్‌షా ద్వయం కొంత వూపిరి పీల్చుకోవచ్చు. ఆ రాష్ట్రానికి సంబంధించి వివిధ ఎగ్జిట్‌పోల్స్‌ప్రకారం బిజెపి 72 నుంచి 93 వరకూ సీట్లు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్క టైమ్స్‌నౌ సిఓటర్‌ మాత్రం 57 స్థానాలే ఇచ్చింది గాని అలా అయినా ఇతరులతో కలసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూడు సార్లు గెలిచిన కాంగ్రెస్‌ నాలుగో సారి విజయం సాధించడమనే ముచ్చటే లేదు. అయితే తొలిసర్వేలు పోటాపోటీ వుంటుందని చెప్పాయి.నిజానికి కాంగ్రెస్‌ సర్కారు అసమర్థత అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనే ఇక్కడ బిజెపి 69 అసెంబ్లీ సెగ్మంట్లలో ఆధిక్యత సాధించింది. దాన్ని గట్టిపర్చుకోవడం కోసం సర్వానంద సబర్వాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎజిపితో పొత్తుపెట్టుకుంది. అయితే మరీ ఘన విజయం లభిస్తున్నట్టు ఈ సూచనలు చెప్పడం లేదు. చూడాలి. ఎన్నికల ప్రచారంలో ముస్లిం దురాక్రమణ(అగ్రెషన్‌) బంగ్లా శరణార్థుల సమస్యను రాజకీయాస్త్రంగా వాడుకోవడం, 1700లో మొగలాయిలపై జరిగిన యుద్ధంతో ఈ ఎన్నికలను పోల్చడం, తీవ్రమైన వరదలు వస్తే జాతీయ విపత్తు కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం ఇవన్నీ కొంత ఇబ్బందిగా మారాయని పరిశీలకులు అంటున్నారు. సెంటు వ్యాపారి అజ్మల్‌ నాయకత్వంలోని ఎఐయుడిఎఫ్‌ అనేక చోట్ల పోటీ పెట్టి ఓట్లచీలికకు కారణమవడమే గాక బిజెపి విజయానికి పరోక్షంగా సహకరించిందంటున్నారు. అయితే ప్రభుత్వ స్థాపనలో దానితో కలిసే అవకాశమే లేదని, వంటరిగానే మూడింట రెండు వంతుల మెజార్టి వస్తుందని సర్వానంద్‌ అంటున్నారు.
కేరళలో ఎల్‌డిఎప్‌ విజయంపై ఎవరికీ ఎలాటి సందేహాలు లేవు. అన్ని పోల్స్‌ దానికి 80,90 స్తానాలు వస్తాయని చూపిస్తున్నాయి.నిజానికి గత ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్‌కు యుడిఎప్‌కన్నా కేవలం నాలుగుస్థానాలే తక్కువగా వచ్చాయి. యుడిఎఫ్‌ కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి. బిజెపికి కొంత అవకాశం వుందని ఆ కారణంగాన గెలుపు ఓటములు తారుమారు కావచ్చని ప్రచారం జరిగినా అందుకు ఆస్కారమే కనిపించడం లేదు. అయితే ఆపార్టీ ఒకటి రెండు స్థానాలు తెచ్చుకుని ఖాతా తెరుస్తుందా అనేది చూడాల్సిందే. అక్షరాస్యతతో సహా మానవాభివృద్ధి సూచికలన్నిటా ముందుండే కేరళను ప్రధాని సోమాలియాతో పోల్చడం బాగా బాధపెట్టి ప్రభావం చూపించింది.పిన్నరాయి విజయన్‌ అచ్యుతానందన్‌ల మధ్య ఘర్షణ వుంటుందని ప్రత్యర్థులు చేసిన ప్రచారాలూ నిలవలేదు. వారిద్దరూ ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు ప్రత్యక్షంగా ప్రచారం చేశారు కూడా.మొత్తంపైన కేరళ ఫలితాలు వామపక్షాలకు చాలా ఉత్సాహమిస్తాయి.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ తిరిగి వస్తుందనే సూచనలు మొదటి నుంచి వున్నాయి. ఎక్కువ సంస్థలు 160,170 మధ్య స్థానాలు ఇచ్చాయి. ఒక్క యాక్సిస్‌ మై ఇండియా మాత్రం 250 వరకూ ఇవ్వడం కొంత అతిశయోక్తిగా వుంది. వామపక్షాలు కాంగ్రెస్‌ అవగాహన మమతా బెనర్జీ దూకుడుకు కొంత పగ్గం వేయగలిగిందని అర్థమవుతుంది. సిపిఎంకు 75, కాంగ్రెస్‌కు 45 వస్తాయని ఒక పోల్‌ చెప్పగా యాక్సిస్‌ మినహా ఎక్కువ భాగం వందపైనే చూపించాయి. హింసా దౌర్జన్యాలను అరికట్టగలిగితే ఈ ఫలితాలు మరింత మెరుగ్గా వుండి వుండేవి. ఎన్నికల ఓటమి ఎలా వున్నా కమ్యూనిస్టు కంచుకోట
కూలిపోయినట్టే జరిగిన ప్రచారాలు నిజం కాకపోవచ్చు. ఈ మెరుగుదలనుంచి మరింత పుంజుకోవడానికి సిపిఎం వామపక్షాలు ఎలాటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.
ఈ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్నిటిలోకి ఆసక్తి కలిగించేది తమిళనాడు.లో డిఎంకె విజయ సూచన. మామూలుగా ఉభయ డిఎంకెలు వెంట వెంట గద్దెక్కడమే అక్కడ పరిపాటి. కాని అవినీతి కేసుల నుంచి బయిటపడి అన్నిచోట్లా అమ్మ మోత మోగించిన జయలలిత మరోసారి నెగ్గవచ్చనే కథనాలు వచ్చాయి.తొలి సర్వేలు కూడా అలాగే వున్నాయి. దానికి తోడు అవినీతి విషయంలో ఉభయ డిఎంకెలకు తేడా లేకపోవడంతో ఆ ఆంశం గప్‌చిప్‌గా దాటేస్తూ వచ్చాయి. అయితే చెన్నై వరదల సహాయ చర్యల్లో వైపల్యం తదితర అంశాలు తీవ్రమైన అసంతృప్తి పెంచాయి. మద్యపానం ప్రబలిపోయి మనీ సర్క్యులేషన్‌ దెబ్బతిని ఆర్థిక కార్యకలాపాలు మందగించాయనే భావం పెరిగింది. ఈ నేపథ్యంలో కరుణానిధి మద్యనిషేదం అమలు చేస్తానని ప్రకటించడం ఆకర్షించింది. కొయంబత్తూరు నుంచిపరిశ్రమలు శ్రీలంకకు తరలిపోవడం, జాలర్లను చీటిమాటికీ అరెస్టులు చేయడం,.కరెంటు కోత, అప్పు భారం రెట్టింపుగా రెండు లక్షల కోట్లు దాటిపోవడం ఇవన్నీ జయలలితపై విముఖత పెంచినట్టు కనిపిస్తుంది. కరుణానిధి చివరి సారి పోటీ చేస్తున్నారనే భావం కూడా వుండొచ్చు.కమ్యూనిస్టులు ఇతరులతో కలసి ఏర్పాటు చేసిన పీపుల్స్‌ వెల్ఫేర్‌ అలయన్స్‌,దానితో పొత్తుపెట్టుకున్న విజయకాంత్‌ డిఎండికె, వైగో పిఎంకె వంటి అంశాలు పెద్ద ప్రభావం చూపడం లేదని పరిశీలకులకు అర్థమై పోయింది. అయినా చివరి ఫలితాలు వస్తేగాని ఇదమిద్దంగా అంచనా కట్టడం సాధ్యం కాదు.
కేంద్ర పాలకపార్టీగా బిజెపి పరిమితులనూ దెబ్బతిన్ని నిన్నటి జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ దీనావస్థను ఈ ఎగ్జిట్‌పోల్స్‌ సూచిస్తున్నాయి. పూర్తి ఫలితాల తర్వాత మరింత విశ్లేషణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *