‘ప్రత్యేక’ వదలి విద్యార్థులపై వైరమేల?

vnkayya111
వెంకయ్య నాయుడు గారు కేంద్రంలోని సీనియర్‌ మంత్రుల్లో ముఖ్యులు. బిజెపి మాజీఅద్యక్షులు. ఆంధ్రప్రదేశ్‌కు కీలక సమస్యగా మారిన ప్రత్యేక హౌదా వివాదానికి ఆద్యుడు బాధ్యుడు ఆయనే. ఇప్పుడు దానిపైన టిడిపి బిజెపి విమర్శల ప్రహసనం నడిపిస్తుంటే వెంకయ్య నాయుడు ఆ విషయంలో స్పష్టత ఇస్తారని ఎవరైనా భావిస్తారు. ఆశిస్తారు. కాని ఆయన దానిపై నోరు మెదపకుండా తమ వైఖరి ఎందుకు మారిందో వివరించకుండా విద్యార్థులపై దాడికి దిగడం నిజంగా విడ్డూరం. హెచ్‌సియు విద్యార్థి సంఘ ప్రదానకార్యదర్శి రాజ్‌కుమార్‌ సాహు ఎస్‌ఎప్‌ఐకి రాజీనామా చేస్తూ లేవనెత్తిశ్రీన ఆరోపణలు ఆయన వల్లెవేస్తున్నారు. అది కూడా ఎక్కడ అంటే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో! విద్యార్థులు రాజకీయాల జోలికి వెళ్లకుండా చదువుపై కేంద్రీకరించాలని చెప్పే ఈ మాజీ ఎబివిపి నాయకుడు గతంలోనూ జెఎన్‌యు విద్యార్థి సంఘాద్యక్షుడు కన్నయ్యను కమ్యూనిస్టులే హీరోను చేశారని ఆక్రోశించి తన వంతు ప్రచారం చేసి పెట్టారు. ఆ కన్నయ్య బృందంపై క్రమశిక్షణా చర్యలను డిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు నిలుపు చేసింది. హెచ్‌సియులో వివాదాలకు మూలమైన విసి అప్పారావు వెంకయ్య నాయుడు సన్నిహితులని బిజెపి వారే చెబుతుంటారు. ఆ బంధం ఎంతో బలమైంది కనుకనే ఇన్ని సంక్షోభాల తర్వాత కూడా వెంకయ్య నాయుడు హెచ్‌సియు విద్యార్థి ఉద్యమంపై విరుచుకుపడుతున్నారు. ఆ ఉద్యమం కాంగ్రెస్‌ కమ్యూనిస్టుల నిధులతో నడుస్తుందని సాహు చేసిన ఆరోపణను దేశమంతా ప్రచారంలో పెడుతున్నారన్నమాట. విరాళాలు వసూలు చేయకుండానే వారు ఆంధ్రాయూనివర్సిటీలో ఎబివిపిని నడిపారేమో తె లియదు .. మేము హుండీ పెట్టి బహిరంగంగానే విరాళాలు కోరామని విద్యార్థి నాయకులు సమాధానమివ్వాల్సి వచ్చింది.ఆయన లాటి పెద్దలు స్వయనా సందర్శించి సయోధ్య కోసం ప్రయత్నిస్తే అదోరకం కాని పిల్లలతోకయ్యం రాళ్లు రువ్వడం సబబేనా? కమ్యూనిస్టులపై సైద్ధాంతిక ద్వేషం, కాంగ్రెస్‌తోరాజకీయ వైరం వుండొచ్చుగాని దాన్ని జెఎన్‌యులోనూ హెచ్‌సియులోనో బాధిత విద్యార్థుల మీద అందులోనూ అణగారిన తరగతుల నుంచి వచ్చిన వారిమీద ప్రదర్శించడం సరైందేనా? విద్యార్జనకు నష్టం కలగకూడదని, అదే సమయంలో విద్యార్థులకు న్యాయం జరగాలని ప్రజాస్వామిక వాదులు కోరుకుంటారు. అంతేగాని వారికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి దాడి చేయడం పెద్దరికం అనిపించుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *