ఆర్థిక దుస్థితికి మూడు ఉదాహరణలు…

పేదరికం,కష్టాలు, ఉపాధి వంటి మాటలు వింటే కొంతమంది పై తరగతి మిత్రులకు తేళ్లుజర్రులు పారతాయి. ఎప్పుడూ అదేనా అభివృద్ధిని చూడమని ఆగ్రహిస్తారు వాళ్లు. కాని ఇప్పటికి ఆయిదారుసార్లు స్వయాన సుప్రీం కోర్టు కరువు పరిస్థితులపై ఆగ్రహం వెలిబుచ్చడం ఇలాటి వారు గమనించాల్సిన కఠోర వాస్తవం. అందులోనూ తెలుగువారైన ఎన్.వి.రమణ కరువు పట్ల బాధ్యత లేదా అని ఇన్ని సార్లు నిలదీయవలసి వచ్చింది. సామాజికన్యాయాన్ని గాలికి వదిలేశారనీ, ఉపాధికూలీలకు బకాయిలు చెల్లించడం లేదని చివాట్లు పెట్టింది. ఉన్న నిధులను వెచ్చించి ఆదుకోమని ఆదేశించింది.
రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ కేంద్రానికి రుచించని నిష్టుర సత్యాలు చెబుతుంటారు. తాజాగా ఆయన ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదని నిజం చెప్పేశారు. వినిమయదారుల ధరలు మార్చిలో 4.83శాతం పెరిగితే ఏప్రిల్‌లో వూహించిన దాన్ని మించి 5.39శాతం పెరిగాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. అలాగే ఏడు శాతం అబివృద్ధి రేటు బాగానే వున్నా దారిద్య్రాన్ని తగ్టించేందుకు అవసరమైన 8శాతం రేటుకు చాలా దూరంలో వున్నామని వివరించారు. అయితే ఆటో సిమెంటు అమ్మకాలు పుంజుకుంటున్నాయి గనక వర్షాలు బాగా పడితే అభివృద్ధి రేటు పెరుగుతుందేమో చూడాలన్నారు. నిజాలు చెప్పే రఘురాం రాజన్‌పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాడి వెనక కూడా రాజకీయ ఉద్దేశాలు వున్నాయనే నిపుణులు భావిస్తున్నారు.
ఇక మూడవది పారిశ్రామికాభివృద్ధి మార్చిలో 0.1శాతం వుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పతాక శీర్షిక నిచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో 2.5శాతం వున్న పారిశ్రామికాభివృద్ధి ఇంతగా పడిపోవడం వల్ల అనుకున్న ప్రకారం ఆర్థికాభివృద్ది సాదించడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది.