విద్యార్థుల్లోనూ ఫిరాయింపు క్రీడలా!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎప్ఐ తరపున ప్రధాన కార్యదర్శిగా గెలిచి అక్కడ పోరాటంలో పాల్గొంటున్న రాజ్‌కుమార్ సాహు సంస్థకు రాజీనామా చేయడం తీవ్ర విషయమే. ఎస్‌ఎప్‌ఐకి ఇది ఇబ్బందికరమే కూడా. ఎందుకంటే కీలకమైన ప్రధాన కార్యదర్శి స్థానం పోవడమే గాక తన విమర్శలను కూడా ఎదుర్కోవలసిస పరిస్థితి. ఇప్పటికే సాహును బహిష్కరించినట్టు ఎస్ఎప్ఐ ప్రకటించింది. రోహిత్ వేముల మరణం తర్వాత సాగుతున్న ఆందోళనలో గట్టిగా పొల్గొన్న రాజ్‌కుమార్ సాహు ఇప్పుడున్న విసి అప్పారావును తొలగించాలని తీర్మానం కూడా ప్రతిపాదించారు. అలాటి విద్యార్థినేత ఇప్పుడు విసికి అనుకూలంగానూ విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగానూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా అందుకు కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. తన డిపార్టుమెంటులో విసి అనుకూల అధ్యాపకుల ఒత్తిళ్లు బెదిరింపులు ఇందుకు దారితీశాయని ఇతర విద్యార్థులంటున్నారు.
విసి రహస్య ప్రవేశం సందర్భంగా జరిగిన నిరసనలో రాజ్‌కుమార్ సాహు పాల్గొన్న ఒక చిత్రం చేజిక్కుంచుకుని దాని ఆధారంగా బెదిరించినట్టు సమాచారం. ఒకసారి చర్యకు గురైతే భవిష్యత్తు నాశనమైపోతుందని బయపెట్టడంతో స్వతహాగా బాగా చదువుకునే సాహు వారు చెప్పినట్టు వినడానికి అంగీకరించారని తెలుస్తున్నది. ఉద్యమానికి దూరంగా వుండటం తన ఇష్టమే గాని నిన్నటి వరకూ పనిచేసిన సంస్థపై ఒక్కసారిగా వ్యతిరేక ప్రచారంచేయడం, ఉద్యమానికి రాజకీయ పార్టీలు పెట్టుబడులు పెడుతున్నాయని నిందలు వేయడం తనలో వచ్చిన మార్పును సూచిస్తుంది. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లోనే జీతాలు సరిగ్గా ఇవ్వరు గాని ఇక్కడ పెట్టుబడులు పెట్టి నడిపిస్తారనడం విద్యార్థులను అవమానించడమే. అన్యాయంగా హాస్టళ్లు మూసివేసి రోడ్డుపై నెట్టినప్పుడు అన్నం వండిపెట్టడం ఎవరు చేసినా అందులో పొరబాటు లేదు. కాని ఉన్న త విద్యావంతులు చైతన్యవంతులైన విద్యార్థులు అందులోనూ అణగారిన వర్గాల వారు మరెవరి చేతుల్లోనే రాజకీయ పావులుగా పనిచేస్తున్నారని ఆరోపించడం మొత్తం యువతను అవమానించడమే అవుతుంది. బయిటకు వెళ్లడాన్ని సమర్థించుకోవడానికి సాహు ఈ మాటలు చెబుతుండొచ్చు. అతన్ని బహిష్కరిస్తూ ఎస్ఎప్ఐ చేసిన నిర్ణయంపైనా విమర్శలు వుండొచ్చు. కాని సామాజికన్యాయం కోసం జరిగే ఉద్యమం కిరాయిఉద్యమంగా చిత్రించడం మాత్రం ఫిరాయింపు నీతికి నిదర్శనం అవుతుంది.
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖ:డ్లలో ఫిరాయింపులను ప్రోత్సహించిన మాతృసంస్థ బిజెపి అనుభవం చూసి ఉత్తేజపడిన అనుబంధ ఎబివిపిని కూడా విద్యాలయాల్లోనూ వాటిని ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది.దీనివల్ల వాతావరణం కలుషితం అవడమే తప్ప ఒరిగేది వుండదు. సాహు వీసీని ఇంతగా వెనకేస్తున్నప్పటికీ ఆయన పోలీసు బలగాలు లేకుండా విధులు నిర్వహించే పరిస్థితి లేదు. అత్యధిక సమయం విడిదినుంచే పనిచేస్తూ ఎప్పుడైనా పహారాతో అధికార కార్యక్రమాలు చేశాననిపిస్తున్నారు. నిజంగా ఆయన దోషి అయితే ఎలాగూ శిక్ష పడుతుందని సాహు అన్నారు కాని నిజంగా ఆయన నిర్దోషి అయితే నేరుగా బాధిత విద్యార్థులతో మాట్టాడి విచారం వెలిబుచ్చి ప్రశాంతత పునరుద్ధరించేందుకు మరింత చొరవ చూపివుండేవారు కదా! తాను తల్లిలాటిదాన్నని ప్రకటించిన కేంద్ర మంత్రి సృతి ఇరానీ అయినా పిల్లల తరపున మాట్లాడేవారు కదా! జెఎన్‌యులో నూ హెచ్‌సియులోనూ కూడా విద్యార్థుల ఆందోళనను అణచివేయడం, వామపక్ష సామాజిక సంస్థలను దెబ్బతీయడం తప్ప సాధారణ పరిస్థితికోసం జరిగిన ప్రయత్నాలేమున్నాయి? శిక్షణా చర్యల పేరిట కక్షసాధింపులే కనిపిస్తున్నాయి. ఇలాటప్పుడు రాజ్‌కుమార్ లాటి వారు నిలబడలేక అభిప్రాయాలు మార్చుకోవచ్చు గాని అంతమాత్రాన నిన్నటివరకు తను కూడా చేసిన దాన్ని తనే అవమానించుకోనక్కర లేదు.ఇలాటి ఉద్యమాలలో ఒకరో ఇద్దరో మారిపోయినా జారిపోయినా పరిస్థితి మారిపోతుందనుకోవడం పొరబాటు. కాకుంటే రాజ్యాంగబద్దమైన విలువలు పాటించాలంటున్న రాజ్‌కుమార్ ఆ ప్రకారమైతే ఎస్ఎప్నుంచిదూరం అవుతున్నప్పుడు దానితరపున తాను గెలిచిన ప్రధాన కార్యదర్శి పదవిని వదలిపెట్టడం కనీస ధర్మం. లేకపోతే స్వార్థపరులైన రాజకీయ వేత్తలనే అనుసరించి అలాగే కొనసాగుతానంటే ఆవేశం మెండుగా వుండే విద్యార్థులు ఆమోదించరు.