నిర్బంధంతో రాజధాని నిర్మాణమా?

ఒక భారీ ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ప్రభుత్వ అధికార పీఠంలో కార్మికులు మరణిస్తే ఆందోళన చేయొద్దనడం ప్రజాస్వామ్యమా? గత రెండురోజులుగా వెలగపూడిలోనూ రాజధాని ప్రాంతంలోనూ సాగుతున్న పోలీసు నిర్బంధం, నిషేదాజ్ఞలు, అరెస్టులు కేసులు వంటివి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతున్నట్టని సందేహం కలుగుతుంది. ప్రజారాజధాని నిర్మించాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని పాతరేయవలసిందేనా ? ఇప్పటికి ఇద్దరు కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. విపరీతమైన పనిభారం నిబంధనలు పాటించకుండా పనిగంటలు, పారదర్శకత లేని పెత్తందారీ పోకడలు ఇవన్నీ పనిచేసేవారి ప్రాణాలే హరిస్తున్నాయని వేదన చెందుతున్నా వినే నాథుడు లేడు. అసలు ఎపి రాజధాని నిర్మాణంలో ఎక్కడి నుంచో తెచ్చిన యుపి కార్మికులను వినియోగించడంలోనే దురుద్దేశం దాగుంది. వారైనా పొట్టపోసుకోవడానికి వచ్చారు గనక వ్యతిరేకత అవసరం లేదు గాని వూరూ పేరూ లేనివారైతే ఇష్టానుసారం పనిచేయించుకోవచ్చన్నది ఇక్కడ మామూలు మాయోపాయమే. వారికి బయిటి ప్రపంచంతో పెద్ద సంబంధాలు అనుమతించడం లేదు. అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నా స్థానికంగా కొందరు మీడియా వారిని, అంతకు మించి పోలీసులను లోబర్చుకుని బయిటకు రాకుండా చేస్తున్నారు. రాజకీయ రియల్ మాఫియాలు ఎలానూ వున్నాయి. మంగళవారం నాడు దేవేందర్ మృతి ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని అభేద్య పోలీసు దుర్గంగా మార్చేశారని ఇంగ్లీషు పత్రికలు కూడా రాశాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా అనేక మందిని అరెస్టు చేసి కేసుల చిట్టా తగిలించారు. నిజంగా కేసులు పెట్టాల్సింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా న్యాయం కోసం నిరసన తెలిపే వారిపైనా? ఇదేగాక అక్కడ ప్రైవేటు నిర్మాణాలలో కూడా బయిటి కార్మికులనే వాడుతున్నారు. వారు ఏ మాత్రం మాట్లాడినా వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బెదిరిస్తారు. కార్మిక నేతల ప్రవేశాన్ని అడ్గుకుని అరెస్టులు చేస్తారు. ఆంక్షలు పెడతారు. ఇదంతా ఒక విషవయలయంగా మారిపోతున్నది.మీడియాలోనూ ప్రబలిన పాక్షికత కారణంగా ఈ సమాచారం బయిటకు రావడం లేదు. వచ్చిన వాటిపై మంత్రులు మాట్లాడ్డం లేదు. ఆందోళనల తర్వాత మృతుడైనకార్మికుడి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నారుగాని అంతకు ముందు మరణించిన వారి మృతదేహాలను గప్చిప్గానే తరలించేశారు. నిజానికి వీటిని ప్రమాద మరణాలుగా చెబుతున్నా అహౌరాత్రాలు పనిచేయించడం వల్ల అలసి పోయి అసహాయంగా మరణానికి చేరువవుతున్న పరిస్థితి.భారీ వ్యయంతో జరుగుతున్న సచివాలయం వంటి కీలక నిర్మాణంలో ఈ దారుణ పరిస్థితి సిగ్గుచేటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పోలీసు శాఖల కనుసన్నల్లో ఇదంతా జరగడం కొందరు ప్రజా ప్రతినిధులు సినిమా స్టార్లు వాణిజ్యవేత్తలు కూడా చేతులు వేస్తుండడం మరింత ఘోరం. కమ్యూనిస్టులపై విరుచుకుపడిదాడి చేసినా లేక ప్రతిపక్షాలను తిట్టిపోసినా కడుపుమండిన కార్మికుల బాధ కోపం చల్లారవు. ఇప్పటికైనా ఈ నిర్బంధ విధానాలను నిరంకుశపోకడలను మానుకోకపోతే నిరసన పెరుగుతుందే గాని తగ్గేది కాదు.ఇక్కడ చేసిన ప్రతివ్యాఖ్యకు స్పష్టమైన ఆధారాలున్నాయి. బాధ్యత గల అధికారులు ప్రభుత్వ నేతలుజోక్యం చేసుకోకపోతే రాజధానిలో రాజకీయ నిరసన జ్వాలకు వారే బాధ్యత వహించాల్సి వస్తుంది.