అదెలా, కెటిఆర్ గారూ?

తెలంగాణ మంత్రి, యువ నాయకుడు కె.తారకరామారావు ఇటీవల చేసిన వ్యాఖ్యానాలలో రెండు అంశాలపై వ్యాఖ్యానించాలనిపించింది.
మొదటిది-పాలేరులో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాననే సవాలు. నిజం చెప్పాలంటే ప్రజాకర్షణకు తప్ప ఈ సవాళ్లు పెద్దగా అవసరముండదు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో ఆయన వంద స్థానాలు రాకుంటే రాజీనామా చేస్తానని సవాలు చేశారు. అయితే ఆ సవాలును ఎవరూ స్వీకరించలేదు గనక కట్టుబడివుండనవసరం లేదని కూడా తర్వాత అన్నారు. నేనూ ఆ మాటే చెప్పాను. ఏమైనా టిఆర్‌ఎస్ 99 తెచ్చుకోవడం వల్ల సవాలుకు పెద్ద ఇబ్బంది లేకపోయింది.(మజ్లిస్‌కు ఒకటి తెలిసీ వదిలేశామంటారు) అయినా రేవంత్ రెడ్డి వంటివారు సవాలును ప్రస్తావించారు కూడా. ఇటీవల పాలేరులో సవాలు గెలుస్తామని తప్ప ఇంత మెజార్టి అని గాని అవతలివారికి డిపాజిట్టు కూడా రావు అని గాని తీవ్రమైన పదాలేమీ వాడకపోవడం గమనించదగ్గది. ఈ మాటే అంటే కాంగ్రెస్ గెలుస్తామని సవాలు చేస్తున్నది గనక దానికి సమాధానంగా అలా చెప్పారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి ఒకరు వివరణ ఇచ్చారు. ఏమైనా రిస్కు తీసుకోకపోవడం మంచి విషయమే. పాలేరులో ఓట్లు త్రిముఖంగా చీలిపోయే అవకాశం చాలా వుంది. అలా జరక్కపోతే నిజంగానే గత వరవడి మారిపోయిందని నిర్ధారించుకోవలసి వస్తుంది.
ఇక రెండవది వారసత్వ రాజకీయాలను తాను బలపర్చనని చెప్పడం. ఇది ఆయన భావమై వుండొచ్చుగాని ఇప్పుడాయన ఉన్న స్థితికి పెద్దగా పొసగదు. ఉద్యమంలో పాల్గొనడం, ఎన్నికల్లో గెలవడం, విశ్లేషణల్లో చర్చల్లో పాల్గొనడం, ఐటి, ఎన్నికల ప్రచార బాధ్యతలు చేసిన మాట నిజమే. విమర్శలు వున్నా బాగానే చేస్తున్నారని భావించేవారు ఎక్కువగానే వున్నారు.వీటికి బలం చాలావరకూ వారసత్వంలో వున్నదనేది కూడా కాదనలేని సత్యం. రాముతో మాట్లాడండి అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అలవాటైన మాటగా చెప్పుకుంటున్నారంటే దానికి కుటుంబ నేపథ్యం ప్రధాన పాత్ర వహించడం లేదా? ఇది టిఆర్‌ఎస్‌లోనే వున్నది కాదు, దేశమంతటా అన్ని పాలకపార్టీలలో వున్నదే గనక ప్రత్యేకించి తప్పుపట్టే పరిస్థితి లేదు. కాని ఇప్పటికే వారసత్వ నిర్ణయం జరిగిపోయిందనే భావం బలంగా వుండగా కెటిఆర్ మాటలు రాజకీయ వర్గాలు లాంఛనప్రాయమైనవిగానే తీసుకుంటాయి. నిజంగా ఆయనకు అలాటి భావమే వుండివుంటే మొదటినుంచి మరింత జాగ్రత్త పాటించి వుండాల్సింది. ఇప్పటికైనా ఆ అవకాశం వుంది. అలాగాక ఒకవైపున యువరాజ పట్టాభిషేకం మరోవైపున వారసత్వంపై వైముఖ్యం ఎలా కుదరుతుంది? నేను టిఆర్‌ఎస్‌లో వారసత్వ వైరుధ్యాల గురించి గానీ, సమర్థతల గురించి గాని వ్యాఖ్యానించడం లేదు. కేవలం కెటిఆర్ మాటలపైనే ఈ స్పందన.
కెసిఆర్ ఆరోగ్యంపై కథలు నేనెప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. ఆయన దీర్ఘకాలం నాయకత్వం కొనసాగించాలనే అందరూ కోరుకుంటారు. పంజాబ్‌లో ప్రకాశ్ సింగ్ బాదల్, కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడులో కరుణానిధి వంటివారు కుమారులకు పూర్తి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఈ మధ్యనే ఎవరో వ్యాఖ్యానించారు. ఇందుకు భిన్నంగా యుపిలో ములాయం సింగ్ అఖిలేష్‌కు ఏకంగా పగ్గాలిచ్చేశారు. అది చూసి లోకేశ్‌ను కూడా అలాగే చేయాలని చంద్రబాబు నాయుడు మరింత ఉత్సాహపడ్డారు. ఈ విషయంలో కెసిఆర్ కెటిఆర్ వ్యూహం ఎలా వుంటుందో వుందో తెలియదు గాని వారసత్వ ముద్ర మాత్రం తేలిగ్గా తొలగేది కాదు.. బహుశా అది లేకుంటే జరగదు కూడా.