ఉద్యోగ యువతిపై చాందసుల దాడి

పూనాలో మరోసారి చాందస వాదులు విజృంభించారు. పోలీసులు పరోక్షంగా సహకరించారు. అందుకే మే ఒకటవ తేదీన జరిగిన దౌర్జన్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు సాయింత్రం 5.30 గంటలకు 22 ఏళ్ల ఒక యువతి తన స్నేహితులతో కలసి కారులో ఇంటికి వస్తుండగా కొందరు మధ్యలో అడ్డగించారు. ఆమె వస్త్రధారణ బాగాలేదని, మగస్నేహితుడితో వచ్చిందని ఆగ్రహించిన అనధికార నైతిక సంరక్షక మూక ఆమెపై దాడి చేసి అవమానించింది.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చిన్న ఫిర్యాదు నమోదు చేసి పంపించేశారు. అయితే ఈ ఘటనపై స్థానికంగా దుమారం రేగడంతో వారం ఆలస్యంగా రంగంలోకి దిగి దుండగులను అరెస్టు చేశారు. అమిత్ ముఖేదర్, శుభాగుప్తా, యోగేష్ చౌగాలా, శ్రావణ్ సింగ్వీ, తుషార్ గిద్వానీలు అరెస్టయినవారిలో వున్నారు. వారు ఆ కారు బయిలుదేరినప్పటినుంచి ఇంటి వరకూ వెంబడించారు. ఇల్లు చేరబోతుండగా అడ్డగించి ఆమెను బలవంతంగా దింపి షార్టులు వేసుకున్నదనీ రాత్రి వేళ అబ్బాయిలతో తిరుగుతుందని కొట్టారు. వెంటనే ఆమె కొండ్వా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదట. ఇప్పుడు వారిని అరెస్టు చేయడంతో పాటు ఆ రోజున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా విధి నిర్వహణను నిర్లక్ష్యం చేసిన పోలీసులపై విచారణ ప్రారంభించారు. ఇప్పుడు అరెస్టయిన వారిపై 354,323,504,34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
చివరగా చెప్పుకోవలసిందేమంటే ఎవరు ఏ దుస్తులు వేసుకోవాలి ఏమి తినాలి ఎవరిని పూజించాలి లేక ఏ సంప్రదాయాలను పాటించాలి అన్నది వారి స్వేచ్చకు సంబంధించింది తప్ప శాసించే అధికారం ఎవరికీ లేదు. పైగా మహిళపై దౌర్జన్యం చేయడం సమాజానికి అవమానంసంస్కారానికి కళంకం. ఇవన్నీ చేసే ప్రబుద్దులు మతతత్వ వాదులెవరో వేరే చెప్పాలా? ఈ పోస్టుపై జరిగే దాడి చూస్తే చాలు!