ఉత్తరాఖండ్ ఓటింగ్ రాజ్యాంగ పాఠం

,ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధిక్యత రావడం వూహించిన పరిణామమే. ఈ వూహ బిజెపికి అందరికన్నా ఎక్కువ కనుకే అక్కడదాకా వెళ్లనీయకుండా రాష్ట్రపతి పాలన ప్రహసనం నడిపించింది. ఎందుకంటే వున్న బలాబలాల పొందికను బట్టి అది గెలిచే అవకాశం శూన్యం. మంగళవారం పర్యవేక్షకుల సమక్షంలో జరిగిన ఓటింగులో రావత్ నెగ్గినట్లు అనధికార సమాచారం. తీర్మానానికి అనుకూలంగా 33 ఓట్లు రావడం అంటే అవసరమైన దానికంటే రెండు ఎక్కువ. ఇక తొమ్మిది
మంది ఫిరాయింపు ఎంఎల్‌ఎలను అనర్భులుగా ప్రకటించడంతో బిజెపికి స్వంత బలమైన 28 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఫలితాన్ని అధికారికంగా పరిశీలించి సుప్రీం కోర్టు బుధవారం ప్రకటిస్తుంది గాని ఈ లోగానే పరిస్థితి అందరికీ తెలిసిపోయింది. బిజెపి నేత కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే తాము నైతికంగా గెలిచామని చెప్పడం హాస్యాస్పదం. ఏమంటే హరీష్ రావత్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడన్నారు గాని మొదట ఫిరాయింపులకు పాల్పడిందే వారు. ఆ తర్వాత కూడా ఆయన గట్టెక్కే అవకాశం వుండటంతో రాష్ట్రపతి పాలన విధించి న్యాయస్థానాల్లోనూ అభిశంసనలకు గురైంది కూడా బిజెపి కేంద్రమే.ఈ రోజు కూడా ఓటింగుకు ముందు బిజెపి ఎంఎల్‌ఎ ఒకరు రావత్ వైపునకు వెళ్లడం విచిత్రం! ఇద్దరు సభ్యులు గల బిఎస్‌పిఅధికారికంగా రావత్‌ను బలపర్చడం, మరో స్వతంత్ర సభ్యుడు కూడా ఓటేయడం, రావత్‌ను గట్టెక్కించింది.బొమ్మై కేసు తీర్పు తర్వాత మరో చారిత్రిక నిర్ణయానికి ఉత్తరాఖండ్ పరిణామాలు దారితీయొచ్చు. బిజెపి మార్కు ఫిరాయింపులు, కేంద్రం ఏకపక్ష ధోరణులకు ఇదో ఎదురుదెబ్బ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరిగానే వ్యాఖ్యానించారు.ఇకనైనా ఇలాటి దుస్సాహసాలు దుస్తంత్రాలు మానుకుంటే బెటరు.