ప్రత్యేకహౌదా రాజకీయ చంద్రజాలం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ప్రసక్తి కాదు కదా ప్రస్తావన కూడా లేదని కేంద్ర మంత్రులు విఎస్‌చౌదరి మొదట, జయంత్ సిన్హా తర్వాత కుండ బద్దలుకొట్టి చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి బిజెపి చట్రంలో కీలక వ్యక్తి- ఎపికి కేటాయింపులు హౌదాలపై ఏవో వివరణలతో కాలం గడిపిన న్యాయకోవిదుడు అరుణ్‌జైట్లీ ఇచ్చిన కొద్దిపాటి నిధుల వివరాలు వెల్లడించి సరిపెట్టారు. ఇదంతా అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హౌదాపై కేంద్రానికి స్పష్టత లేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుంది. నిజానికి కేంద్రం ప్రకటన వచ్చిన తర్వాత కలసిన ఒకరిద్దరు తెలుగుదేశం నేతలు బిజెపి బూటకత్వాన్ని బహిర్గతం చేస్తూ అనేక విషయాలు బయిటపెడతామని అంటూ వచ్చారు. ఇంతలోనే చంద్రబాబు స్పీడ్‌బ్రేకర్ పాత్ర తీసుకోవడంతో గప్‌చిప్ అయ్యారు. కేంద్రాన్ని అడుగుతూనే వుంటానని ఢిల్లీ పర్యటనలు చేస్తుంటానని చెబుతున్న చంద్రబాబు ప్రత్యేక హౌదా నిరాకరణ అన్యాయమనీ, దానిపై అందరినీ కలుపుకొని ఒత్తిడిపెంచేందుకు పోరాడతానని ఎందుకు చెప్పడం లేదు? ఏ శక్తులు లేదా ఏ కారణాలు ప్రయోజనాలు ఆయనను వెనక్కు నెడుతున్నాయి? ఏబంధాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు మోడీ సర్కారుతో బ్రహ్మముడి దెబ్బతినకుండా చేస్తున్నాయి? ఇది ప్రజలు పట్టించుకోరని, వామపక్షాలు కాంగ్రెస్ దీనిపై ఢిల్లీలో పోరాడకుండా ఇక్కడ హడావుడి చేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీపై ఎలాగూ తీవ్రంగానే దాడి చేస్తారు.మొత్తంపైన వాగ్దానం చేసి ప్రత్యేక హౌదా ఇవ్వని బిజెపి కంటే, దానికోసం పట్టుపట్టి పదిమందినీ కలుపుకొని పట్టుపటట్టని ప్రభుత్వం కంటే ప్రతిపక్షాలదే నేరమన్నట్టు చిత్రిస్తున్నారు.
ప్రత్యేక హౌదా, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం నిర్మాణ వ్యయం, కొత్త రాజధానికి ఆర్థిక సహాయం అన్నవి ఎపికి నిర్దిష్టంగా ఇచ్చిన నాలుగు హామీలు. వీటివల్ల కలిగే లాభాలు కొన్నయితే భరోసా చాలా వుంటుంది. హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయ్యాక ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిన ఎపిలో ఉపాధి పెరగాలన్నా పరిశ్రమలు ఐటి వంటి రంగాల్లో చాలా విస్తరించాలి. ఆ మేరకు పెట్టుబడులు రావడానికి రాయితీలు కావాలి. ప్రత్యేక హౌదా అందుకొక ఇంధనంగా పనిచేస్తుంది..
గతంలో ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమచల్ ప్రదేశ్ పదకొండు రాష్ట్రాలకు హౌదా ఇచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక కారణాలుంటే విభజిత ఎపికి మరో విధమైన ప్రత్యేక పరిస్థితి వుంది. ఆ రాష్ట్రాలవలె గిరిజన ప్రధాన రాష్ట్రం కాకపోయినా ఇక్కడ కూడా గణనీయమైన గిరిజన ప్రాంతం బాగా వెనకబడివుంది కూడా. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడినవిగా కేంద్రమే అంగీకరించింది. అంటే సగానికిపైగా వెనకబడిన ప్రాంతమన్నమాట. గతంలో ప్రత్యేక హౌదా కారణంగా హిమచల్ ప్రదేశ్‌లో పరిశ్రమలు 34 శాతం, ఉత్తరాఖండ్‌లో 24.4శాతం పుంజుకోవడం బాగా ఉపయోగపడింది. తర్వాత అది నిలబడలేదంటే అది పాలకుల వైఫల్యం. ప్రత్యేక హౌదా లేకపోతే మనుగడే సాధ్యం కాని పరిస్థితి. మోడీ సర్కారు వాటికీ ఎసరు పెడుతుంటే ఆందోళన చెందిన ఎనిమిది మంది ఈశాన్యా ముఖ్యమంత్రులూ కలసి కట్టుగా ఒక లేఖ రాశారు.త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఎన్‌డిసి సమావేశంలో ప్రత్యేక హౌదాను నీరుగార్చవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తిచేశారు. అస్సాం ముఖ్యమంత్రి దీనిపై కోర్టుకు వెళతామన్నారు. అయినాబీహార్ ఎన్నికల ప్రచారంలో అరుణ్‌జైట్లీ అది ముగిసిన అధ్యాయం అని ప్రకటించారు. కొత్తగా కోరేవాటిని పరిశీలించకపోవచ్చు గాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కేంద్రం రాజ్యాంగ బాధ్యత.
ఎపికి ఏదో విధంగా పారిశ్రామిక ఉత్పత్తి రంగాలను పెంచకోవలసిన ఆవశ్యకత చాలా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణలకు విభజన తర్వాత పరిస్థితికి చాలా తేడా వుంటుందని తాజా వివాదాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై సహేతుక చర్చలకు ఇరు రాష్ట్రాలూ సిద్ధపడటం లేదు. ఏమైనా ఎగువన వున్న తెలంగాణ తన హక్కుగా త్వరితంగా విస్తారంగా బ్యారేజీలు పూర్తిచేసుకుంటే కిందకు వచ్చే ప్రవాహాలు గణనీయంగా ప్రభావితమవుతాయి. దానికి తోడు అసాధారణ వాతావరణ పరిస్థితులతో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. ప్రపంచీకరణ ఒప్పందాలు కేంద్రం విధానాల కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది. అలాటప్పుడు కేవలం పాత డెల్టా వ్యవస్థనూ, వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని పరిశ్రమలను ఇతర విభాగాలను పెంచుకోకపోతే ఉపాధి అభివృద్ధి రెండూ మిథ్యే అవుతాయి. ప్రకృతి వనరులు సుదీర్ఘ సముద్ర తీరం వున్న ఎపి వంటి రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు కలిస్తే అలాటి అవకాశాలు మెరుగవుతాయి. అలాగాకుంటే ఇప్పటికే విదేశీ కార్పొరేట్లచుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం రేపు కేంద్రం సహాయ నిరాకరణను సాకుగా చూపి ఆ పోకడలు మరింత తీవ్రం చేస్తుంది. తద్వారా ప్రజలు ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు శ్రామికులు అణగారిన తరగతులు మరింత నష్టపోతారు. నిజానికి కేంద్రం నుంచి రావలసినదానిపై రాష్ట్రం చూపాల్సినంత శ్రద్ద చూపకపోవడానికి ఈ కార్పొరేట్ వ్యూహం కూడా ఒక ప్రధాన కారణం. రాజధాని నిర్మాణం కూడా ప్రైవేటు వ్యవహారంగా నడిపించేందుకే అది ఆతృత పడుతున్నది.
. ఏతావాతా ఇది బిజెపి టిడిపిల రాజకీయ వ్యూహాల సమస్యగా మారిపోవడం అనుమతించరాని విషయం. కాంగ్రెస్ చట్టంలో పొందుపర్చలేదు గనక మేము ఇవ్వలేకపోయామని చెప్పడం ప్రజల ఇంగితజ్ఞానానికే అవమానం. అందరినీ కలుపుకొని అడగాల్సిన అధినేత చంద్రబాబు నాయుడే పదే పదే ఘర్షణ వద్దని వెనక్కులాగడానికి కారణమేమిటి? ఇంత జరిగాక కేంద్రంలో తెలుగుదేశం కొనసాగుతుందంటే ఇదంతా తోడుదొంగల వ్యవహారమే. కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఎపి రెవెన్యూలోటు కూడా తప్పక భర్తీ చేయాలని ఎక్కడా లేదని కొండంత అసత్యమాడేశారు. ఈ పరిస్థితుల్లో అఖిలపక్షం ద్వారా పోరాడటమే ఏకైక మార్గం. ఒకసారి పోరాటాలు ఊపందుకుంటే రేపు తమ ప్రభుత్వంపైనా కొనసాగుతాయన్న భయం తెలుగుదేశం నేతలది. ఆ భయంతో ఆంధ్ర ప్రదేశ్ ఆత్మగౌరవం మాట అటుంచి అస్తిత్వానికే సవాలు ఎదురైన ఈ సమయంలో ప్రభుత్వం మౌనంగా వుండొచ్చు గాని ప్రజలు ఈ అవమానాన్ని విశ్వాసఘాతుకాన్ని ఎంతోకాలం సహించరు. విభజిత రాష్ట్రంలో వినూత్న విశాల ఉద్యమాల సమీకరణకు ప్రత్యేక హౌదా సమస్యే ప్రేరణ అవుతుంది. వెంటనే కాకపోయినా సమస్యలు ముడిరిన తర్వాతనైనా ప్రజల అసంతృప్తి కారకాల్లో ఇది ముఖ్యంగా ముందుకు వస్తుంది. అప్పుడు ఎన్ని సమర్థనలు చేసుకున్నా ప్రయోజనం వుండదు. బిజెపికన్నా టిడిపిదే ప్రధాన బాధ్యత అవుతుంది. ఎందుకంటే బిజెపి తనదైన బాణీలో చంద్రబాబు ప్రభుత్వంపైనే నెపం పెట్టి తన దారి తాను చూసుకోవాలని చూస్తుంది. అప్పుడు టిడిపి బాణీ మార్చినా విలువ వుండదు, విశ్వసనీయతా వుండదు.