మళ్లీ క్రేజీ వాక్కులు!

Arvind_Kejriwal

ఆమ్‌ ఆద్మీపార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దేశ రాజకీయాల్లో నూతన సంచలనాలకు సంకేతమైన మాట నిజం. అయితే అదే వూపులో ఆయన అపరిపక్వంగానూ అర్థరహితంగానూ కూడా ప్రవర్తిస్తుంటారు. గతంలో చాలా సార్లు వ్యర్థ వివాదాలలో చిక్కుకున్నారు. కాంగ్రెస్‌ బిజెపిలకు తానే ఏకైక ప్రత్యామ్నాయంగా రాగలనని ఆయన నమ్ముతున్నారా అని సందేహం వేస్తుంది.నిజంగా అంత గట్టిగా కృషి చేస్తే బాగానే వుంటుంది గాని వూరికే సంచలన చర్యలతో వ్యాఖ్యలతో కుదిరేపని కాదు. తాజాగా ఆయన ఆగష్టా హెలికాఫ్టర్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ బిజెపిలను ఇరుకునపెడుతూ మాట్లాడుతున్నారు. ధైర్యముంటే సోనియాగాంధీని అరెస్టు చేయమని సవాలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో దర్యాప్తు ఎందుకు ఆలస్యమైంది ఇప్పుడు జరుగుతున్న వాదోపవాదాలు దేనికి ప్రయోజనం వంటి సందేహాలున్న మాట నిజమే. కాని ప్రధాని మోడీ రహస్యాలు సోనియా దగ్గర వున్నాయి గనకనే అరెస్టు చేయడం లేదని ఆరోపించడం హాస్యాస్పదం. ఏమంటే అంత కీలకమైన నేతను అరెస్టు చేయడమంటే చాలా పకడ్బందీగా జరుగుతుంది తప్ప కేజ్రీవాల్‌ లేక సుబ్రహ్మణ్యస్వామి అన్నంత మాత్రాన జరగదు. రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ పరోక్షంగా మాట్టాడ్డం తప్ప ఇంతవరకూ పేరు కూడా తీసుకురాలేదు. రెండు పెద్దపార్టీలకు చాలా విషయాల్లో లోపాయికారి అవగాహన వున్న మాట నిజమే. కాని ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి సాక్ష్యాధారాలుంటే బయిటపెట్టాలి లేదా సంయమనం పాటించాలి అంతే తప్ప సవాళ్లు విసిరితే పలచనవడం తప్ప ప్రతిష్ట పెరగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *