పశుమాంసం వుందని జైలుశిక్ష!

ఇంట్లో పశుమాంసం అట్టిపెట్టుకున్నందుకు గాను రఫీక ఇల్యా బక్షీ ఖలీఫా అనే వ్యక్తికి గుజరాత్‌లోని గంధేవి మేజిస్ట్రేటు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష,పదివేలు జరిమానా విధించింది. 2011లో పశువధను నిషేదిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దాని ప్రకారం పశుమాంసం కలిగివున్నాడనే ఆరోపణపై 2014 అక్టోబరులో పోలీసులు ఖలీఫాను మరొకరిని అరెస్టు చేశారు. గోవధనిషేద సంఘం సభ్యుల ఫిర్యాదు ఆధారంగా అతను పశుమాంసం రవాణా చేస్తుండగా పట్టుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆధారాలు లేవన్న కారణంగా రెండవ వ్యక్తిని వదలివేసిన మేజిస్ట్రీట్ సివై వ్యాస్ కఫీలాపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. హిందువులు గోవును పూజిస్తారు గనక దాన్ని చంపడం, మాంసం నిల్వ చేసుకోవడం మతసామరస్యానికి భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కఫీలా పేదవాడనే కారణంతో శిక్ష తగ్గించడం సరికాదని ఆ అభ్యర్థనను తోసివేశారు. అయితే 2011 చట్టం కింద తప్ప ఐపిసిలోని మరిన్ని సెక్షన్లు కలిపి పోలీసులు పెట్టిన కేసును మేజిస్ట్రీటు తోసి వేశారు.
బీఫ్ అనే ఇంగ్లీషు పదానికి పశుమాంసం అని విస్త్రతార్థం వుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా భిన్నంగా వున్నాయి.1958లో సుప్రీం కోర్టు దేశంలో పౌష్టికాహారం కొరత వున్నప్పుడు పేదలకు కాస్తయినా పుష్టిని ఇచ్చే పశుమాంసాన్ని, నిరర్థకమైన జంతుజాలాన్ని భుజించే హక్కును లాగివేయడం సరికాదని తీర్పు నిచ్చింది.వివరమైన ఆ తీర్పులో ఇంకా చాలా విశేషాలున్నాయి. 47 ఏళ్ల తర్వాత 2005లో గుజరాత్ చట్టం చెల్లుతుందని చెప్పే మరో తీర్పులో సుప్రీం కోర్టు పౌష్టికాహారం అంటే మాంసాహారమే కానక్కర్లేదని శాకాహారంలోనూ బలం వుందని వ్యాఖ్యానించింది.పనికిరాని పశువులను వధించడమే మంచిదన్న అదివరకటి తీర్పును తోసిపుచ్చుతూ ఇది గాందీజీ బుద్దుడు వంటివారు పుట్టిన దేశమని కూడా పేర్కొనడం విశేషం.