రాజన్ మాటల అర్థంవేరు

పనికి మాలిన డిగ్రీలను చూసి బ్యాంకులు అప్పులు ఇవ్వడం మంచిది కాదని రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించినట్టు మీడియాలో విస్త్రతంగా :శీర్షికలు వచ్చాయి. వాస్తవానికి ఆయన అన్నది వేరు. నోయిడాలోని శివనాడార్ యూనివర్సీటీలో ప్రసంగిస్తూ రాజన్ నాణ్యత లేని విద్యా సంస్థలలో చదివేందుకు భారీరుణాలు తీసుకొని అప్పులు పాలు కావద్దని విద్యార్థులకు లేదా వారి కుటుంబాలకు సూచించారు. బ్యాంకులు అప్పులు ఇవ్వడంలోనూ వసూలు చేసుకోవడంలోనూ ఖచ్చితంగా వుండాల్సిందేగాని విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో అవసరమైనప్పుడు మానవత్వం కూడా ప్రదర్శించాలని సలహా ఇచ్చారు. విద్యారంగంలో సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చదివిన డిగ్రీతో ఏదైనా మామూలు ఉద్యోగంలో ఇరుక్కున్న వారిపట్ట దయగా వుండాలన్నారు. ఈ రోజుల్లో పోటీ కారణంగా అత్యున్నత నైపుణ్యం శిక్షణ గల వారే నెట్టుకొస్తున్నారని చాలా మందికి అది అందుబాటులో వుండటం లేదని అభిప్రాయపడ్డారు.ఇదే వారు వెనకబడటానికి కారణమవుతుందన్నారు. అందరికీ సమాన అవకాశాలు విద్య వైద్యం వుండేలా మార్కెట్ వ్యవస్థ మారాలని చెప్పారు. విజరు మాల్యా కేసు నేపథ్యంలో మీడియా ఈ వ్యాఖ్యలను కూడా వ్యతిరేకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది.