సుప్రీం ఆదేశం-బిజెపికి ఇరకాటం – ఎపి టిఎస్‌లకు సంకేతం
ఉత్తరాఖండ్ సంక్షోభ నివారణ కోసం మే 10వ తేదీన శాసనసభలో బలపరీక్ష జరగాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం సంచలనాత్మకమైందేగాక రాజ్యాంగ ప్రాధాన్యత కలిగింది. హైకోర్టు ఉత్తర్వుపై మొదట స్టే ఇచ్చినంత మాత్రాన కేంద్రం చర్యకు సుప్రీం అనుకూలంగా లేదని మొదటే అర్థమైపోయింది. ఎందుకంటే రాష్ట్రపతి పాలనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోరాదని కోర్టు అప్పుడే హెచ్చరించింది. ఇప్పుడు ఇచ్చిన ఆదేశంలో కూడా హరీశ్ రావత్ ప్రభుత్వాన్ని బలపర్చేవారు ఒక పక్క వ్యతిరేకించేవారు మరో పక్క కూచోవాలని నిర్దేశించింది. పార్టీ ఫిరాయింపునకు గాను అనర్హత వేటు పడిన తొమ్మిదిమందికి ఓటు హక్కు కల్పించడానికి నిరాకరించింది. 10 షెడ్యూలు కింద వారిపై తీసుకున్న చర్య కోర్టు విచారణలో వున్నందున వారు ఓటింగుకు దూరం వుండాలని స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో బిజెపి ఎలా రావత్‌ను ఓడిస్తుందో చూడాల్సిందే.
ఇక ఈ కేసులో అనర్హతకు సంబంధించిన స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా కోర్టు పదవ షెడ్యూలును గౌరవించినట్టయింది. ఆయన దాన్ని అన్వయించడంలో పొరబాటు చేశారా లేదా అన్న విచారణణు ఈ బలపరీక్ష నుంచి విడదీయడం ద్వారా అనర్హతను కొనసాగించినట్టవుతుంది.ఈ భాగంలో కోర్టు తీసుకున్న వైఖరి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ స్పీకర్ల ధోరణికి అభిశంసనే అని చెప్పాలి. పార్టీ మారిన వారిపై చర్య తీసుకునే అవకాశం వున్నా వారు కావాలనే పాలకపక్షం పట్ల మొగ్గుతో వాయిదా వేసి కాలం గడిపారని కోర్టు చెప్పినట్టయింది. ముందు వారు స్పందించి వుంటే తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా వుండేది కాని ఫిరాయింపును అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం రాజకీయ పక్షపాతమని స్పష్టమైపోయింది.