ప్రజల నిరసనలో పవన్ ఎటు?

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లలో రాజకీయ పార్టీల బలాబలాల్లో ఇప్పట్లో మార్పులు సాధ్యమా అంటే ఆ అవకాశం పెద్దగా కనిపించడం లేదు. జోరుగా ఫిరాయింపులు సాగడానికి అదో ముఖ్య కారణం. ఎపి, తెలంగాణ రెండు చోట్ల కూడా పాలకపక్షాలపై అసంతృప్తి లేదని కాదు. అంతర్గతంగానే అసంతృప్తి తీవ్రంగానే వుంది. అక్కడా ఇక్కడా బిజెపికి చాలా ఆశలున్నాయి కూడా. అయితే అవి నెరవేరే పరిస్థితులు లేవు, విభజన కారణంగా ఎపిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా ఇప్పుడు బిజెపి ప్రత్యేక హౌదా వాగ్దాన భంగంతో అదే స్థితిలో పడిపోతుంది. అసలు ఆ పార్టీ కేంద్ర నాయకులకు కూడా ఆశలు లేవు గనకనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మంత్రులుగా తరతమ స్థాయిల్లో వున్న వెంకయ్య నాయుడు, బండారుదత్తాత్రేయ ఇద్దరిపైన ఆ పార్టీవారే కారాలు మిరియాలు నూరుతున్నారు. .
కాంగ్రెస్‌కు తెలంగాణలో కొంత అవకాశముందనే వాదన వున్నా నాయకుల అనైక్యత ఖర్చులు కష్టాలు తట్టుకోలేని లక్షణం. తెలుగుదేశం తెలంగాణలో దెబ్బతిన్నా ఎపిలో వ్యతిరేకత తీవ్రం కాకుండా కాపాడుకోగలుగుతున్నదంటే వైసీపీ మందగమనం, విభజనానంతర స్తబ్దత కారణాలు. విస్త్రత కార్యక్రమాలు తీసుకోవడానికి మానసికంగానూ ఆర్థికంగానూ జగన్ సిద్ధంగా లేరు. పాలకపక్షం ఎత్తుగడలు ి వైసీపీని ప్రతిష్టంభనలో పడేశాయి. కాంగ్రెస్ ఎంతగా పెనుగులాడుతున్నా తనకు తానుగా ్ల పునరుద్దరణ జరిగేది కాదు. వామపక్షాల ఎన్నికల బలం ఎప్పుడూ పరిమితమే.ఈ పరిస్థితులలో రాజకీయ పునస్సమీకరణ ఎలా జరగాలనేది పెద్ద ప్రశ్నే. ఇన్ని మల్లగుల్లాలలోనూ వైసీపీ టీడీపీల వెనక వున్న సామాజిక తరగతులు పెద్దగా చెదరేలేదు గనక నూతన పునస్సమీకరణ అంటూ వస్తే సామాజిక కోణం నుంచే రావలసి వుంటుంది.
తెలంగాణలో కన్నా ఎపిలో కులాల రాజకీయం బలంగా ప్రభావం చూపిస్తున్నది. చిరంజీవి అరకొరగా రంగప్రవేశం చేసిన నాటి పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. ఆయన తమ్ముడు హీరో అయితే పవన్ కళ్యాన్ 2019లో పోటీ ప్రకటించారు . గతంలో ఆయన బిజెపి టిడిపి రాయబారిగా పనిచేశారు. ఇప్పుడు రావడమంటూ జరిగితే ఆయన ఏ వైఖరి తీసుకుంటారనేదాన్ని బట్టి పునస్సమీకరణ సాధ్యాసాధ్యాలు వుంటాయి. బిజెపికి అనుకూలంగా వుంటే ఆయన పాత్ర ప్రభావం పెద్దగా వుండబోవు. చిరంజీవిలా గాక కనీసం తమిళనాడులో విజయకాంత్ తరహాలోనైనా గట్టిగా నిలబడితే కొంత సామాజిక పునస్సమీకరణ జరగొచ్చు. ఈ విషయం అందరికన్నా ముందే తెలుసు గనక చంద్రబాబు నాయుడు కాపులనూ బిసీలను మంచి చేసుకునేపనిలో పడ్డారు.. ే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల సమస్యలు అసంతృప్తి కేంద్రం సహాయ నిరాకరణ వంటివి సమర్థంగా ఉపయోగించుకోగల సత్తా జగన్ పెద్దగా ప్రదర్శించలేకపోయారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తూ పర్యటనలు జరపడమే తప్ప ఆయన ఇంతకన్నా భిన్నంగా వెళ్లేది వుండదు. ఇక్కడే ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఆ వెలితిని ఉపయోగించుకోవాలంటే పవన్ కళ్యాణ్ వంటివారు ప్రజల పక్షాన నిలబడాల్సి వుంటుంది. అప్పుడు ఇతరులు కూడా బలపర్చే అవకాశం వస్తుంది. అలాగాక మోడీ మెచ్చుకోళ్లకు లేదా వేడుకోళ్లకు పరిమితమైతే వారిపై వున్న నిరసన ఆయనపైకీ మళ్లుతుంది. మరి ఈ ఆరడగుల బుల్లెట్టు గగనపు వీధి వీడి వస్తారా లేక ట్వీట్లు చూసుకోమంటారా? కాలం చెప్పాలి. ఈ లోగా వివిధ రూపాల్లో నిరసనలు మాత్రం పెరగడం తథ్యం.