ఆగష్టా ప్రహసనం – రక్షణ కొనుగోళ్ల ప్రక్షాళన
గత కొద్ది రోజులుగా మీడియాలో ఆగష్టా హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంపై ఆరోపణల యుద్ధం కొనసాగుతున్నది. కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయిందనీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంచి ఆయుధం దొరికిందనీ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దాం పైబడిన ఈ ప్రహసనాన్ని మధిస్తే ఎందరో పాత్రధారులు సూత్రధారులూ, ప్రభుత్వాలూ మంత్రులూ పార్టీలు కనిపిస్తాయి. ఇంకాస్త వెనక్కు వెళితే 1986లోనే అంటే ముప్పైఏళ్ల కిందటే ముందుకొచ్చిన బోఫోర్సు కుంభకోణం నుంచి ఇప్పటి వరకూ 15 పెద్ద అవినీతి వ్యవహారాలు బహిర్గతమైనా బడాబాబులు నేతలు ఎవరూ శిక్షింపబడలేదనీ ఇప్పుడు కూడా ఈ వ్యవహారం చాలా కాలంగా నడుస్తున్నదని గుర్తించడం అవసరం. అధికారులు అధినేతలు మిలటరీ ఉన్నాతాధికారులు, మధ్య దళారీలు విదేశీ సంస్థలతో ఒక బలమైన విష వలయం అల్లుకపోయివుంది. మిగిలిన రంగాలలో కన్నా రక్షణ రంగంలో ఇవి మరింత ఎక్కువగా జరగడానికి కారణం దేశభద్రత పేరిట అంతా గప్‌చిప్‌గా లోపాయికారిగా నడవడమే. రక్షణ కొనుగోళ్లలో మధ్యవర్తులు వుండరాదని నిబంధనలు ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నారు. వాజ్‌పేయి హయాంలోనే తెహల్కా టేపులు ఈ విషయాన్ని ఘరానా సాక్ష్యాలతో నిరూపించాయి కూడా.
ఇదీ జరిగింది…
భారత వాయుసేన(ఐఎఎఫ్) వినియోగించే మిగ్ 8 హెలికాఫ్టర్లను మార్చి కొత్తవి తీసుకోవాలని 1999లో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 6000 మీటర్ల ఎత్తుకు ఎగిరేవి తీసుకోవాలని ఐఎఎఫ్ భావించింది. అయితే ఈ కొలబద్ద ప్రకారం ఒక్క కంపెనీకే అర్హత లభిస్తుంది గనక మరిన్ని పాల్గొనడానికి వీలుగా ఎత్తుతగ్గించాలని మార్పు చేశారు. అప్పట్లో వాజ్‌పేయి హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా వున్న బ్రిజేష్ మిశ్రా కూడా ఈ మార్పును ఆమోదించి 4500 మీటర్ల ఎత్తుకు ఆమోదం తెలిపారంటారు. ఈ హెలికాఫ్టర్లలో వెళ్లేది ప్రధాని మాత్రమే గనక ఆయన భద్రత చూసే ఎస్పిజి కూడా ఈ తగ్గింపును సమర్థించిందట. అయితే ఐఎఎప్ మాత్రం 6000 వుండాలని పట్టుపట్టింది. ఈ లోగా 2004లో అధికారంలోకి వచ్చిన యుపిఎ కూడా అదే భావించింది. ఎయిర్ చీప్ మార్షల్ త్యాగి 2005 మార్చి 1న బాధ్యతలు తీసుకున్నాక ఉన్నతస్థాయి సమావేశం జరిపి కొన్ని నిర్ణయాలు చేశారు. వాటి ప్రకారం 2005 మార్చి14న ఆయన 12 ఆగష్టావెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగొలు ఫైలుపై సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందం వెనక మధ్యవర్తులు వున్నారని వార్తలు రావడంతో దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని దర్యాప్తు మాత్రం లోతుగా కొనసాగించలేదు. తర్వాత 2012లో ఆగష్టా వెస్ట్‌లాండ్, దాని మాతృసంస్థ తరపున మధ్యవర్తులుగా అక్రమాలకు పాల్పడినట్టు బయిటకు వచ్చింది. గిడో హష్కే, కార్లో గెరోశాలు ఇటలీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదే వ్యవహారంలో దాని మాతృసంస్థ ఫిన్మెకానికా సిఇవోగా పనిచేసిన గ్లూస్పె ఓర్సల్ను 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో వారు భారతీయ అధికారులకు 360 కోట్ల డాలర్లు ముడుపులు చెల్లించినట్టు ఇటలీ దర్యాప్తులో తేలింది. అంతకుముందు భారతదేశంతో గట్టి సంబంధాలు కలిగిన బ్రిటిష్ పౌరుడి కుమారుడైన క్రిస్టియన్ మైకెల్ కూడా ఇందులో పాత్ర వహించినట్టు తేలింది..
అంతులేని జాప్యం
అప్పట్లో ఇటలీ అధికారులనుంచి మనం తెచ్చుకున్న పత్రాలను చూస్తే క్రిస్టియన్ మైకెల్ద్వారానూ, హష్కే గురాసో ల ద్వారానూ ముడుపులు చేతులు
మారినట్టు తేలింది. స్విడ్జర్లాండ్లోని అతని నివాసంపై 2012 ఏప్రిల్‌లో ఇటలీ దాడి చేసి ముడుపులకు సంబంధించిన వాంగ్మూలం నమోదు చేసింది. ఇండియా ట్యునిషియా మారిషస్ అమెరికాలలో పెట్టిన నకిలీ కంపెనీల ద్వారా ఈ ముడుపులను చలామణి చేశారు. ఇదంతా బయిటకు వచ్చినా ప్రభుత్వం వెంటనే కదలి రంగంలోకి దిగింది లేదు.. బ్రిటన్ నుంచి నిర్దిష్ట సమాచారం రాలేదంటూ దర్యాప్తు సంస్థలు కాలక్షేపం చేశాయి. కాకుంటే హష్కే గెరోసాల నుంచి ఎసిఎం ఎస్పి త్యాగి దాయాదులైన సందీప్ త్యాగి, సంజీవ్, రాజీవ్‌లకు 36 లక్షల యూరోలు ముడుపులు చేతులు మారినట్టు కొన్ని సాక్ష్యాధారాలు సేకరించాయి. కాని తర్వాత కూడా దర్యాప్తు ముందుకు సాగింది లేదు. ప్రతిపక్షాలు గట్టిగా కోరిన తర్వాతనే అనివార్యంగా అప్పటి రక్షణ మంత్రి ఆంటోనీ సిబిఐ విచారణకు చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరిగితే గాని ప్రయోజనం వుండదని సిపిఎం అప్పట్లోనే గట్టిగా కోరింది. కాని మొక్కుబడి తతంగానికే పరిమితమైనారు. ఎట్టకేలకు ఎన్నికల నేపథ్యంలో 2013 మార్చి 12న సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అప్పుడే ఎసిఎం త్యాగి ఇంటిపై దాడి జరిపింది. అప్పటికి పశ్చిమబెంగాల్ ్ట గవర్నర్‌గా వున్న యుపిఎ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్‌ను, గోవా గవర్నర్ బి.వి.వాంచూను విచారించేందుకు అనుమతి కోరగా రాజ్యాంగ రక్షణల పేరిట అనుమతి నిరాకరించారు.
ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌పైనా దాని అవినీతిపైనా నిప్పులు చెరిగే బిజెపి మోడీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ వ్యవహారంలో చురుగ్గా దర్యాప్తు జరిపింది లేదు.2014లో నారాయణన్, వాంచూల వాంగ్మూలాలు మాత్రం నమోదు చేశారు. ఈ ముడుపుల బదలాయింపులో సహకరించిన గౌతం ఖైతాన్ అనే లాయర్‌ను మనీ లాండ్రింగ్ ఆరోపణపై అరెస్టు చేశారు. ఇదే మొదటి అరెస్టు. అయితే మరోవైపున ప్రభుత్వం ఆ ఆగష్టా వెస్ట్ల్యాండ్తోే లావాదేవీలు పునరుద్ధరించింది. మేకిన్ ఇండియా లో భాగంగా వంద బహుళార్థ హెలికాఫ్టర్ల సరఫరాకోసం బిడ్డింగ్‌లో పాల్గొనవలసిందిగా 2014 ఆగష్టులో ఆహ్వానించింది. 35 వేల కోట్ల విలువైన సరఫరాలు 2015లో అప్పగించింది. దర్యాప్తును వేగవంతం చేయకపోగా అనుమానిత సంస్థకే ఎందుకు మళ్లీ అవకాశం ఇచ్చారనే ప్రశ్న ఇక్కడే ఉత్పన్నమవుతున్నది.ఈ మధ్యనే ఇటలీ కోర్టు విచారణలో ఆగష్టాహెలికాప్టర్ ముడుపుల భాగోతం విచారణకు వచ్చి మధ్యదళారులతో చేతులు కలిపిన ఆగష్టా మాజీ సిఇవో బ్రూనో స్పాగ్నోలినికి నాలుగేళ్ల శిక్ష పడటంతో మళ్లీ తీగ కదిలింది. రాజ్యసభలో ప్రతిపక్షాల తాకిడికి ఉక్కిరిబిక్కిరవుతున్న బిజెపి కాంగ్రెస్‌పై దాడికి ఇదో బ్రహ్మాస్త్రంగా పరిగణించింది. కోర్టు ముందుకువచ్చిన పత్రాలలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ఎపి అన్న పొడి అక్షరాలతో ఆమె సహాయకుడు ఆహ్మద్ పటేల్ వంటివారి పేర్లు ప్రస్తావించబడ్డాయని వెల్లడి కావడం బిజెపికి వరప్రసాదమైంది. దానికి సంబంధించి చట్టపరంగా పాలనా పరంగా తీసుకోవలసిన చర్యలకన్నా రాజకీయ ప్రకటనలు ప్రచారాల దుమారం పెరిగింది. పార్లమెంటు సమావేశం దీనిపైనే కేంద్రీకరించే సూచనలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించడం, చర్యలు తీసుకోవడం పొరబాటు కాదు. అవసరమే. అయితే ఈ విషయంలో ఎందుకింత జాప్యం చేశారనే ప్రశ్నకు జవాబు దొరకలేదు.
రచ్చ కాదు.. ప్రక్షాళన అవసరం
ఇదే తరుణంలో అనుమానాస్పదమైన మరో రెండు కథనాలు విడుదలైనాయి. మొదటిది ఎలాగైనా ఈ కేసు పత్రాలు కావాలనే ఆదుర్దాతో ప్రధాని మోడీ ఇటలీ ప్రధానితో అనధికారికంగా ఒకటికి రెండు సార్లు సమావేశమైనారని,ఆ పత్రాలకు బదులుగా భారత్ చెరలో వున్న ఇటలీ నేరస్త మెరైన్లను అప్పగించడానికి ఒప్పుకున్నారని ఈ కథనాల సారాంశం.అలాగే అన్ని విషయాలు వెల్లడించడానికి సిద్ధంగా వున్నానని(2015 నవంబర్)లో తాను లేఖ రాసినా ప్రధానిస్పందించలేదని ఈ కేసులో మధ్యవర్తిగా ప్రస్తావించబడిన జేమ్స్ క్రిస్టియన్ మైకెల్ మీడియాకు చెప్పారు. మొత్తంపైన కాంగ్రెస్‌పై దాడి అనుకున్నది బిజెపికి కూడా ఇరకాటంగానే మారింది. ఇంతేగాక తాము ఆగష్టా సంస్థను 2014 ఫిబ్రవరిలో బ్లాక్‌లిస్ట్‌లో పెడిత 40 రోజుల్లోే మీరెందుకు పునరుద్దరించారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మీరు లిస్టులో పెట్టారనేది అసత్యమని మోడీ ప్రభుత్వం సమాధానమిస్తున్నది గాని తానెందుకు ఆ కంపెనీనే ఆశ్రయించింది చెప్పడం లేదు.అధికారిక నోట్లో ఈ సంగతి దాచిపెట్టారని ఆరోపిస్తుంది.రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తన అభిప్రాయాలు సభలో చెప్పడం గాక వెబ్సైట్లో పోస్టు చేయడంపై హక్కుల నోటీసు ఇస్తామంటున్నారు. ఇక దళారులుగా వ్యవహరించిన హష్కే గురాసో రాహుల్‌గాంధీకి సన్నిహితుడని వారు అతన్ని కలుసుకున్నారని నిఘా వర్గాలు చెబుతుంటే నన్నే లక్ష్యంగా చేసుకోవడం సంతోషం అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. హెలికాఫ్టర్‌లో ప్రయాణించే వివిఐపిలుగా మాత్రమే సోనియా మన్మోహన్‌లను ప్రస్తావించారు తప్ప దోషారోపణ చేయలేదని కాంగ్రెస్ వివరణగా ఉంది. పత్రాలలోని సింగోరా గాంధీ(ఇటాలియన్ భాషలో శ్రీమతి) సోనియానేనని ఇంకా మిగిలిన వారు కూడా ఆమె కుటుంబానికి సన్నిహితులని బిజెపి అద్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు.2012లోనే ఆరోపణలు వచ్చినా 2013లో కాంట్రాక్టు ఎందుకు తాత్కాలికంగానే పక్కనపెట్టారు, షరతుల ప్రకారం సరఫరాల పరీక్ష ఇండియాలో గాక వారి ప్రాంగణంలోనే జరిగేందుకు ఎందుకు ఒప్పుకున్నారు అని ఆయన సవాళ్లు చేస్తున్నారు. అయితే తానెవరికీ భయపడబోనని తప్పు చేయలేదని సోనియా సమాధానమిచ్చారు. అటూ ఇ టూ తిరిగి ఈ కేసు విచారణ ఎ ందుకింత ఆలస్యమైంది ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నది స్పష్టం కాకుండా రభసలు రాజకీయ సవాళ్లతో సరిపోతున్నది.ఈ విషయంలో కాంగ్రెస్ ఆత్మరక్షణ తప్ప మరెవరూ గొంతుకలిపే అవకాశం లేదు. ే అదే సమయంలో బిజెపి ఎందుకింత జాప్యం చేసిందీ, దాంతో సంబంధాలు ఎందుకు కొనసాగిస్తున్నది కూడా తేలాల్సిందే. 2016లో రక్షణ రంగ బడ్జెట్ 2.58 లక్షల కోట్లు కాగా ఇందులో కొనుగోళ్లు వగైరాలకు కేటాయించింది 85 వేల కోట్లు. ఇంత భారీ వ్యయం కారణంగానే గాక దేశ భద్రత రీత్యా కూడా ఇలాటి వాటిని కూలంకషంగా విచారించి దోషులను శిక్షిస్తేనే రక్షణ రంగ ప్రక్షాళన సాధ్యం.
(నవ తెలంగాణ, ఎడిట్‌పేజి 4.5.2016)
ఈ వ్యాసం రాశాక రాజ్యసభలో వివరంగా చర్చ జరిగింది గాని కొత్త విషయాలేమీ కనిపించలేదు. కొత్త సమాచారంతో అవసరమైన సవరణలతో సమగ్ర వ్యాఖ్యానం మరోసారి.
