మైసూరా తెలుగులంచ్‌ ఎప్పుడో, ఏమిటో..

mysoora111మైసూరా రెడ్డికి తెలుగు నాట సీనియర్‌ రాజకీయ వేత్తగా పేరుంది. సమస్యలను అధ్యయనం చేయడం, విశ్లేషణాత్మకంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ వూపులో కాస్త కోపంగా మాట్లాడినా విషయం వుంటుంది గనక ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాంగ్రెస్‌లో దీర్ఘకాలంవుండిన ఆయన కేవలం వైఎస్‌రాజశేఖరరెడ్డితో వ్యక్తిగతంగా ఇమడలేకే తెలుగుదేశంలోకి వచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లారు.వైఎస్‌ దుర్మరణం చెందిన రోజున మేమిద్దరం ఒక ప్రముఖ ఛానల్‌లో వున్నాము. తర్వాత ఉప ఎన్నికల్లో జగన్‌పైనే పోటీ చేశారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా పరిచయముంది. చనువుగా వివిధ విషయాలు మాట్లాడుతుంటాము కూడా. జగన్‌ అరెస్టుకు రంగం సిద్ధమైనప్పుడే ఆయన వైసీపీలో చేరడం పెద్ద మలుపు. సీనియర్‌గా తన సహాయం కావాలని కోరడంతో చేరానని అప్పట్లో చెబుతుండేవారు. అయితే ఆయన అక్కడ సంతోషంగా లేరని, బయిటకు వచ్చేస్తారని చాలా కాలం నుంచి అందరూ అనుకుంటున్నదే. పదవి లేని పెద్దాయన మాకెందుకు అని కొందరు తెలుగుదేశం నాయకులు అనేవారు కూడా. రాయలసీమ ఉద్యమంలోకి వస్తాడని మరికొందరు ఆశపడేవారు. ఎట్టకేలకు జగన్‌ ఢిల్లీయాత్ర సమయంలో ఆయన రాజీనామా ప్రకటించారు. ఆరోజున టిఫిన్‌కు రమ్మని బలవంతం చేస్తే వెళ్లి అనుకోని పరిస్థితులలో వైసీపీ కండువా కప్పుకున్నానని ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. . టిఫిన్‌కు వెళ్లి అనుకోకుండా చిక్కుకున్నా అసహాయంగా వుండిపోయేంత బేలతనం ఆయనకు లేదు. ఇప్పుడు రాజీనామా చేయకముందే ఆయనకు లంచ్‌ ఆఫర్‌ వుందని కూడా రాజకీయ లోకమంతటికీ తెలుసు. మరి ఆ లంచ్‌ ఎప్పుడు చేస్తారో వారేం వడ్డిస్తారో చూడాలి. దీనికి సంబంధించిన మెనూ ముందే సిద్ధమై పోయిందంటున్నారు గాని తర్వాత మాట్లాడ్డం బెటరు. చంద్రబాబు నాయుడు పాత మిత్రుడే గనక ఆయనను అపరిచితుడు అంటూ తిరగబడే పరిస్థితి రాకుండా చూసుకోవాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *