కన్నీళ్లు కయ్యాలుకాదు, ప్రక్షాళనతోనే ‘న్యాయం’

cj33333

 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజె) త్రినాథ్‌ సింగ్‌ ఠాగూర్‌ ఆదివారంనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులఅఖిలభారత మహాసభలో కన్నీరు పెట్టుకోవడం ఆ వ్యవస్థను ఆవరించిన సంక్షోభాన్ని వెల్లడించింది. మేకిన్‌ ఇండియా అంటూ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించవచ్చు గాని వివాదాలు తలెత్తినప్పుడు సకాలంలో న్యాయం జరగదని వారు భయపడే పరిస్థితులుంటే ఎలా? ముఖ్యంగా జైళ్లలో మగ్గిపోతున్న పేద కక్షిదార్లకు తరపునే గాక దేశం తరపున అభ్యుదయం తరపున కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నానన ఆయన రుద్ద కంఠంతో ప్రశ్నించారు. మూడు కోట్ల కేసులు పెండింగులో పడివున్నాయనీ, 434 హైకోర్టు న్యాయవాదుల స్థానాలు ఖాళీగా వున్నాయని వివరమైన లెక్కలతో వెల్లడించారు సిజె త్రినాథ్‌ సింగ్‌ ఠాగూర్‌. ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌(ఎన్‌జెఎసి) విషయమై వివాదం కొనసాగుతున్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. న్యాయమూర్తుల సంఖ్య కూడా పెంచితేనే కేసుల పెండింగు తగ్గుతుందని స్పష్టంగా ప్రకటించారు.

ఇదే సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌలిక కారణాల్లోకి వెళ్లకుండా పైపై వ్యాఖ్యలతో సరిపెట్టారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చాలాసార్లు ఈ సమావేశాలకు వచ్చానంటూ చెప్పిందే చెప్పడంవల్ల ఉపయోగం లేదని తేల్చిపారేశారు. తాము పనులు చేయాలంటే కాలం చెల్లిన పాత చట్టాలు అడ్డం పడుతున్నాయని, న్యాయమూర్తులు సెలవులు తగ్గించుకుంటే కేసుల పెండింగు తగ్గుతుందని ఉచిత సలహా ఇచ్చారు. న్యాయశాఖామంత్రి సదానందగౌడ నాలుగైదు నెలలు గడిస్తే గాని ప్రక్రియ పూర్తికాదని ప్రకటించారు. అధికారుల అభిప్రాయాలు నిఘా నివేదికలు ముఖ్యమంత్రుల అభిప్రాయం తెలుసుకోడం ా సమయం తీసుకునే వ్యవహారమని, కింది కోర్టుల నియామకాలైతే రాష్ట్రాలే చూసుకోవాలని సమాధానం చెప్పారు.

కేసులు నియామకాలు ఒక భాగమే
న్యాయవ్యవస్థలో కేసుల పెండింగు, నియామకాల వివాదం ఒక భాగం మాత్రమే. న్యాయవ్యవస్థ ప్రక్షాళన, న్యాయమూర్తుల అవినీతి నివారణ, ప్రభుత్వాల జోక్యం నిరోధం, న్యాయవ్యవస్థ శాసనవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థల స్వయంప్రతిపత్తి తదితర అంశాలు ఇందులో ముడిపడివున్నాయి. ే అటు న్యాయమూర్తులు ఇటు పాలకులు కూడా సమగ్ర ప్రక్షాళణకు సిద్ధం కారు. అవినీతి కుంభకోణాలు , సమస్యల పట్ల పాలకుల నిర్లక్ష్యం వంటి కారణాలతో న్యాయవ్యవస్థ క్రియాశీలత పెరిగింది. ప్రతిదానికి కోర్టులే తుదిపరిష్కారం అన్న ధోరణి వచ్చింది. మరోవైపున పరిపాలనా విధానాలే కార్పొరేట్‌ మయమైపోయిన ప్రభావం కోరుతీర్ప్టులపైన కూడా పడింది. కారల్‌ మార్క్స్‌ అన్నట్టు చట్టం వ్యవస్థపై ఆధారపడి వుందిగాని వ్యవస్థ చట్టంపై ఆధారపడిలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో న్యాయమూర్తులు కూడా కార్పొరేట్‌ ప్రయోజనాలు ప్రైవేటు ఒప్పందాలు, ప్రజాహక్కుల నిరాకరణ వంటి పోకడలు ప్రదర్శిస్తున్నారు. ఇంత బాధలోనూ సిజె ముందు విదేశీ పెట్టుబడిదారులకు వివాద పరిష్కారం ఆలస్యమై పోతుందని ఉదాహరణగా ఇవ్వడం యాదృచ్చికం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులను కాపాడేందుకు, లౌకిక ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు దోహదపడే తీర్పులు కోర్టులు ఇచ్చినమాట నిజమే. కాని గత దశాబ్దకాలంలో ప్రజావరణాన్ని కుదించే తీర్పులు పెరిగాయి. రాజకీయ పార్టీల సభలూ ప్రదర్శనలనూ నిరసన హక్కునూ బంద్‌లను ఆఖరుకు ఉద్యోగుల సమ్మె హక్కును కూడా నిరాకరించేందుకు కోర్టులు సిద్ధమైనాయి. కార్మికులూ, ఉద్యోగుల తొలగింపునకూ, ఎయిర్‌హౌస్టస్‌ల కేసులో మహిcj,modiళల వ్యతిరేక మైన ఆదేశాలకు కూడా పాల్పడ్డాయి. ఉద్యమ కార్యకర్తలనూ రచయితలనూ మీడియాను కూడా శిక్షించిన సందర్బాలున్నాయి. అయోధ్య రామమందిరం కేసులో విశ్వాసాన్ని ప్రమాణంగా ప్రస్తావించి లౌకిక విలువలకు విఘాతం కలిగించాయి.తొమ్మిదవ షెడ్యూలులో భూసంస్కరణలను చేర్చి రక్షణ కల్పించాలనుకుంటే అందుకూ ఆటంకం కల్పించాయి. చుండూరు కేసువంటివాటిలో అందరినీ వదలివేసి నిరసనకు గురైనాయి. జయలలిత అవినీతి కేసులోనూ, సల్మాన్‌ ఖాన్‌ బెయిలు పిటిషన్‌ వంటివాటిలోనూ కోర్టుల తీర్పుల మధ్య అంతరం విశ్వసనీయతనే దెబ్బతీసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్‌ కేసులోనూ ఈ గజిబిజి గోచరిస్తుంది. బ్యాంకురుణాల విషయంలోనూ ఇప్పుడు హడావుడి చేస్తున్నా మొదట్లో కొన్ని బ్యాంకులను సమయం వచ్చినపుడు రండని వెనక్కుపంపించిన ఉదంతాలున్నాయి. అసలు సరళీకరణ విధానాలలో సామాజిక న్యాయం సార్వభౌమత్వం దెబ్బతింటున్న తీరును కోర్టులు ఎన్నడూ విమర్శించిన పాపానపోలేదు! అది వాటి స్వభావం. కేశవానంద భారతి కేసు తర్వాత రాజ్యాంగ మౌలిక స్వబావాన్ని నిర్వచించి పరిరక్షించే బాధ్యత సుప్రీం కోర్టు తనకు తనే తీసేసుకుంది గనక స్వీయ నియంత్రణ కూడా చాలా అవసరమవుతున్నది.

ఇక న్యాయవ్యవస్థ క్రియాశీలత ఒక సంక్లిష్ట వ్యవహారం. రోడ్లు వూడ్చడం, కాల్వల నిర్వహణతో సహా ప్రతి చిన్న పాలనా సమస్యనూ కోర్టుల జోక్యం వరకూ వెళ్లడం వ్యవస్థల సమతుల్యతను దెబ్బతీసింది. పాలనా వ్యవహారాలు ఎగ్జిక్యూటివ్‌ బాధ్యత తప్ప కోర్టుల పనికాదు. చట్టసభలూ కార్యనిర్వాహక వర్గం విఫలమైతే తప్పులు చేస్తే పరిష్కారాలు అక్కడే వెతకాలి తప్ప ప్రతి చిన్నపనీ కోర్టులే మీద వేసుకోవడం వాస్తవికత కాదు. రెండు నెలల్లో కాలుష్యాన్ని తగ్గించి నివేదికనివ్వాలనీ లేక ఏడాదిలో బాలకార్మికులు కనిపించకుండా చేయాలని ఆదేశాలిస్తే సంచలనమే తప్ప ప్రయోజనం వుండదు. ఇక వ్యక్తులుగా మహిళలకు వ్యతిరేకంగా లేక మతచాందసంతో కులదురహంకారంతో వాచాలతకు పాల్పడి నాలుకకర్చుకున్న న్యాయమూర్తులున్నారు.

సమగ్ర ప్రక్షాళన కోసం..
ఇతరుల అవినీతిపై తీర్పులు చెప్పే ఉన్నత స్థాయి న్యాయమూర్తులే దారితప్పిన ఉదంతాలున్నాయి. వి.రామస్వామి,సౌమిత్రాసేన్‌,దినకరన్‌ వంటి వారు అభిశంసనకు గురై కూడా పాలకుల ఉపేక్ష కారణంగానే బయిటపడగలిగారు. కె.జి.బాలకృష్ణన్‌ వంటివారిపై వివాదాలు పరాకాష్టకు చేరాయి. గాలిజనార్ధనరెడ్డి కేసులో అక్రమంగా బెయిలు ఇచ్చిన సిబిఐ న్యాయమూర్తి కటకటాల్లో చిక్కారు. ఇలాటి సందర్భాల్లో వారిపై చర్య తీసుకోవడానికి ఇదమిద్దంగా ఎలాటి యంత్రాంగం లేకపోవడంతో వారు అతీతులనే భావం ఏర్పడుతున్నది. కొన్నిసార్లు ఉన్నత న్యాయస్థానాలు మరికొన్నిసార్లు పాలకులు వారికి రక్షణ కల్పించి బయటపడేస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసని వారికి తర్వాత మరే పదవులు ఇవ్వరాదనే భావన వున్నా గవర్నర్లుగా కూడా చేరిపోతున్నారు సదాశివన్‌ కేరళ గవర్నర్‌ కావడం, మానవ హక్కుల కమిషన్‌కు ఐరాస పదవులకు మరికొందరిని పంపించడం ఇందుకు ఉదాహరణలు. కనుక వారిపైనా ప్రలోభాల వల వుంటుంది. ఇందిరాగాంధీ కమిటెడ్‌ జ్యూడిషయరీ అంటూ జూనియర్లను కీలక స్థానాలకు ప్రమోట్‌ చేశారు!

తరచూ ప్రస్తావనకు వచ్చే కొలీజియం వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చాయి. న్యాయమూర్తుల నియామకం ప్రధాన న్యాయమూర్తి సిపార్సుపై రాష్ట్రపతి, ప్రభుత్వం అంతకు ముందు చేసేవారు. అయితే ప్రభుత్వాలు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనే పేరిట సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో ఈ కొలీజియం ఏర్పాటు చేసింది. దాని ఆమోదం పొందితేనే నియామకం జరగాలని నిర్దేశించింది. ఈ విధంగా తమను తామే నియమించుకోవడం ఎక్కడా వుండదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నేషనల్‌ జ్యుడిషయల్‌ కమిషన్‌ అంటూ ఏర్పాటు చేసి జడ్జిల నియామకం బదిలీలు ఆరోపణలు వంటివన్నీ దాని ద్వారా చేయాలనే సూచన చాలా కాలం కిందటనుంచి వుంది.సిపిఎం దానిపై నిర్దిష్టసూచనలు కూడా చేసింది. యుపిఎ ప్రభుత్వం తక్కిన విషయాల్లోకి పోకుండా కేవలం నియామకాల కోసమే ఎన్‌జెఎసి ప్రతిపాదన చేసినప్పుడు కూడా దాన్ని విస్త్రత పర్చాలని కోరింది. మోడీ ప్రభుత్వం ఆ బిల్లునే కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టింది. జడ్జిల నియామకం కోసం ప్రధాన న్యాయమూర్తి,న్యాయశాఖా మంత్రి,ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు, ఇద్దరుప్రముఖ వ్యక్తులతో కూడిన కమిషన్‌ ఏర్పడుతుందని 91వ రాజ్యాంగ సవరణగా చెప్పే ఈ బిల్లు నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ సవరణచేయాలంటే కనీసం 15 రాష్ట్రాలు ఆమోదించాలి. కాని ఆ పనిజరక్కుండానే ప్రభుత్వం అటు సవరణ బిల్లు, ఇటు ఎన్‌జెఎసి రూపురేఖల బిల్లు సభలో ప్రవేశపెట్టింది. ఇది సరికాదని ముందు రాజ్యాంగాన్ని సవరించి తర్వాత బిల్లు తీసుకురావాలని సీతారాం ఏచూరి గట్టిగా వాదించారు. అంతేగాక అన్ని అంశాలతో కూడిన సమగ్ర వ్యవస్థగా న్యాయకమిషన్‌ వుండాలన్నారు. తర్వాత విస్తరిస్తామని ప్రభుత్వం హామీనివ్వడంతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. అయితే న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం చెల్లదని సుప్రీం కోర్టు కొట్టివేసింది. కొలీజియం వ్యవస్థలో లోటుపాట్లను ఎలా చక్కదిద్దాలో సూచించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది. మొత్తం నియామకాల ప్రక్రియే ప్రతిష్టంభనలో పడిపోయింది.
గోపాల్‌ సుబ్రహ్మణ్యన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించే సూచనకు రాజకీయ కారణాల వల్ల మోడీ ప్రభుత్వం మొదట్లోనే అడ్డుపడింది. గుజరాత్‌సోరాబుద్దీన్‌ కేసులో ఆయన తమకు వ్యతిరేకంగా వాదించారన్న కారణంతో ఇలా అడ్డుపడటం సరికాదని విమర్శలు వచ్చాయి. ప్రధాని న్యాయవ్యవస్థ ప్రతిదానికి అడ్డంకి అవుతుందని ఒకటికి రెండుసార్లు విమర్శించారు.. ఎన్‌జెఎసిని కొట్టేశాకైనా సమస్యను మరింత సమగ్రంగా పరిశీలించాలనే సూచనను పట్టించుకోలేదు. వందలాది మంది న్యాయమూర్తుల నియామకాలను తొక్కిపట్టింది. సర్వాధికారాలు న్యాయవ్యవస్థకు కట్టబెట్టడం ఎంత తప్పో ప్రభుత్వం న్యాయ నియామకాలను ప్రభావితం చేయాలనుకోవడం కూడా అంతే తప్పు.ఆయా వ్యవస్థల రాజ్యాంగ స్థానాన్ని కాపాడుతూ ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలి. సంఖ్య పెంపు వంటి విషయాలు ఏర్పడే కమిషన్‌కే వదలివేయాలి.కన్నీళ్లు కక్షసాధింపుల కన్నా అలాటి సమగ్ర దృష్టి ప్రదర్శిస్తే న్యాయానికి న్యాయం జరగుతుంది.
నవతెలంగాణ,ఏప్రిల్‌ 28,2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *