ఇప్పుడు భగత్‌సింగ్‌ పేరిట చరిత్రపై దాడి!

bhagat-singh-4a
విద్యారంగానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించడానికి సంఘ పరివార్‌ పాచికలు వేస్తుంటుంది. దేశ ప్రజల హృదయాలలో శాశ్వతంగా స్థానమాక్రమించిన నాయకుల గురించి గజిబిజి తీసుకొచ్చి వారికి తాము వారసులమన్నట్టు మాట్లాడుతుంటారు. నెహ్రూ సర్దార్‌ పటేల్‌ అంబేద్కర్‌ మదన్‌మోహన్‌మాలవీయ వంటివారి తర్వాత ఇప్పుడు భగత్‌ సింగ్‌ గురించిన చిచ్చు పెట్టడానికి సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా డా. బిపిన్‌ చంద్ర తన శిష్యులైన చరిత్రకారులు మృదులా ముఖర్జీ ఆదిత్య ముఖర్జీ సుచేతా మహాజన్‌ కెఎన్‌ఫణిక్కర్‌లతో కలసి రచించిన భారత స్వాతంత్ర పోరాటం అన్న గ్రంధం అత్యంత ప్రామాణికమైంది. కొన్ని తరాల ఉన్నతాధికారులు పరిశోధకులకు వనరుగా ఉపయోగపడింది. ఆ పుస్తకంలో భగత్‌సింగ్‌ను విప్లవ టెర్రరిస్టుగా పేర్కొన్నారంటూ ఇప్పుడు బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాగూర్‌ కొత్త వివాదం తీసుకొచ్చారు. బిపిన్‌ చంద్ర కాంగ్రెస్‌కు సన్నిహితుడని ఎన్‌బిటి చైర్మన్‌గా పనిచేశారని అదేదో నేరమైనట్టు ఆరోపణలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఈ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా బోధించడంపై భగత్‌ సింగ్‌ బంధువులు ఫిర్యాదు చేయగా వైస్‌ ఛాన్సలర్‌ యోగేష్‌ త్యాగి అది కేవలం రెఫరెన్సు గ్రంధంగానే వుందని అయినా పరిశీలిస్తామని సమాధానమిచ్చారు. స్వాతంత్ర యోధులను టెర్రరిస్టులని ఎలా పేర్కొంటారంటూ అసందర్భమైన వివాదం తీసుకొస్తున్నారు గాని నిజానికి వారు ఆ రోజుల్లో తమను తాము ఆ విధంగానే భావించుకునేవారు. గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని హఠాత్తుగా విరమించారనే ఆగ్రహంతో చాలా మంది యువత మరింత సమరశీల సాహసిక మార్గాలవైపు మరలారు. వారిగురించి బిపన్‌ 20వ అధ్యాయంలో విపులంగా విశ్లేషించారు.
మిగిలిన వారితో పోలిస్తే భగత్‌ సింగ్‌ విప్లవ రాజకీయాల్ని విస్త్రతం చేశారని బిపన్‌ వివరించారు. గొప్ప అధ్యయనంతో ఆయన మార్క్సిజం వైపు ప్రయాణించారు. విప్లవం అంటే బాంబులు తుపాకులే కాదని సమాజాన్ని సమూలంగా మార్చాలని అర్థం చేసుకున్నారు. అందుకే హిందూస్తాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ పేరును సోషలిస్టు రిపబ్టికన్‌ ఆర్మీగా మార్చారు. నిజమైన విప్లవ సేనలు పొలాల్లో కార్ఖానాల్లో వున్నారని ఆయన ప్రకటించాడు. 1932 ఫిబ్రవరి 2న ఒక ప్రకటన చేస్తూ ‘బహుశా నేను తీవ్రవాదిలా వ్యవహరించి వుంటాను. కానీ నేను . నా విప్లవ జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో మినహా తీవ్రవాదిని కాను. ఎన్నడూకాలేదు.ఈ రకమైన విధానం ద్వారా మనం సాధించేదేమీ వుండదని మనస్పూర్తిగా నమ్ముతున్నాను’ అని స్పష్టీకరించారు. మరికొన్ని రోజుల తర్వాత మార్చి 3న ఇచ్చిన సందేశంలో’ స్వప్రయోజనాల కోసం సామాన్యుల శ్రమను కొంతమంది దోచుకున్నంత కాలం భారత దేశంలో పోరాటం కొనసాగుతుంది. నూటికి నూరుపాళ్లు బ్రిటిష్‌ పెట్టుబడిదారులా వారితో కలసిన భారతీయ పట్టుబడిదారులా లేక పూర్తిగా భారతీయ పట్టుబడిదారులా అనే దానితో నిమిత్తంలేదు’ అని ప్రకటించారు.
అయితే తమకు ప్రజా బలం ఎక్కువగా లేదు గనక తమ వీరోచిత కార్యక్రమాలతో వారిని ఆకర్షించాలనే భావం భగత్‌సింగ్‌ బృందానికి వుంది. అందుకే విప్లవ ఉగ్రవాదాన్ని వదులుకోవలసిందిగా నేను చెబుతాను గాని దాన్నిబట్టి వారి త్యాగాలను తక్కువ చేయకూడదని కూడా ఆయన రాస్తారు. శాండర్స్‌ను చంపింది కూడా లాలాలజపతిరారు వంటి దేశభక్తుని మరణానికి కారకుడైనాడనే కారణంతోనే గాక ప్రజలను రగిలించాలని కూడా. పార్లమెంటులో పొగబాంబు విసిరి పారిపోకుండా నిలబడింది కూడా కోర్టులో తమ లక్ష్యాలు ప్రకటించాలనే. కనుక భగత్‌సింగ్‌లోని అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవలసిందే. మొదట తీవ్రవాదిగా బయిలుదేరి విప్లవ కారుడుగా సామ్యవాదిగా మారాడు. విప్లవం వర్ధిల్లాలి అని నినదించాడు.
సంఘపరివార్‌ ఇప్పుడు ఎంత హడావుడిచేసినా సరే భగత్‌ సింగ్‌ మతతత్వాన్ని పూర్తిగా ఖండించాడు.తను రూపొందించిన నవజీవన్‌ సభ నియమావళిలో మత సంబంధమైన వాదనలను భావాలను ప్రచారం చేసే సంఘాలతో ఎలాటి సంబంధం వుండరాదని షరతు పెట్టాడు. తన గురువైన లాలా లజపతిరారు చివరి రోజుల్లో మత రాజకీయాలవైపు మొగ్గడంతో ఆయనను కూడా విమర్శించాడు. మతం మూఢవిశ్వాసాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకే నేనెందుకు నాస్తికుడయ్యాను అనే పుస్తకం రాశాడు.సిక్కుమతంపై తనకెందుకు విశ్వాసం సన్నగిల్లిందో స్వానుభవంతో వివరించాడు. కడదాకా నిట చివరకు ఉరికంబం మీద కూడా ారుగా తలపైకెత్తిఒక మనిషిగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాను అని సగర్వంగా ప్రకటించాడు.
1977లో జనతా ప్రభుత్వంలో ఎల్‌కె అద్వానీ మురళీ మనోహర్‌జోషి మంత్రులుగా వున్నప్పుడు – 1998-2004 వాజ్‌పేయి హయాంలో, ఇప్పుడు మోడీ హయాంలో ప్రతిసారీ వారి దృష్టి చరిత్రను తిరగదోడటంపైనే కేంద్రీకరిస్తారు. మతతత్వ కోణంలో చూపాలని ప్రయత్నిస్తుంటారు. ఆ రాజకీయాలను సూటిగా వ్యతిరేకించిన భగత్‌ సింగ్‌ వారసత్వం కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సంఘ పరివార్‌కు చెందిన అనురాగ్‌ ఠాగూర్‌ వంటివారు ప్రారంభించిన ఈ ప్రయత్నం ఇంకా తీవ్రం కావచ్చు. కుటుంబసభ్యులలో ఏవైనా సందేహాలుంటే తొలగించడం అవసరమే గాని బిపన్‌చంద్ర గొప్ప లౌకిక వాద చరిత్రకారుడు. ఈ వివాదం వెనక ఉద్దేశాలను చారిత్రిక వాస్తవాలను బుద్ధిజీవులు గమనంలో వుంచుకోవాలనే ఇదంతా రాశాను.
కీ.శే. బిపన్‌చంద్ర భగత్‌సింగ్‌పై చేసిన ప్రసంగాన్ని హైదరాబాదులో అనువదించడం నాకో గొప్ప అనుభవం. ఆయనకు తనపై ఎంతో గౌరవమే గాక మానసికానుబంధం కూడా వుంది. కనుక ఆయనపై బురదజల్లడం తగనిపని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *