భేషరతు విచారానికి భేషజమేల?

శాసనసభలో తన వ్యాఖ్యలకు గాను ఏకవాక్య క్షమాపణ ఉత్తరం రాసి పరిష్కారం చేసుకోవలసిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనను వైసీపీ ఎంఎల్ఎల రోజా ఎందుకు జారవిడుచుకుంటున్నారో అర్థం కాదు. సభాపతిదే తుది నిర్ణయం అంటూనే అత్యున్నత న్యాయస్థానం ఆమె లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్దేశించింది. చిక్కుముడిగా మారిన సస్పెన్షన్ వ్యవహారం ముగించడానికి ఇది మంచి అవకాశంగా వుండేది. రాజకీయంగా తనకు తానే దిగివచ్చినట్టు కనిపిస్తే వ్యక్తిగతంగా ఆమె లేదా ఆమె పార్టీ పలచన అవుతాయనే సందేహాలు వుండొచ్చు. కాని న్యాయస్థానాన్ని గౌరవించడం, పొరబాటు మాటలపై క్షమాపణ చెప్పడం హుందాగా వుండేది.మొదట ఆమె అవతలి వారి మాటలను కూడా చూపించాలని కోరారు. తర్వాత పొరబాటే మాట్లాడలేదన్న వాదన మొదలు పెట్టారు. ఆ మాటల్లో ఏది ముందు ఏది తర్వాత అనితను అన్నారా లేక సిఎంను అన్నారా అనేది ఎలావున్నా రోజా ధోరణి బాగాలేదనే భావం వైసీపీ వారిలోనూ వుంది. తెలుగుదేశం దుర్భాషలను ఎత్తిచూపే అవకాశం పోగొట్టుకోవడానికి కూడా ఇది కారణమైంది. మెజార్టి కలిగిన ప్రభుత్వంగా సభా నిర్వహణ వారి చేతుల్లో వున్నప్పుడు ప్రతిపక్షాలు ఎంతోకొంత రాజీ మార్గం అనుసరించడం ఎప్పుడూ జరిగేదే. పైగా ఇటీవలి మాసాలలో సామూహిక ఫిరాయింపులతో వైసీపీ రాజకీయంగా దెబ్బతిన్నది. లేఖ రాసిన తర్వాత కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తే అప్పుడు పొరబాటు వారిదవుతుంది. కాని వెనక్కు తీసుకుంటున్నాను అది కూడా బాధకలిగించివుంటే అంటూ మెలికలు పెట్టడం వల్ల లేఖకు మొదటే విలువ లేకుండా పోతుంది. సుప్రీం సూచనను కూడా ఆమె గౌరవించలేదనే విమర్శ మిగులుతుంది. హక్కుల కమిటీ కూడా రోజా క్షమాపణ చెప్పినట్టు వెల్లడిస్తే ఆమె మరో విధంగా మాట్లాడారు.జనాకర్షణ వాగ్ధాటి గల రోజా వంటి వ్యక్తి భేషజాలతో సాగదీసి భవిష్యత్తును దెబ్బతీసుకోవడం పొరబాటవుతుంది.నియోజకవర్గానికి కూడానష్టంజరుగుతుంది.