ఇదే తెలుగు స్పూర్తి వెలుగు చూపాలి మరి!

kcr ntr 33

నందమూరి బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగు ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభినందన ప్రసంగం చూసిన వారికి తెలుగుదేశం రోజులు గుర్తుకు వచ్చి వుంటే ఆశ్చర్యపోవలసింది లేదు. ఎన్టీఆర్‌ తెలుగువారికి గుర్తింపు తెచ్చారనీ, మద్రాసీలు అనిపిలవబడుతున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ అంటూ ఒకటి వుందని ఉనికిని చాటారని ఆయన ప్రశంసించారు.తనకు అత్యంత అభిమానపాత్రమైన నటుడే గాక మహానాయకుడని ఆయన పేరిట వున్న పార్కును తొలగించుతున్నామనే వార్తలు నిజం కాదని , ఆయనకు గొప్ప స్మారకచిహ్నం వుండాల్సిందేనని కెసిఆర్‌ స్పష్టంగా ప్రకటించారు. అన్నిటికన్నా విశేషం ఆయన ప్రసంగంలో తెలుగు జాతి తెలుగు రాష్ట్రాలు అని ఒకటికి రెండు సార్లు చెప్పడం పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన నాటి వ్యాఖ్యలను గుర్తు చేసింది. అక్కడున్న వారినుంచి విపరీతమైన స్పందన కూడా వచ్చింది.

లోతైన రాజకీయ విశ్లేషణల్లోకి పోకుండా చెప్పాలంటే ఒక కోణంలో ఇదంతా మంచిదే. ఎందుకంటే విభజన జరిగినప్పటికీ రెండు తెలుగురాష్ట్రాలు సఖ్యతగా సుహృద్భావ వైఖరిత ముందుకు సాగాలని అక్కడా ఇక్కడా ప్రజలుకోరుకున్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడన తొలిదశలో తెలంగాణ ముఖ్యమంత్రితో సహా తీవ్ర వైఖరి తీసుకోవడం కొన్నిటిని కోర్టులు కొట్టివేయడం వరకూ వెళ్లింది. అప్పట్లో తెలుగుదేశం టిఆర్‌ఎస్‌ రాజకీయ వైరం వెల్లడించుకోవడానికి ఇరు రాష్ట్రాల సమస్యలను తరచూ ప్రస్తావిస్తుండేవారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఒక దశలో రాజకీయ యుద్ధ వాతావరణమే ఏర్పడింది. తర్వాత హఠాత్తుగా అంతా సర్దుకున్నట్టు సంకేతాలు మొదలైనాయి. దీని వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం జోక్యం కూడా వున్నాయని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. అమరావతిలో అధికారికంగా రాజధాని శంకుస్థాపనకు కెసిఆర్‌ ను ఆహ్వానించడం, కొన్నాళ్ల తర్వాత తన అనధికార ఆధ్యాత్మిక యజ్ఞానికి ఆయన చంద్రబాబు నాయుడును పిలవడం విస్త్రత ప్రచారం పొందాయి. సందర్భాలు వేరైనా స్నేహ సంబంధాలు పెరగడం మంచిదేనని అందరూ హర్షించారు. కాని ఈ వ్యక్తిగత సంబంధాలు సంభాషణలు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తున్నాయా అంటే ఇంతవరకూ అలాటి సూచనలు లేవు. అరుదుగా తప్పితే అసలు కీలకాంశాలపై అధికారికంగా ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, జరగలేదు. మంత్రుల స్థాయిలో మాత్రం భిన్న ప్రకటనలు వెలువడటం జరిగిపోతూనే వుంటుంది.
పూర్తికాని ఉద్యోగ విభజన
విద్యుచ్చక్తి ఉద్యోగులు విభజన, ఉన్నత విద్యా మండలి, తెలుగు విశ్వ విద్యాలయ నిర్వహణ, వైద్యుల విభజన, సాగునీటి ప్రాజెక్టులు, వివిధ శాఖల నిధుల పంపిణీ, పదవ షెడ్యూలులో సంస్థల సమస్య, ఇందులో ఏది ఇదమిద్దంగా ఇక్కడకు ముగిసిందని చెప్పడానికి లేదు. అసలు ఉద్యోగుల పంపిణీయే ఎడతెగని వ్యవహారమై పోయి చివరకు కేంద్రం కూడా చేతులు ఎత్తేసిందంటున్నారు. హైకోర్టు వంటివి ఈ తరహాకు చెందినవి కాకున్నా చర్చకు దారి తీస్తున్నాయి. విభజన బిల్లు ఆమోదం పొందిన రెండేళ్ల తర్వాత కూడా కేంద్రం తన పాత్ర ఎందుకు నిర్వహించడం లేదు, రాష్ట్రాలు కూడా స్పష్టంగా ఎందుకు అడుగులేయడం లేదు? మొత్తం పరిస్థితి ఏ దశలో ఏ స్థితిలో వుంది?అన్నదానిపై ఒక వివరణ పత్రం విడుదల చేయవలసిన అగత్యం వుంది. సంబంధిత ఉద్యోగులు కుటుంబాలకు దీనివల్ల చెప్పలేని ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. భద్రాచలం ఎంఎల్‌ఎ తెలంగాణ శాసనసభలో వుంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు ఎపిలో వున్నాయి. మరి ఆయనకు అక్కడ కూడా సహ సభ్యత్వంలేదా అనుబంధ హౌదా కలిగించాలనే డిమాండు వుంది. ఈలోగా అక్కడి అయిదుగ్రామాలను తెలంగాణకు బదలాయించడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారని కెసిఆర్‌ ఒకటికి రెండు సార్లు వెల్లడించారు. దీన్ని ఎపి మంత్రి ఒకరు ఖండించారు గాని చంద్రబాబు వివరణ ఇవ్వలేదు. తమ సంభాషణల్లో ఆయన సుముఖత వ్యక్తం చేసిన మాట నిజమేనని ఒక టిఆర్‌ఎస్‌ ఎంపి ఒకరు నాతో స్పష్టంగా చెప్పారు. ఇందులో ఏది ఎంత నిజమో సాధ్యాసాధ్యాలు లాభనష్టాలు ఏమిటో అధికారిక చర్చ జరిగింది లేదు. విలీన ప్రాంతాలపట్ల ప్రభుత్వాల స్పందనా రాహిత్యం మాత్రం స్థానికులకు సమస్యగా వుంటున్నది.
సాగునీటి ప్రాజెక్టులు
చాలాకీలకమైన నీటి ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్‌ ప్రభుత్వం సమూలమైన రీడిజైనింగు విధానం తీసుకున్నది. ఆయన శాసనసభలో పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ కూడా ఇచ్చారు. దీనిపై తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటికీ అభ్యంతరాలున్నాయి. అదలా వుంచితే దిగువ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ అభిప్రాయాలు అంగీకారాల అవసరం కూడా వుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత వివరమైన విధాన పత్రం ఆంధ్ర ప్రదేశ్‌ ఇంతవరకూ విడుదల చేయలేదు. గోదావరిలో 2500 టిఎంసిలకు పైగా నీళ్లు అందుబాటులో వున్నాయన్న ఆయన వాదనను ఎపి ఆమోదించడం లేదు గాని సమగ్ర చర్చలకు కూడా ప్రయత్నం జరగడం లేదు. ఎగువన మహారాష్ట్ర కర్ణాటక బ్యారేజీల వల్ల నీరు రావడం లేదని కెసిఆర్‌ ఇచ్చిన నివేదిక రేపు ఎపికి కూడా వర్తించదా? మహారాష్ట్రతో జరిగిన వివరమైన చర్చల వంటివి ఇక్కడ ఎందుకు జరగడం లేదు? ప్రాజెక్టుల వారీగా దానితో ఒప్పందానికి రావడానికి ముందే దిగువ రాష్ట్రమైన ఎపితోనూ అవగాహనకు రావలసి వుండగా ఇరు రాష్ట్రాధినేతలు ఆ దిశలో ఎందుకు అడుగులేయడం లేదు? ఎపిలో కూడా ప్రాజెక్టులపైన వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం ప్రాజెక్టుల సాగతీత నిర్లక్ష్యం పైన చాలా విమర్శలున్నాయి. నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరాలతో కేంద్రానికి లేఖ రాయడం, మీడియాతో మాట్లాడ్డం తప్ప అఖిలపక్ష సమావేశం జరిపి విషయాలు వివరించడం అందరికీ తెలియజెప్పడం జరగలేదు. తెలంగాణలోనూ అలాటి ప్రయత్నం లేదుగాని అక్కడ శాసనసభలో అన్ని పార్టీలకూ ప్రాతినిధ్యం వుండగా ఎపిలో ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా సభలో వుంది గనక ఇతరులకు చెప్పడానికి ప్రత్యేక వేదిక కావలసిందే. ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పరిష్కారాలు సాధించాల్సి
జిహెచ్‌ఎంసి ఎన్నికల నుంచి నిన్న నందమూరి బాలకృష్ణ శాతకర్ణి సినిమా షూటింగ్‌ ప్రారంభం వరకూ కూడా కెసిఆర్‌ తెలుగువారు ఒకటేనన్న భావం వినిపించడం ఆహ్వానించదగిందే. తెలుగుదేశమూ అందే అంటున్నది. కనుక ఇరు ప్రభుత్వాలు అధికారికంగా సావధానంగా చర్చించి ప్రజల ఉద్యోగుల వివిధ విభాగాల విభజన వివాదాలు ఒక కొలిక్కి తేవాలి. లేకపోతే ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందమే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *