బిజెపి పోస్టుకు రక్షణమంత్రి ఖండన

పార్టీలు ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడం మామూలే అయినా ఆ వూపులో వాస్తవాలు తారుమారు చేస్తే సమస్యలు తప్పవు. అప్పుడు తమను తామే ఖండించుకోవలసిన స్థితి దాపురిస్తుంది. బిజెపి అధికారిక వెబ్‌సైట్‌లో రక్షణ కొనుగోళ్ల సమర్థత గురించి పెట్టిన పోస్టును ఆ శాఖ మంత్రి మనోహర్ పరిక్కర్ స్వయంగా ఖండించవలసి వచ్చింది. 36 రాఫిల్ ఫైటర్ విమానాల కొనుగోలుకు సంబంధించి గతంలో యుపిఎ ప్రభుత్వం 12బిలియన్ డాలర్లకు ఒప్పందం ఖరారు చేసుకోగా తమ ప్రభుత్వం దాన్ని 8.8 బిలియన్ డాలర్లకు తగ్గించగలిగిందని బిజెపి వెబ్‌సైట్‌లో రాశారు. అయితే ఆ ఒప్పందం ఖరారు కాలేదని ఇంకా కేంద్ర క్యాబినెట్‌కే సమర్పించలేదని ఫణిక్కర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పైగా మిగులు లెక్కించేందుకు పోలిక తీసుకున్నది మరో తేలికపాటి యుద్ధ విమనాల కాంట్రాక్టు తప్ప 36 రాఫిల్ కాకపోవడం మరో విచిత్రం. తమ పార్టీ పరువు పోకుండానూ అదే సమయంలో తమ శాఖలో గందరగోళం రాకుండానూ ఫనిక్కర్ చాలా తంటాలు పడాల్సి వచ్చిందని బిజినెస్ స్టాండర్డ్ వ్యాఖ్యానించింది. అయితే ఆయన ఇంత జాగ్రత్త పడినప్పటికీ వెబ్‌సైట్ చూసే అమిత్ మాలవీయ మాత్రం తేలిగ్గా తీసిపారేశారు! అంటే రక్షణ శాఖ విషయాలు వారికి ముందే తెలుస్తున్నాయా? లేక మనోహర్ పరిక్కర్‌తో సమన్వయం సరిగ్గా లేదా?