అజేయుడై నిలిచిన 90 ఏళ్ల కాస్ట్రో సందేశం
అర్థశతాబ్దం పాటు అతి దగ్గరే వున్న అమెరికా పాలకులు ఆయనను అంతమొందించాలని పథకాలు పన్నుతున్నా – అరుణ పతాకధారిగా అజేయుడై నిలిచిన క్యూబా అధినేత ఫైడెల్ కాస్ట్రో పార్టీ మహాసభలో అరుదైన సందేశం ఇచ్చారని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. క్యూబా సమస్యకు ‘జీవ పరిష్కారం'(బయలాజికల్ సొల్యూషన్) దొరకుతుందని అమెరికా ఎంతగానో ఎదురు చూసింది గాని అది సాధ్యం కాలేదని తొంభయ్యవ పడి సమీపించిన కాస్ట్రో మహాసభలో తన ఆశయాలను పునరుద్ఘాటించారని ఆ పత్రిక రాసింది. 1959లో క్యూబా విముక్తి తర్వాత అప్రతిహతంగా నాయకత్వం అందించిన ఆయన 2008లో ఆరోగ్య కారణాల వల్ల బాధ్యతలు తన తమ్ముడు సహ యోధుడు రావుల్ కాస్ట్రోకు అప్పగించారు.అప్పటిి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నారు. పత్రికలలో కాలమ్స్ రాస్తూ అతిధులను కూడా చాలా తక్కువగా కలుసుకుంటున్నారు. సోవియట్ విచ్చిన్నం చైనా సంస్కరణల తర్వాత కూడా అమెరికాకు తలవంచేందుకు గాని సోషలిస్టు పంథాను విడనాడేందుకు గాని క్యూబా అంగీకరించలేదు
. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక ఆంక్షలతో పాటు సోదరసోషలిస్టు దేశాల పతనం వల్ల కలిగిన దుష్ఫలితాలను కూడా తట్టుకుంటూనే ముందుకు నడిచింది. ఆఖరుకు అమెరికా తనకు తనే ఆంక్షలను సడలించినట్టు ప్రకటించినా ఆచరణలో పెద్ద మార్పు వచ్చింది లేదు. ఈ మధ్యనే మొదటిసారిగా అమెరికా అద్యక్షుడు ఒబామా క్యూబాలో పర్యటించడం పెద్ద సంచలనమైంది.దానికి ముందు రావుల్ కూడా వాషింగ్టన్ సందర్శించారు. ఒబామా పర్యటన వల్ల వచ్చిన మార్పులు మంచివే అయినా మౌలికంగా పెద్ద తేడా లేదని రావుల్ ఈ మహాసభలో స్పష్టంగా చెప్పారు. ఇక కాస్ట్రో అయితే బ్రదర్ ఒబామా అంటూ రాసిన వ్యాసంలో మానవ హక్కులపై మాకు నీతులు చెప్పడం మానేయవలసిందిగా సూచించారు. ఇక మహాసభలో ఆఖరున ప్రసంగించిన ఆయన తనకు తొంభై ఏళ్లు వచ్చాయి గనక చాలా మంది లాగే తను కూడా తరలి పోవచ్చని ఇదే తన చివరి ప్రసంగం కావచ్చని అన్నారు. రాత్రుళ్లు పగళ్లు కూడా నిరాఘాటంగా ప్రసంగిస్తూ ప్రజలను ఉర్రూతలూపే కాస్ట్రో కంఠం కాస్త వణికినా సందేశం సారాంశం మాత్రం దృఢంగా ధ్వనించాయి. మనకందరికీ ఏదో ఒక రోజు ముగింపు వుంటుంది. కాని కమ్యూనిజం ఆశయాలు మాత్రం మానవాళి సమిష్టి సంక్షేమం కోసం జరిగే ప్రస్థానానికి ప్రతీకలుగా ఈ భూమండలంపై ప్రకాశిస్తూనే వుంటాయి అని ఆయన ప్రకటించారు.
ఇక ఇదే సభలో రావుల్ తను మరో రెండేళ్ల తర్వాత రిటైర్ కాబోతున్నానని ప్రకటించారు. పార్టీ పదవులకు ఎన్నిక కావడానికి గరిష్ట వయస్సు 60 అనీ, 70 ఏళ్ల తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవలసి వుంటుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కూడా సమాజానికి దేశానికి చేయగలిగింది చేస్తూ మనవళ్లతో సమయం గడపొచ్చు అని వ్యాఖ్యానించారు.
