అంబేద్కర్ ‘మహద’ ప్రస్థానం..
బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై అయిదవ జయంతి ఉత్సవాలు ఆయన విశ్వరూప సాక్షాత్కారంలా గోచరిస్తున్నాయి. 1927లో వివక్షపై సుదీర్ఘ పోరాటం ప్రారంభించారు మహారాష్ట్రలోని మహద్‌లో. ఆ మహనీయ మూర్తి విగ్రహాల స్థాపనకు ప్రచార కార్యక్రమాలకు పాలకులు పోటీ పడితున్నారు. తొలిసారిగా అంబేద్కర్ పుట్టిన స్థలమైన మౌ సందర్శించి మంచి పనిచేసిన ప్రధాని మోడీ కాంగ్రెస్ అంబేద్కర్‌ను మరుగుపర్చిందని ఆరోపిస్తూ ఆయన వారసత్వమంతా తమ ప్రభుత్వానిదేనని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఆయనకు ఒకస్థానం కల్పించింది తామేనన్నట్టు ప్రకటించుకుంది. వర్గ పోరాటాలతో పాటు సామాజిక రంగంలోనూ సమరశీలత పెంచుకునే దిశగా అడుగులేస్తున్న కమ్యూనిస్టులు అంబేద్కర్ భావాల సమగ్ర చిత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. సహజంగానే దళిత బహుజన వాద సంస్థలూ సంఘాలూ స్వచ్చంద సంస్థలూ సంస్కరణ వాదులూ తమ నిరంతర స్పూర్తిని మరోసారి తలుచుకోవడానికి ముందుకొచ్చాయి. ఇంతమందితో కలడంబేద్కరుండు… అనిపించుకుంటున్న ఆ మహనీయుని మహిత సందేశమేమిటి? మన కాలంలో దాని మహత్తరప్రాధాన్యత ఏమిటి?
చరిత్ర ఒక పాఠ్యపుస్తకమైతే దానికి టీకా టిప్పణి కూడా చరిత్రే. మండల్ వర్సెస్ కమండల్ అన్నవారు, భీమ్ వర్సెస్ రామ్ అంటూ రథయాత్రలు నిర్వహించిన వారు ఇప్పుడు అధికారంలో వున్నారు. కేంద్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక తొలి కదలిక చెన్నైలోని అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్‌ను అడ్డుకోవడంతోనే మొదలైంది. అంబేద్కర్‌తో పెనవేసుకున్న హైదరాబాదు లోని క్యాంపస్‌లో రోహిత్ వేముల ఆత్మార్పణతో ఆగ్రహాగ్ని ఢిల్లీలోని జెఎన్‌యులో కన్నయ్య కుమార్ అనే విద్యార్థి నాయకుని విలక్షణ ప్రసంగాలలో దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది.. అంబేద్కర్ పేరిట జరిపిన ప్రత్యేక రాజ్యాంగ సభ ప్రారంభోపన్యాసంలోనే అన్నీ వేదాల్లోవున్నాయని ప్రకటించిన హొం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాటలు ఇటీవలి జ్ఞాపకమే. రాజ్యాంగం 1949 నవంబరు18న ఆమోదం పొందితే ఆ మరుసటిరోజునే ఆర్గనైజర్‌పత్రిక విశ్వ వినుతమైన మనువు మార్గం దాంట్లో కాస్తయినా చోటు పొందలేదని నిరసించిన సంగతి మరింత పాత ముచ్చట. చారువాలాగా వుండి ప్రధాని కావడం గొప్ప విషయమే గాని ఆ తర్వాత గారువాలాగా మారడంతోనే గాయాలు మళ్లీ సలపడం మొదలైందన్నది సమకాలీన సత్యం.
ఇంతకన్నా దారుణమైన నిజాలు చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మానవ మలాన్ని శుధ్ధిచేసి మోసుకుపోయే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా వున్నది భారత్‌లో. వారు ఏదో బతుకుతెరువు కోసం గాక గొప్ప సామాజిక కర్తవ్యంగా ఆపనిచేస్తున్నారనిగుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీనే వ్యాఖ్యానించారు. (కర్మయోగ- మోడ్‌ీ ఉపన్యాసాల సంకలనం, 2007) ‘వారు ఈ పనిచేయాలన్నది దేవుడి ఆదేశం. ఇదో ఆధ్యాత్మిక చర్యగా శతాబ్దాలుగా కొనసాగుతున్నది. వారి పూర్వీకులు మరేపనిలేకనే ఇది చేసి వుంటారని వూహించడం కష్టం.. ‘ అని కూడా సెలవిచ్చారు. హర్యానాలో దళితులను చంపినప్పుడు ప్రతి కుక్క చావుకూ సంతాపం తెల్పనవసరం లేదన్న మాజీసైన్యాధిపతి మంత్రివర్గంలో కొనసాగుతూనే వున్నారు.కనుక అడగాలంటే ప్రశ్నలు చాలా వుంటాయి గాని అంబేద్కర్ మౌలిక భావాలకూ సనాతన చాందసాలకూ హస్తిమశకాంతరం అన్న వాస్తవాన్ని గుర్తించడానికివి చాలు. హిందూరాజ్యంపై అంబేద్కర్ తిరుగుబాటు బావుటాను టైమ్స్ ఆఫ్ ఇండియా పూర్వ సంపాదకులే ప్రస్తావించారు.
కాంగ్రెస్ హయాంలో ఆయన ఔన్నత్యం మరుగున పడిందని మోడీ ఆరోపించారు. నిజమే. నెహ్రూ గాంధీ భజనలో భగత్ సింగ్‌లూ నేతాజీలు కమ్యూనిస్టు యోధులూ ఇంకా ఎందరో సామాజిక సేవకులూ తెరమరుగైన మాట నిజమే. కాని అందుకు ప్రతి వ్యూహంగా మోడీ ప్రభుత్వం సర్దార్ పటేల్‌ను, నేతాజీని చూపించి నెహ్రూ లౌకిక భావాలపై దాడి చేయడం తిరోగమనమే తప్ప పురోగమనం కాదు. లౌకికతత్వం అన్న మాటను అక్రమంగా రాజ్యాంగంలో జొప్పించారని హౌం మంత్రి తిట్టిపోస్తుంటే అంబేద్కర్ ఆలోచనా ధారకు న్యాయం జరిగినట్టా? లౌకికతత్వం గాక హిందూత్వాన్ని ఆయన కలలోనైనా ఆదరిస్తారా?
కాంగ్రెస్ నాయకులు సరే దళితులు బడుగు బలహీన వర్గాల మంత్రజపంతోనే దశాబ్దాల తరబడి పాలన సాగించారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ జరిపిన విస్త్రత అధ్యయనంలో దేశంలోనే దళితులలో పేదరికం అవిద్య 60శాతం పైగా వున్నట్టు తేలింది. కాంగ్రెస్, తెలుగుదేశం ఇంకా ఆయా రాష్ట్రాల్లోని గత పాలకులు కాకుంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఫ్యూడల్ కులాధిపత్య శక్తుల పెత్తనాలకు వారే చిరునామాగా వున్నది వాస్తవం కాదా? ఇందిరాగాంధీ హయాంలో గొర్రెలు బర్రెలు భూ పంపిణీ బ్యాంకు రుణాలు అంటూ వారిని ఆకట్టుకున్న మాట నిజమే గాని తర్వాత సరళీకరణ గరళం తెచ్చిపోసి దళితులు బలహీనులకు వున్న అవకాశాలు కూడా దెబ్బతీయడానికి ఆరంభ వాక్యం వారిదే కదా? దళిత నేతలకు కొందరికిపదవులిచ్చి ఆ పేరుతో కోట్లమందిని కుటిల రాజకీయాలకు బలిచేయడం నిజం కాదా? కమ్యూనిస్టులు కార్మికులను వ్యవసాయ కార్మికులను సంఘటిత పర్చి పోరాటాలు ప్రారంభిస్తే గంగవెర్రులెత్తి దాడులు దుష్ప్రచారాలు చేసింది కాంగ్రెస్ నేతలు కాదా? ఇదంతా కాదనలేని చరిత్ర. వాటిని ప్రస్తావించకుండా ప్రక్షాళన చేసుకోకుండా రాహుల్‌గాంధీ ఇప్పుడు దళితులకు మళ్లీ కనెక్ట్ కావాలని ఆధునిక భాషలో చెప్పినంత మాత్రాన అంతా కరెక్ట్ అయిపోదు.
కమ్యూనిస్టులు కూడా ఇప్పుడే కదా అంబేద్కర్‌ను ఇంతగా మాట్లాడుతున్నది అని అడగొచ్చు. నిజమే. దానికి వారూ సమాధానం చెప్పుకోవలసిందే. కాని బిజెపి కాంగ్రెస్ లాటి పార్టీలకూ వారినీ తేడాను చూడక తప్పదు. మీరట్ కేసు విచారణ సమయంలోనే 1930లో కమ్యూనిస్టులు ప్రకటించిన తొలి కార్యాచరణ ప్రణాళికలోనే కుల వివక్షపై పోరాటం, దళిత శ్రామికులను సమీకరించి పోరాడటం వంటి అంశాలున్నాయి. సుందరయ్య వంటి నాయకులు ఈ పోరాటాలలో ముందున్నారు. దోపిళ్ళను పీడనలను కుల మత చాందసాలను వారు యువజనసంఘాల ద్వారా సవాల్ చేశారు. పీడిత ప్రజలలో కొత్తకదలిక తెచ్చి వూరూరా సమీకరించి సంఘటిత పర్చింది వారేనన్నది ఎవరూ కాదనలేని సత్యం..ఆయనకూ సైద్ధాంతిక తేడాలున్నా ప్రభుత్వ యాజమాన్యం వుండాలని గట్టిగా భావించారు. బౌద్ధమత స్వీకారం తర్వాత కూడా అనుకున్న లక్ష్యాలు నెరవేరని నిరుత్సాహంలో అంబేద్కర్ తాను కమ్యూనిస్టుపార్టీలో చేరే అవకాశం వుందనిసన్నిహితుడైన గైక్వాడ్‌తో అన్నారట. ఇటీవలనే హత్యకు గురైన గోవింద పన్సారే ఈ సంగతి రాశారు! వారు పారిశుద్య కార్మికులది కర్మయోగం అనలేదు, హక్కుల కోసం కదలించి పోరాడారు. అయితే కుల వివక్షపైన సామాజిక సమస్యలపైన మరింత ఎక్కువగా పోరాటం చేసి వుండాల్సిందని బహిరంగంగానే ఆత్మ విమర్శ చేసుకుని కొత్తవేదికలతో ముందుకువచ్చారు. సబ్‌ప్లాన్, పున్నయ్య కమిషన్ వంటివాటికి కారకులయ్యారు. చాలామంది దళిత సంఘాల నాయకులు ఇప్పుడు సహజ మిత్రులుగానే గాక నికరమైన మిత్రులుగా స్వీకరిస్తున్నారు. ఇంకా దళితుల వెనకబడిన తరగతుల మహిళల భాగస్వామ్యం నాయకత్వం పెంచుకోవలసిందేనని కమ్యూనిస్టులూ గుర్తిస్తున్నారు.కాని అధికారంలో వాటా వారు ఇవ్వలేరు పోరాట పతాకమైతే ఇవ్వగలుగుతారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అలాటి ఒక ముఖ్యమైన పోరాట నినాదం.
ఇక్కడే అసలైన సత్యం ఒకటుంది. పాలకులు ఏదో ఒరగబెడతారని ఒకప్పుడు దళిత జన బాహుళ్యం నమ్మి మోసపోయారు. కాని ఇప్పటికీ కొందరు వారి తరపున మాట్లాడే మేధావులు ఏవో పదవులు తీసుకోవడమే రాజ్యాధికారంలో భాగమైనట్టు చెబుతుంటారు. ఇందుకోసం బిజెపితో కూడా చేతులు కలిపిన సందర్బాలు ఎలాటి ఫలితాలకు దారితీశాయో దేశమంతా చూసింది. మరికొందరు ప్రపంచీకరణలో విముక్తిని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మంచివే గాని పాక్షికమైన ఆలోచనలు. అంబేద్కర్ ఆనాడే చెప్పినట్టు ఆర్థిక సామాజిక సమానత్వం కనీసం సాధికారత సాధించినప్పుడే రాజ్యాంగంలోని రాజకీయ హక్కులు సార్థకమవుతాయి. ఇప్పుడున్న దేశీయ ప్రపంచ పరిస్థితులలో అది ఎదురీతే.దానికి గొప్ప పోరాటం అనివార్యం. మార్టిన్ లూథర్‌కింగ్ కన్న కలకు అమెరికా ఇంకా ఎంత దూరంలో వుందో ఈ కర్మభూమి అంబేద్కర్ మహదప్రస్థాన లక్ష్యానికి అంతకన్నా దూరం వుంది. ఏతావాతా విగ్రహాలకు నమస్కరిస్తూనే వినాశకరవిధానాలను తిరస్కరించకపోతే వివక్ష కొత్త రూపాలు తీసుకుంటుంది.విముక్తి మిథ్యే అవుతుంది. ఆయన జీవితం 125 ఏళ్ల సందేశమూ అదే హెచ్చరికా అదే. (ఎడిట్‌పేజి ఆంధ్రజ్యోతి, 22.4.16)
