సంఫ్‌ు ముక్త్‌ సంవాదం

సంఫ్‌ుmodi ntsh11 ముక్త్‌ భారత్‌ కోసం అందరూ ఏకం కావాలంటూ బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపుపై బిజెపి నేతలు చిందులు తొక్కుతున్నారు. ప్రధాని కావాలనే దురాశతోనే నితిష్‌ ఈ మాట అంటున్నారని అపహాస్యం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ పిలుపును హర్షిస్తూనే తాము ఈ కూటమిలో భాగస్వాములం కాలేమని ప్రకటించారు. ఈ పిలుపునివ్వడంలో నితిష్‌ ఉద్దేశాలేమిటి ఆయన ఆశలేమిటి అవి సరైనవా కావా అనే అంశాలు పక్కనపెడితే సంఫ్‌ు ముక్త్‌ భారత్‌ కావాలని ఆయన కోరడంలో ఆక్షేపించవలసినదేమీ లేదు. జనతాదళ్‌(యునైటెడ్‌) అద్యక్షుడుగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. గతంలో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి కాగానే కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటూ ఇచ్చిన నినాదం తరహాలోనే నితిష్‌ దీన్ని రూపొందించారని భావిస్తున్నారు. మీడియాలోనూ చాలామంది వ్యాఖ్యాతలు దీనిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.. ఆరెస్సెస్‌ సాంసృతిక సంస్థ తప్ప రాజకీయ పక్షం కానప్పుడు అంటే గింటే బిజెపి ముక్త్‌ అనాలి గాని ఆరెస్సెస్‌ ముక్త్‌ అనడమేమిటని బిజెపి నేతలు ే ఆగ్రహిస్తున్నారు. అసహన జ్వాలల నుంచి గొడ్డు మాంసం వివాదం వరకూ, హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ అనేక రాజకీయ రాజ్యాంగ సమస్యలు రగుల్కొన్నప్పుడు చేసిన దానికంటే దీనిపైనే ఇంత రభస జరగడం ఆసక్తికరమే గాక ఆలోచించవలసిన అంశం కూడా.
అభిశసంనల పర్వం
ఆరెస్సెస్‌ రక్తమే తమ నరనరాన ప్రవహిస్తుందని, దానితో అనుబంధం కలిగివున్నందుకు గర్విస్తున్నామని బిజెపి నేతలు వాజ్‌పేయి నుంచి మోడీ వరకూ ప్రకటించినవారే. మోడీ మరో అడుగు ముందుకేసి మొత్తం మంత్రివర్గం పనిపై ఆరెస్సెస్‌ సమీక్షకు కూచోబెట్టారు. బిజెపిలో ఆరెస్సెస్‌ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఎప్పుడూ కొంతమందిని కేటాయిస్తుంటారు. ప్రస్తుత ప్రధాని స్వయానా ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వ్యక్తి. బిజెపితో ి దీర్ఘకాలం చెలిమి చేసిన నితిష్‌ కుమార్‌కు ఈ సంగతులన్నీ తెలుసు. బీహార్‌ ఎన్నికల రంగంలో ఎన్ని తంటాలు పడినా ఫలితం దక్కని బిజెపికి విజేతగా నిలిచిన నితీష్‌ నుంచి ఈ పిలుపురావడం పుండుమీద కారం చల్లినట్టు వుంది. పాలనా పరంగానూ రైతుల పట్ల నిర్లక్ష్యం దళిత బలహీన వర్గాలపై దాడులు వంటివన్నీ కేంద్రాన్ని విమర్శల పాలు చేశాయి. దళితులు హత్యకు గురైతే కుక్కలతో పొల్చిన కేంద్ర మంత్రులు, మహిళలను అవమానించి మాటలు దుర్భరంగా తయారైనాయి. కన్యాకుమారిలో మొదలైన అధికార అసహన దాడి ఆఖరుకు కాశ్మీర్‌లో కల్లోలం వరకూ పాకింది. రిజర్వేషన్లను కూడా తిరగదోడాలన్న పిలుపులు ఆరెస్సెస్‌ కుదురునుంచే వచ్చి ఆ పైన సర్దుకున్నాయి.ఆర్థిక రంగంలోనూ బాహాటంగా కార్పొరేట్‌ అనుకూలత కార్మిక భద్రతపైన, పిఎప్‌ వంటి సదుపాయాలపైన వేటు నిరసనాగ్ని రగిలించాయి. అతి చిన్న రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో కూడా అధికారపీఠం కోసం గవర్నర్‌ల ముసుగులో కాంగ్రెస్‌ను మించి సాగించిన నిరంకుశ చర్యలు న్యాయస్థానాల ఆక్షేపణకు గురైనాయి. కరువుపై నిర్లక్ష్యాన్ని అవి కడిగిపారేస్తున్నాయి. గొప్పగా చెప్పుకున్న స్వచ్చ భారత్‌ కంటితుడుపు తతంగకాగా మేకిన్‌ ఇండియా ఉత్పత్తి ఉపాధులకు ఏమాత్రం దోహదం చేయడం లేదని తేలిపోయింది. లలిత్‌ మోడీ నుంచి విజరు మాల్యా వరకూ అక్రమ కుబేరులకు అండగా నిలవడం అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఆఖరుకు దేశభద్రత కూడా డొల్లగా మారిందని పఠాన్‌కోట ఘటన నిరూపించింది.

పనిచేయని పాచికలు
మోడీని అసాధారణ నాయకుడుగా ప్రజల దృష్టిలో ప్రతిష్టించేందుకు వేల కోట్లతో ప్రచారం సాగించినా ఆయన పార్టీకి 2014 ఎన్నికల్లో 31 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని గుర్తుంచుకోవాలి.( అప్పట్లో ఆయనకు అండగా నిలిచాయి గనకే కార్పొరేట్లు ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తమ వాటా కోసం పట్టుపడుతున్నాయి) బిజెపి 31 శాతం ఓట్లతోనే 282 సీట్లు తెచ్చుకోవడం ఎన్నికల చరిత్రలోనే అతి తక్కువ కిందలెక్క. కాంగ్రెస్‌కు 19.7 శాతం ఓట్లు రాగా సీట్లు మాత్రం 44 మాత్రమే వచ్చాయి గాని 2009లో బిజెపి 18.5 శాతం ఓట్లతోనే 116 లోక్‌సభ సీట్లు తెచ్చుకోగలిగింది. వరుస కుంభకోణాల తర్వాత కాంగ్రెస్‌ అనూహ్యమైన రీతిలో సీట్లు కోల్పోకపోతే బిజెపికి మెజార్టి వచ్చే అవకాశమే వుండేది కాదు. అయితే ఆ తర్వాత బిజెపి హర్యానాలో మాత్రం కొత్తగా అధికారంలోకి రాగలిగింది మహారాష్ట్రలో కూడా పూర్తి మెజార్టి రాలేదు. జమ్మూ కాశ్మీర్‌లో పిడిపితో కలసి అధికారం పంచుకున్నది. చాలా ఉప ఎన్నికలలో దెబ్బతిన్నది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ అస్సాంలో మాత్రమే అత్తెసరుతో నెట్టుకురావచ్చని ఆశపెట్టుకుని కూచుంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, పాండిచ్చేరి,తమిళనాడులలో అది సోదిలోకి వస్తే ే గొప్ప. రేపు 2017లో యుపిలో జరిగే ఎన్నికలలో కూడా బ్రాహ్మణులు రాజపుత్రుల ఓట్లు ఎలాగైనా తెచ్చుకోవడానికిగాను రామమందిర సమస్యను తిరగదోడింది. సుబ్రహ్మణ్యస్వామి ఈ సమస్యను సుప్రీం కోర్టు ముందు లేవనెత్తారు. మొత్తంపైన ఏదో విధంగా హిందువుల ఓట్లను రాబట్టుకోవడమే దీని వెనక తారకమంత్రంగా పాచికలు వేస్తున్నది. బెంగాల్‌లో పైకి మమతా బెనర్జీని విమర్శిస్తూనే వామపక్షాలు రాకుండా చేయడానికి లోలోపల సహకరించడం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాకుండానే బిజెపి ఎంత ఇరకాటంలో పడిపోయిందో ఈ ఉదాహరణలన్నీ మనకు కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి.ఇలాటి సమయంలో నితిష్‌ సంఫ్‌ు ముక్త్‌ భారత్‌ అనడం మరింత కంటగింపుగా మారింది.

ఆ రెండు పార్టీల వెలుపల…
ఈ పిలుపు సాధ్యాసాధ్యాలేమిటి,ఇందులో కలసి వచ్చేపార్టీలేమిటి, కూటములేమిటి, వ్యక్తులుగా ఎవరి పాత్ర ఏమిటి వంటి చర్చలు ఇప్పుడు అసందర్భం. నితిష్‌ కుమార్‌కు కూడా ఈ విషయంలో చాలా పరిమితులు వున్నాయనేది నిజం. సంఘ పరివార్‌కు వ్యతిరేకంగా జనతా పరివార్‌ పునరేకీకరణ కోసం గతంలో జరిగిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించే ఆలోచన జరుగుతున్నట్టు కనిపిస్తుంది. యుపి సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌, నితిష్‌ కుమార్‌ ఉభయులకూ ప్రధాని ఆశలున్నట్టే కనిపిస్తుంది గాని రాష్ట్రాలకే పరిమితమైన పాత్ర వారిది. కాంగ్రెస్‌ నితిష్‌ను బలపరుస్తూనే వారి కూటమిలో చేరే అవకాశాలు లేవని ప్రకటించింది. రాహుల్‌గాంధీ పట్టాభిషేకమే లక్ష్యంగా గల ఆ పార్టీ ఎలాగూ మరొకరిని బలపర్చదు. బతకనివ్వదు కూడా. పైగా ఆ పార్టీపాలనలో వున్నదే తొమ్మిది చిన్న రాష్ట్రాలు కాగా ఇందులో రెండు కేరళ, అస్సాం ఇప్పుడు జారిపోతాయి. ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ సంక్షోభంలోపడ్డాయి. మిగిలింది మిజోరాం, మణిపూర్‌, కర్ణాటక, మేఘాలయ, హిమచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే. పైగా గత ఎన్నికలలో కాంగ్రెస్‌ బిజెపిలకు కలసి వచ్చిన ఓట్లు 50 శాతం కన్నా కొంచెమే ఎక్కువ. కనుక దేశంలో రాజకీయాలను ఈ రెండు పార్టీల మధ్యనే ఆలోచిస్తే సమాధానం దొరకదు. కాంగ్రెస్‌పై ధ్వజమెత్తడం ద్వారా తనే మెరుగని చూపించుకోవడానికి బిజెపి ఎప్పుడూ వ్యూహాలు అమలు చేస్తుంటుంది. ఇక కాంగ్రెస్‌ బిజెపి మతతత్వాన్నే చూపించి తన సుదీర్ఘ పాలన నిర్వాకాలను దాటేసే ప్రయత్నం చేస్తుంటుంది.కాంగ్రెస్‌ బిజెపిల మద్య అటూ ఇటూ సంచరిస్తూ పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన ప్రాంతీయ పాలక పార్టీల వైఖరి కూడా సరికాదని సిపిఎం గత చాలాకాలంగా విమర్శిస్తూ వుంది. అనేక రకాల అవకాశవాదాలకు పాల్పడిన గత పోకడలను సవరించుకోకుండా నితిష్‌ వంటివారు భారీ పిలుపులిచ్చినా విశ్వసనీయత వెంటనే కలగదు. ప్రాంతీయ పార్టీలు వామపక్షాలకు కూడా రాజకీయ పునస్సమీకరణలో ముఖ్య పాత్ర వుంటుంది. ఇదంతా ముందుముందు ఏ రూపం తీసుకుంటుందనేది అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు,ఆ తర్వాత పంజాబ్‌ యుపి ఎన్నికల అనంతరమే స్పష్టమవుతుంది. ఈ లోగా కూడా మతతత్వ రాజకీయాలపైన నిరంతర పోరాటం సాగుతూనే వుంటుంది. సహజంగానే వామపక్ష లౌకిక శక్తులు అందులో ముందు నిలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *