కేంద్రానికి మరో మొట్టికాయ

ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కొట్టివేస్తూ హైకోర్టు బెంచి ఇచ్చిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొట్టికాయలాటిదే. న్యాయమూర్తులు జోసప్,భిషత్లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా వున్నాయి. తనతీర్పు వచ్చేలోగానే హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం పక్షపాత పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు. కోర్టులతో ఈ విధంగా రాజకీయ క్రీడ ఆడటం సరికాదని ఆక్షేపించింది. రాష్ట్రపతి ఉత్తర్వు కూడా పొరబాటు కావచ్చని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి హరిష్ రావత్ సభలో బలం కలిగివున్నదీ లేనిదీ సభలోనే తేల్చుకోవాలని తాము చెబుతుంటే రకరకాల సాకులతో అడ్డుపడటం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు కూడా తాము తీర్పు ఇచ్చేలోగా హడావుడిగా బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాల నేపథ్యంలోనే 29న బలపరీక్ష జరగాలని నిర్దేశించింది. 356వ అధికరణాన్ని దుర్వినియోగపర్చడం తగదని విమర్శించింది. తుదితీర్పు వాయిదా వేసింది గనక బలపరీక్ష ప్రహసనం తర్వాత మరిన్ని రాజకీయ మార్పులకు అవకాశం వుంటుందని చెప్పాలి.