క్యాథలిక్ మతాధికారిగా అత్యాచార శిక్షితుడు

14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు గాను అమెరికా న్యాయస్థానంలో విచారణ నెదుర్కొని ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించిన జోసప్ జీపాల్ అనే క్యాథలిక్ మతాధికారిని ఉదకమండలం(వూటీ)లో వాటికన్ నియమించడంపై అమెరికా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈయన క్రూక్‌స్టన్‌లో పనిచేస్తున్నప్పుడు ఈ విచారణ జరిగింది. అయితే 2010లో ఆయనను ఇండియాకు పంపించేశారు. వాటికన్ ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఊటీ డోసియస్‌లో తన నియామకం జరిగిందని తెలిసిన తర్వాత వేగాన్ పీటర్సన్ అనే 29 ఏళ్ల మహిళ గతంలో తనపై చేసిన అత్యాచారానికి సంబంధించి మళ్లీ కేసు వేసింది. ఈ కేసులో ఒకసారి రాజీ కుదుర్చుకుని భారీ మొత్తం చెల్లించిన క్యాథలిక్ చర్చి తనను మళ్లీ బాధ్యతల్లో నియమించడంతో స్నాప్(సర్వయివర్స్ నెట్‌వర్క్ అగైనెస్ట్ అబ్యూజెస్ బై ప్రీస్ట్) అనే సంస్థ తరపున ఎడ్వర్డ్ సూన్వ్ ఈ కేసు వాదిస్తున్నారు. తన చిన్న తనంలో ఏడాది పాటు జీపాల్ అత్యాచారానికి గురి చేశాడని ఆమె చెప్పారు. మొదట్లో తనకు విషయాలు తెలియక లోలోపలే వుండిపోయాయని ఇప్పుడు ఈ బాలిక పోరాటం చూసిన తర్వాత బయిటకు వచ్చానని ఆమె చెప్పారు. అమెరికాలో నేరం చేసిన వారిని ఇండియాకో మరో చోటికో పంపిస్తే నిందితులు మరింత ఘోరంగా ప్రవర్తించే అవకాశం వుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మతాధికారుల నేరాలకు గాను పోప్‌పలు సార్లు క్షమాపణలు చెప్పడం చూస్తుంటాం. కాని ఇప్పుడు నేరుగా న్యాయస్తానమే అభిశంసించిన నేపథ్యంలో వాటికన్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.మతం ముసుగులో మతాధిపతుల ముద్రతో నేరాలు ఘోరాలకు పాల్పడ్డం అన్ని దేశాల్లో అన్ని మతాల్లో ఎలా సాగిపోతున్నదో ఈ ఉదంతం మనకు తెలియజెబుతుంది.