అడ్డగోలు ఆలయాలు దేవుళ్లకే అవమానం!

ప్రభుత్వ స్థలాల్లో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మధ్యలో కొన్నిసార్లు
కాల్వగట్లపై ఆఖరుకు మరుగుదొడ్ల పక్కన కూడా ఎక్కడంటే అక్కడ అడ్డంగా ఆలయాలు కట్టించేయడం చూస్తుంటాం. కొన్నిచోట్ల ముస్లింలకు
సంబంధించిన కట్టడాలు కూడా ప్రధానంగా హైదరాబాద్ వంటిచోట్ల
ఇలాగే కనిపిస్తుంటాయి. వాటివల్ల ట్రాఫిక్‌జామ్‌లు కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినా అంటుకుంటే రణరంగాలేనన్నంత ఉద్రిక్తత సృష్టిస్థాయి మత సంస్థలు. పీఠాధిపతులు పునాది రాయి వేశారంటూ చిన్నదిగా మొదలై విస్తరించడం ఆ పైన అటూ ఇటూ స్థలాలు కూడా ఆక్రమించడం అన్నిచోట్లా అనుభవమే. ఇలా అడ్డగోలుగా ప్రార్థనా స్థలాలు కట్టేయడం దేవుడుకి అవమానం కాదా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా వున్న ఇలాటి ప్రార్థనా స్థలాలన్నిటినీ తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని 2006లోనే తాము ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని అక్షింతలు వేసింది. దీనిపై ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనా లాయర్ల
సలహాపై వాయిదా వేసింది. న్యాయమూర్తులు గోపాలగౌడ్,అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో అలక్ష్యానికి ఆగ్రహిస్తూ మా ఉత్తర్వులు వూరికే బూజుపట్టిపోవడానికేనా అని ప్రశ్నించింది. హఠాత్తుగా చిన్న గూడులో గుడి మొదలు పెట్టి ఆపైన అలా అలా పెంచేయడం దానికో తోరణం అన్ని పట్టణాల్లోనూ చూస్తున్నదే.బిజీ రోడ్ల మధ్యలో ముస్లిం పతాకాలతో పంజాసెంటర్లు కనిపిస్తుంటాయి.పార్కులోనో కెనాల్‌మద్యలోనో ఒక గుడికట్టేస్తారు. వాటర్ ట్యాంకు కింద లేదంటే ట్యాంకుబండ్ కంతలో అమ్మవారిని పెట్టేస్తారు. ట్రాఫిక్‌కు అంతరాయంగా వుండేవాటిని తొలగించాల్సిందేనని రాజకీయ నాయకులు ఒప్పుకుంటారు గాని తీరా ఆ సమయం వచ్చే సరికి సంఘ పరివార్ లేదా మజ్లిస్ పెద్దలే గొడవ చేస్తారు. మరి సుప్రీం వ్యాఖ్యలపై వారు స్పందిస్తారా?