సాప్ట్ ఉద్యోగాల కోసం ఐటికి బై

పని ఒత్తిడి గురించి గత వారంలో రెండుసార్లు చర్చించాము. ఇప్పుడు మరింత గట్టి ఆధారాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు ఐటిలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలంటే ఎంత ఆకర్షణో. మధ్యలో 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు కొంత ఒడుదుడుకులు కనిపించినా మళ్లీ పట్టాలెక్కింది. అయితే ఇప్పుడు అలాటి బయిటికారణాలేమీ లేకుండానే సాప్ట్‌వేర్ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి బయిటకు వచ్చేస్తున్నారట. విపరీతమైన భౌతిక మానసిక ఒత్తిడి వంట్లో శక్తియుక్తులను తోడేస్తున్నదనే ఆందోళన తర్వాత తాము ఎందుకూ కొరగామన్న దిగులు ఇందుకు కారణమవుతున్నాయి. హిందూ పత్రిక దీనిపై చాలా మందితో మాట్లాడి వివరాలు ఇచ్చింది. 70 నుంచి 90 వేల వరకూ వచ్చేవారు కూడా హఠాత్తుగా మానేసి టీచర్లుగా ఫ్యాకల్టీలుగా చేరిపోతున్నారట.30లలో 40 లలో వున్నవారే బయిటకు రావడం ఆసక్తికరం. నైపుణ్యం వుండి ఇప్పటికే ఒక ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఇక ఇక్క
డ గిడచబారిపోవడమే తప్ప ముందుకు సాగడం వుండదని అనుకుంటున్నారు. జీవితంలో కాస్త స్థిరపడిన తర్వాత ఇంకా ఈ ఒత్తిడి బతుకునుంచి బయిటపడాలని కోరుతున్నారు.వీరే గాక ఇక్కడ తమకు పెద్దగా అవకాశాలు వుండవని అర్థమైన వారు కూడా తామే వచ్చేస్తున్నారు. కొందరు బోధనారంగంలో ప్రవేశిస్తే ఎక్కువ మంది ఏదో ఒక స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నారు. బెంగుళూరులోనైతే మరింత విచిత్రంగా సాఫ్ట్‌వేర్ రంగం నుంచి లాభదాయకమైన వ్యవసాయ రంగంలోకి కూడా తరలిపోతున్నారట. ఉదాహరణకు 18 ఏళ్లు ఐటిలో పనిచేసిన లక్ష్మీనారాయణ బెట్టాడ బహుదూర్ తోటలో పార్ట్‌టైం పనిచేస్తున్నారు. ఈ విధమైన వలసలు గతంలో కూడా వున్నా రెండు మూడేళ్ల నుంచి సామూహికంగా వెళ్లిపోవడం కనిపిస్తుందని సిఇవో ఒకరు చెబుతున్నారు.