లక్షల ఫైళ్ల పెండింగు!

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిందేమిటో గుర్తుందా? ఫైళ్ల క్లియరెన్సు వారం అంటూ ఒకటి జరిగేది. ఆ సమయంలో హడావుడిగా వాటిని తేల్చిపారేసేవారు. ఈ క్రమంలో అనేక అవకతవకలు అనుచిత వ్యవహరాలు కూడా జరిగిపోతాయనే విమర్శలు వినిపించేవి. ఈ దఫా ఆ విమర్శకు అవకాశం ఇవ్వకూడదని ఆయన భావించినట్టున్నారు. అందుకే ఆరులక్షల ఫైళ్లు పెండింగులో వున్నా వాటిపై దృష్టి పెట్టకుండా విదేశీ పర్యటనలకు వాణిజ్య చర్చలకు ప్రాధాన్యత నిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అత్యధికంగా 2.75 లక్షల వరకూ పెండింగు పడిపోయాయని ప్రజాశక్తి ఆదివారం పతాకశీర్షిక నిచ్చింది. ప్రజలకు దగ్గరగా వుండాల్సిన కలెక్టరేట్లలో 1.40 లక్షల ఫైళ్లు బూజుపడుతున్నాయి. అనంతపురం,శ్రీకాకుళం, తూర్పుగోదావరి,కడప,శ్రీకాకుళం, ప్రకాశం విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగులో వుంటే కర్నూలు విశాఖపట్టణం జిల్లాలో 60 శాతం పడివున్నాయట.
పైళ్లు ఎందుకు కదలడం లేదంటే మొదటి కారణం నిబందనలకు విరుద్ధంగా ఏదో ఒత్తిడిపై పూర్తి చేయడం వల్ల పై అధికారులు పట్టించుకోవడం లేదట. భూములకు సంబంధించిన ఫైళ్లు తీసుకుంటే గతానుభవాల రీత్యా ఎక్కడ చిక్కుకుంటామోననే భయం అధికారులను వేధిస్తున్నది. పై తరగతుల సంగతి ఎలా వున్నా సామాన్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు ఇలా పేరుకుపోతే పరిస్థితి ఎంత దుర్భరంగా వుంటుంది? ఇలా పేర బెట్టి ఒక్కసారిగా ఆదరాబాదరగా క్లియర్ చేస్తే అప్పుడు మరెన్ని అకృత్యాలకు అవకాశం కలుగుతుంది? కనుక ఇది ఫైళ్ల సమస్య కాదు- ప్రజలకూ రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా చూడాల్సిందే. అందులోనూ విభజిత రాష్ట్రంలో మొదటి దశ గనక ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తే అంత మంచిది.