ఉడుకుమోతు వెంకయ్య…

వెంకయ్య నాయుడు కావడానికి సీనియర్ మోస్ట్‌మంత్రిగా వున్నారు గాని చిన్న పిల్లల్లా ఉడుక్కోవడంలో ఆయనకు ఆయనే సాటి. అందులోనూ కమ్యూనిస్టులు గుర్తువచ్చినా లేక తనే గుర్తు చేసుకున్నా రెచ్చిపోతారు. కాంగ్రెస్ అధికారంలో తిష్టవేస్తే కమ్యూనిస్టులు విద్యాలయాను ఆక్రమించారని ఆయన ఈ వారం నెల్లూరు జిల్లాసభల్లో వాపోయారు. కేంద్రంలో రెండు సార్లు ప్రభుత్వాలు నిర్వహించడమే గాక జనతా ప్రభుత్వ హయాంలోనూ విద్యాశాఖ నిర్వహించింది బిజెపి నేతలే. వ్యూహాత్మకంగానే వారు విద్యాశాఖను విదేశాంగ శాఖను సమచార శాఖను కోరుకుంటారు. 1977లో జనతా ప్రభుత్వ హయాంలోనూ రోమిలా థాపర్ వంటివారి పుస్తకాలు ఉపసంహరించడానికి విఫలయత్నం చేశారు. వాజ్‌పేయి హయాంలో మురళీ మనోహర్ జోషి విద్యామంత్రిగా మరో అడుగు ముందుకేసి సిలబస్‌ను మార్చడమే గాక జ్యోతిష్యం వంటి వాటిని విద్యాలయాల్లో ప్రవేశపెట్టారు.ఇప్పుడు సరే మోడీ హయాంలో స్వంతంగా మెజార్టి వుంది గనక మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చి విద్యాలయాలను ప్రత్యక్షంగా పాలించిన బిజెపి నేతలు అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యమే కొనసాగుతుందని అంగీకరించడం విశేషం. అంటే యువజన విద్యార్థులలోనూ, ఆలోచనా పరులైన మేధావులలోనూ బిజెపి ప్రచారాలు పనిచేయడం లేదన్న మాట. అందుకు కారణాలేమిటి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఎలా వదుల్చుకోవాలి అని ఆలోచించేబదులు కమ్యూనిస్టులపై విరుచుకుపడటం అర్థంలేని పని. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు శ్రీనగర్ ఎన్‌ఐటిల వరకూ ఎన్ని వివాదాలు సృష్టించినా విద్యార్థులు వినాశకర భావజాలాన్ని స్వీకరించడం లేదన్న మాట. ప్రగతిశీలత దేశభక్తి నిండిన వామపక్ష రాజకీయాలు యువతను మేధావులను ఆకర్షిస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్‌కు మద్దతుగా చిత్రించడం బిజెపి రాజకీయ వ్యూహం మాత్రమే. నిజానికి ఇదంతా కమ్యూనిస్టులు, లౌకిక శక్తులు సామాజిక తరగతులలో విస్త్రత కృషిపలితమే.విషపుదాడులు ఎన్ని చేసినా యువత తిరతిరతిరోగమనవాదనలకులోనుకాదు. తాత్కాలికంగా ఆవేశాలకు కవ్వింపు ప్రచారాలకు గురైనా ప్రాథమికంగా యువతలో అభ్యుదయ భావాలదే పై చేయిగా వుంటుంది. వాస్తవంగా వెంకయ్య నాయుడు తమ పార్టీ వారిపైన కూడా ఈ మద్య ఎక్కువగా విసుక్కుంటున్నారనే మాట వినిపిస్తుంది. బహుశా తన హయాంలో తెలుగు రాష్ట్రాలలో బిజెపి పెరుగుదల జరగదనే నిరాశ కూడా ఇందుకు కారణం కావచ్చు. కేంద్రం నుంచి అందిన సాయంపై అతిశయోక్తులు కింది స్థాయి నాయకులు చెబితే బావుంటుంది గాని సాక్షాత్తూ వెంకయ్య నాయుడే జాతీయ రహదారుల అయిదేళ్ల నిధులను కూడా ఎపికి సాయం కింద చూపిస్తే ఎలాగని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి రావలసినసాయం వేగంగా రప్పించే బదులు రానిది వచ్చిందని బుకాయించడం తగదని వారు చెబుతున్నారు.