మోడీ ‘ముస్లిం’ భేటీపై అసత్యాలు!

Muslim_2816502p
ప్రభుత్వాల ప్రచార విభాగాలు పేరుకుతగినట్టే ప్రశంసలకు ప్రాధాన్యత నిస్తాయి. ఎవరు తమ ప్రభుత్వాలను కాస్త మెచ్చుకున్నా గొప్పగా చలామణి చేస్తాయి. అది వాటి బాధ్యత. అయితే ఆ ఉత్సాహం మరీ శ్రుతిమించి అత్యుంతన సంస్థలే అవాస్తవాలు ప్రచారంలో పెడితే అంతకన్నా అన్యాయం ఏముంటుంది?
ముస్లిం ప్రముఖుల బృందంతో ప్రధాని మోడీ జరిపిన భేటీలో ఆయన సౌదీ అరేబియా పర్యటన ఫలితాలను వారు ప్రశంసించినట్టు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ఒక ప్రకటన విడుదల చేసింది. ముస్లిం ప్రపంచంతో దౌత్య సంబంధాల పెంపుదలకు మరింత చొరవ తీసుకోవలసిందిగా వారు అభ్యర్థించినట్టు కూడా ఆ ప్రకటన తెల్పింది. అయితే వాస్తవంగా తమ భేటీ అందుకు జరగలేదని తాము అలా మాట్లాడలేదని ప్రతినిధివర్గంలోని పలువురు ప్రముఖులు తెల్పినట్టు హిందూ వార్త నిచ్చింది. తాము ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ప్రధాని దృష్టికి తెచ్చామని ప్రతినిధిబృందంలోని సంపాదక ఎంపి ఒకరు తెలిపారు. గతంలో బిజెపిలో పనిచేసిన బృంద నాయకుడుఎజెఖాన్‌ ఒక్కరే సౌదీ పర్యటనను ప్రస్తావించి ప్రశంసించారట. అదే బృందంలోని మరో సభ్యుడు షియాలు ఎక్కువగా వుండే ఇరాన్‌తో కూడా సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. అలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీ మైనార్టి హౌదాను పునరుద్దరించాలని ప్రతినిధి వర్గం చేసిన సూచనకు ప్రధాని నుంచి స్పందన కరువైందని వారు తెలిపారు. ఇక ముస్లిం విద్యా వికాసాలకోసం మరింత కేంద్రీకరించి కృషి చేయాలని కూడా కోరినట్టు పలువురు సభ్యులు చెప్పారు. వీటన్నిటినీ పక్కన పెట్టి కేవలం సౌదీతో పర్యటనను ప్రశంసించేందుకే వారు కలిసినట్టు, మిగిలిన ముస్లిం ప్రపంచంతోనూ సంబంధాలు పెంచుకోవాలని కోరినట్టు ప్రకటన విడుదల చేయడం లేనిపోని మత భావన పెంచడానికే దోహదం చేస్తుంది గనకే వివరణ ఇస్తున్నట్టు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *