అసత్య హరిశ్చంద్రులెవరు?

తెలుగురాష్ట్రాల పాలకులైన ఉభయ చంద్రుల సుహృద్భావ సంకేతాలకు అటూ ఇటూ కూడా ప్రజలు సంతోషిస్తున్నారు. స్నేహాన్ని మించిన సహౌదర భావంతో ఇరు రాష్ట్రాలు వర్థిల్లాలని కోరుతున్నారు. సందేహం లేదు. అయితే పానకంలో పుడకల్లా అపరిష్క్రత సమస్యలు ముందుకొచ్చినప్పుడు అనవసర వివాదాలు రగుల్కొన్నప్పుడు ఆవేదన చెందుతున్నారు కూడా. అయితే వీటన్నిటిలోనూ విచిత్రమైన పరిస్థితి విలీన మండలాల పున:స్వాధీన సమస్య. చాలా కాలం కిందట -కొమ్మినేని శ్రీనివాసరావు తన లైవ్‌షోలో అడిగారు- ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టుగా కె.చంద్రశేఖరరావు చెప్పిన మాట నిజమయ్యే అవకాశం వుందా అని. ఇంత కీలకమైన అంశంపై అవగాహనే కుదిరితే చాలా సంచలనం అవుతుంది, పైగా రాష్ట్రపతి ఉత్తర్వుపై జరిగింది గనక కేంద్రంతోనూ ముడిపడి వుంటుంది. అంత తేలిగ్గా జరగకపోవచ్చు అని బదులిచ్చాను. అయితే తర్వాత దానిపైన ఇరుప్రభుత్వాలు కూడా ఎలాటి వివరణ ఇవ్వలేదు. తాజాగా శ్రీరామనవమి రోజున భద్రాచలంలో కెసిఆర్ మళ్లీ ఈ విషయం పున:ప్రస్తావన చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ ఎప్పుడు తమ మధ్య అంగీకారం కుదిరిందో మాత్రం చెప్పలేదు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటలు ఇతరులకు తెలియకపోవచ్చు గనక మిగిలిన వారు కూడా మాట్లాడలేదు. అయితే శనివారం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ అవకాశం లేదని తేల్చిచెప్పారు. గోదావరి కృష్ణా నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలోనూ తీవ్ర విభేదాలు ప్రకటించారు. విభజన తర్వాత విభేదాలు వుండటం సహజమే. వాటిని చర్చించి పరిష్కరించుకోవలసిన మాట కూడా నిజమే. అయితే విలీన మండలాల విషయానికి వచ్చేసరికి ఎవరో ఒకరు నిజం చెప్పడం లేదా? చెప్పి మాట మారుస్తున్నారా? అని సందేహించాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలలో రాజకీయ నీలినీడల దృష్ట్యా ఇలాటి సందేహాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై ఎక్కువగా వుంటుంది. అసలు ఆ ప్రస్తావన వచ్చిందా లేదా? గతంలో సుముఖంగా మాట్లాడారా? లేక కెసిఆర్ ఆయన మరేదో చెబితే అలా అర్థం చేసుకున్నారా? కేంద్రం ప్రమేయం లేకుండా వీరిద్దరే దీన్ని మాట్లాడుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
ఖమ్మం జిల్లా చింతూరు, కూనవరం, భద్రాచలం రివెన్యూ డివిజన్ గ్రామాలు మినహా తక్కినవి, బూర్గుంపాడు, కకునూరు, పాలేరుపాడు, వరరామచంద్రాపురం మండలాలలో మొత్తం 211 గ్రామాలను ఎపికి బదలాయిస్తూ విభజన చట్టం నిబంధనల మేరకు రాష్ట్రపతి 2014 మే29న ఉత్తర్వు చేశారు. వాటిపై ఏ ఒప్పందమైనా మళ్లీ కేంద్రం ద్వారానే అమలు కావలసి వుంటుంది.