పవన్ కళ్యాణ్ పైపై సరదాలే చాలునా,
రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ రకరకాల మాటలతో పొద్దుపుచ్చుతున్నారనే అందరూ భావిస్తున్నారు. అయితే మిగతా హీరోలతో పోలిస్తే కమర్షియల్ ్ సినిమాల విషయంలోనూ పవన్ కళ్యాణ్ హెచ్చుతగ్గులు చాలా తీవ్రంగా వుంటాయి. తనకు ఇంత స్టార్డమ్ ఇచ్చిన అభిమానులను సంతోషపెట్టడానికి నిర్మాతలకు భద్రత కల్పించడానికి కూడా పెద్ద సీరియస్‌గా వున్నట్టు కనిపించరు. ఇంత పేరు రావడానికి ముందు తీసిన సినిమాలలో వున్న కథాబలం పాత్ర చిత్రణ తను ఎదిగిన తర్వాత తీసిన వాటిలో కనిపించకపోవడం విశేషం. తొలి చిత్రాన్ని వదిలేస్తే తర్వాత గోకులంలో సీత, తొలిప్రేమ,బద్రి, తమ్ముడు, సుస్వాగతం, ఇవన్నీ యువత చుట్టూతిరిగే కథాంశంతో నడుస్తాయి.అప్పటి ఆయన వయస్సుకు అవి బాగా సరిపోయాయి. వాటిలో నటన కూడా హుషారుగా సహజంగా వుంటుంది. మొదటి అతి పెద్ద విజయం ఖుషీ ప్రధానంగా ఎస్‌జె సూర్యకు చెందవలసిన క్రెడిట్. పవన్ కళ్యాణ్ స్టార్హీరో కావడానికి బాట వేసింది. తమ్ముణ్ని చూసి జాగ్రత్త పడుతున్నాను అని అప్పట్లో చిరంజీవి చెప్పడానికి కారణమైంది. ఆ వెంటనే స్వీయ దర్శకత్వంలో తీసిన జానీలో కావలసినంత రోటీనిజంతో దారుణంగా దెబ్బతిన్నది..
ఇక తర్వాత ప్రయోగాలు వద్దంటూ కామెడీ క్రైమ్ ఎలిమెంట్లతో గుడుంబా శంకర్, బాలు తీసి ఫర్వాలేదనిపించుకున్నారు. ఈ చిత్రాలు కూడా గొప్ప పేరు తెచ్చినవీ కాదు గాని మాస్ హీరోగా నిలబెట్టాయి. ఆపైన వచ్చిన బంగారం, అన్నవరం, తీన్మార్, కొమరం పులి, పంజా కథలపరంగానూ కలెక్షన్లరీత్యానూ అంతంత మాత్రమే నడిచాయి. బంగారం, తీన్మార్, కొమరం పులి వంటివైతే మరీ తేలిపోయాయి. అయినా ా యువ ప్రేక్షకులు ఆయనను ఆరాధిస్తూనే వచ్చారు.వీటి మధ్యలో వచ్చిన జల్సా. కూడా కథపరంగా కంటే కలెక్షన్ల పరంగా పరువు నిలబెట్టింది. మరోవైపున పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషీ పాత్రలకు మారుపేరుగా స్థిరపర్చింది. ఆయన చిత్రాల్లో గందరగోళం, అమ్మాయిలను ఏడిపించడం తప్పనిసరైపోయింది. ి విభజన ఉద్యమం నడుస్తున్న ఆ దశలో పవన్ కళ్యాణ్ రాజకీయాంశాలను రగిలిస్తూ తీసిన కెమెరా మన్ గంగతో రాంబాబు వసూళ్లు ఫర్వాలేదేమో గాని చూపిన ప్రభావం తక్కువే. కొన్ని డైలాగులు తీసేశారు కూడా.
ఖుషీ చిత్రంలా పవన్ కళ్యాణ్‌కు ప్రతిష్ట తెచ్చిన చిత్రంగా అత్తారింటికి దారేది చెప్పుకోవాలి. కథలో గొప్పతనం కొత్తదనం లేకున్నా కుటుంబ సంబంధాల సెంటిమెంటుకు మంచి పాత్రలు కామెడీ, పాటలు జోడించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. . తర్వాత వచ్చిన గోపాల గోపాల నిర్మాత సురేష్, ఒక ప్రధాన పాత్రధారి వెంకటేశ్. కృష్ణుడిని ఆధునిక రూపంలో సున్నితంగా అభినయించడమే పవన్ ప్రత్యేకత అయింది.ఆ పైన గబ్బర్ సింగ్ రీమేకలో కామెడీ మేళవించి విజయం సాధించారు.
ఈ మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించిన పవర్ స్టార్ జనసేన కూడా స్థాపించారు గనక చాలా జాగ్రత్త పడాల్సింది. కాని గతంకన్నా ఆషామాషిగా సర్దార్ గబ్బర్‌సింగ్ తీసి దెబ్బతిన్నారు. పైగా ఆర్థిక అవసరాల కోసం తీసినట్టు చెప్పడం మరింత విడ్డూరంగా వుంది. అదే నిజమైతే ప్రేక్షకులను మరీ తక్కువగా అంచనా వేశారని చెప్పాలి. ఇది సీనియర్ హీరోగా ఏ విధంగానూ ప్లస్ కాలేకపోగా తన ఎంపిక ఏ స్థాయిలో ఏ తీరులో వుంటుందో తెలియజెప్పింది.
పవన్ కళ్యాణ్ ఫాన్ పాలోయింగ్ ఇప్పటికీ చాలా ఎక్కువనేది నిజం. అయితే ఏదో ఒకటితీసిపారేస్తే ఎదురుదెబ్బ తప్పదని గతంలో చాలాసార్లు వెల్లడైన విషయం సర్దార్ పరాజయం మరోసారి నిరూపించింది. చాలా లోతైన ఆలోచనగల వ్యక్తిగా అగుపించేందుకు ప్రయత్నించే పవన్ తన వృత్తిరంగంలో ఎందుకింత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారు? కమిట్మెంట్ లేకనా చాలకనా? చే గువేరా బొమ్మతో కనిపించే మనిషి రాజకీయాల్లో కాకున్నా సినిమాల్లోనైనా ఆ ప్రభావం ఎందుకు చూపించరు?
పవన్ రేంజిలో పావు కూడా లేని .చిన్నచిన్న హీరోలు కూడా ఒక వయసులో విజయాలు అందుకుంటారు. తర్వాత వాటిని నిలబెట్టుకోవాలంటే జాగ్రత్తగా బాధ్యతగా అడుస్తేనే సాధ్యమవుతుంది.
వేగంగా మారుతున్న పరిస్తితుల్లో ఐదేళ్ల కిందటో పదేళ్ల కిందటోచేసిన ముతక హాస్యమే పండుతుందని, మసాలాలు వుంటే చాలునని అనుకోవడం పొరబాటు.
రాజకీయ రంగంలో గజిబిజి సరే సినిమారంగంలోనైనా పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇమేజికి తగిన పాత్ర పోషించాలంటే ఆషామాషీ వేషాల
పే ఆధారపడ్డం మానాలి.బలమైన పాత్రలు, అభిప్రాయాలు కావాలి.