ఐఎస్‌ఐఎస్ దాడులు అమెరికా, అరబ్ ప్రభుత్వాలు!

ఇరాక్ సిరియా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్‌ఐఎస్) అనేది నేటి ప్రపంచంలో పెద్ద టెర్రరిస్టు ప్రమాదంగా తయారైంది. అమానుష దాడులకు సామూహిక దాడులకు రాక్షస హత్యాకాండకు మారుపేరుగా వుంది. సిరియాలో అసాద్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ అంతర్యుద్ధం సాగించడమే గాక ఫ్రాన్స్ బెల్జియం వంటి దేశాలలోనూ దారుణమైన దాడులకు పాల్పడింది. ప్రపంచంలో స్వచ్చమైన ఖలీపా రాజ్యాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పుకునే ఐఎస్‌ఐఎస్ పోకడలు వాస్తవానికి మత చాందసాన్ని మరింత పెంచి అనేక దేశాలలో మైనార్టి ముస్లింలపై ద్వేషం పెరగడానికి కారణమవుతున్నాయి. ఇరాక్ సిరియా లిబియూ వంటి దేశాలకు పరిమితం కాకుండా . గ్రీస్, బ్రిటన్, అల్జీరియా, టర్కీ, ఈజిప్టు వంటి చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఎన్ని దాడులు చేసినా వారికి నిధులు ఆయుధాల కొరత వున్నట్టు కనిపించడం లేదు. సౌదీ అరేబియాతో సహా గల్ప్‌లోని రాచరిక ప్రభుత్వాలు వారికి ప్రాపుగా వుండటమే ఇందుకు కారణం. ఈ దేశాలన్నిటితో అమెరికాకు సన్నిహిత సంబంధాలుండటం మరో వాస్తవం. 2001 సెప్టెంబరు 11న డబ్ల్యుటిసి టవర్లపై దాడి తర్వాత అమెరికా టెర్రరిజంపై యుద్ధం ప్రకటించింది. నచ్చని అరబ్ దేశలలో ప్రభుత్వాల మార్పునకు రంగంలోకి దిగింది. ఇ
దే సమయంలో నాగరికతల యుద్ధం పేరిట మతాల మధ్య ముఖ్యంగా క్రైస్తవ ఇస్లాం మతాల మధ్య యుద్ధం జరుగుతుందని ఆ దేశంలోని తిరోగామి మేధావులు సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తున్న చాలా వినాశకర పరిణామాలన్నీ ఆ విధానం పర్యవసానాలే.
పెట్రోలియం సంపదలు కైవశం చేసుకోవడానికి అమెరికా అరబ్ ప్రపంచంలో సదా అగ్ని రగులుతుండాలనే కోరుకుంటుంది. అందుకోసం ఒకప్పుడు నాజర్ మరొకప్పుడు అరాఫత్ మరోసారి గడాపీ మరోసారి సద్దాం హుస్సేన్ ఇలా ఎవరో ఒక అరబ్ నేతను శత్రువుగా ప్రకటించి వేటాడుతూ వచ్చింది. ప్రజాస్వామ్యం పేరిట ఇంత హడావుడి చేసే అమెరికా అచ్చంగా రాచరికం సాగే అరబ్‌దేశాల జోలికి పోదు, సౌదీ అరేబియా వంటివిదానికి ఆప్తమిత్రులు. ఆ రాచరిక నిరంకుశ ప్రభువులు కూడా ప్రజలను దారితప్పించేందుకు ఏదో ఒక పేరట మత తత్వాన్ని రెచ్చగొడుతుంటారు. అల్ ఖైదా వ్యవస్థాపకుడైన బిన్ లాడెన్ సౌదీరాజకుటుంబీకుడన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సౌదీ ఐఎస్‌ఐఎస్‌కు మద్దతునిస్తుంటుంది. రష్యా మొండికెత్తి అడ్డం తిరగకపోతే ఈ పాటికి సిరియాలోనూ అల్లకల్లోలం తాండవిస్తుండేది. గతంలో ప్రభుత్వాలను కూల్చిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లిబియా ఈజిప్టు వంటిచోట్ల జరుగుతున్నది అదే. అమెరికాలోనూ యూరప్‌లోనూ కూడా పెద్ద వ్యాపారం ఆయుధాల అమ్మకమే. కనుకనే అటు చమురుసంపదకోసమూ ఇటు ఆయుధ వ్యాపారం కోసమూ వారికి అంతర్యుద్ధాలు స్థానిక యుద్ధాలు కావాలి. అశాంతి వుండాలి. ఇక అరబ్ రాజులకూ అదే అవసరం. ఈ రెంటికీ మత చాందసం తోడైన ఫలితమే ఐఎస్‌ఐఎస్ ముసుగులో సాగుతున్న అమానుష కాండ. ఇందులో ఇస్లాంలోని వివిధ తెగల మధ్య వైరుధ్యాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అనేక యూరప్ దేశాలలో చెప్పుకోదగినంత ముస్లిం జనాభా వుంది. ఈ ఘటనల ప్రభావంతో అక్కడ కూడా అభద్రత పెరిగింది. ఐఎస్‌ఐఎస్ దాడుల కారణంగా చాలా మంది ముస్లిం శరణార్థులు రావడంతో మరింత ఉద్రిక్తత పెరుగుతున్నది. ఉదార దేశంగాపేరొందిన ప్రాన్స్ వంటిది కూడా వివక్షా పూరిత చర్యలకు పాల్పడుతున్నది. ఇక బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌అయితే ఇస్లాం ఆధునిక నాగరికతతోపొసగదని ప్రకటించారు. ఇలా అమెరికా కూటమి ఒకవైపు అరబ్ ప్రభుత్వాలు మరోవైపు ద్వంద్వనీతిని అనుసరించినంత కాలం ఐఎస్‌ఐఎస్‌కు నిధుల కొరత వుండదు.దాడులకు విరామం కూడా వుండదు.
టెర్రరిజంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపేముందు మోడీ ప్రభుత్వం ఈ వాస్తవాలు అలోచించాలి. వారితో కలసి నడవడం అంటే మనపై దాడులను ఆహ్వానించడమే . గణనీయమైన ముస్లిం జనాభా వున్నా భారత దేశంలో ఇస్లామిక్ టెర్రరిజం పరిమితంగానే ప్రభావం చూపిస్తున్నదని హిందూస్తాన్ టైమ్స్ ఒక కథనం ప్రకటించింది. సిమి ఇండియన్ ముజాహదీన్ వంటి సంస్థలు అప్పుడప్పుడు బీభత్సం సృష్టిస్తున్నా బారత దేశంలో ముస్లిం జన బాహుళ్యం ఈ దాడులకు మద్దతునివ్వడం లేదని ఎకనామిస్ట్ పత్రిక అధ్యయనం తెల్పింది. సిరియాలో ఐఎస్‌ఐఎస్ తరపున 27,000 మంది విదేశీ ముస్లింలు పోరాడుతుంటే అందులో భారతీయులు 23 నుంచి 4ం వరకూ మాత్రమే వుంటారని ఒక అంచనా వేశారు. భారత దేశంలో సూఫీ మత ప్రాబల్యం, దేశంపై ముస్లింలకు ప్రత్యేకించి అసంతృప్తి లేకపోవడం ఇందుకు కారణమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆరెస్సెస్ ఆదేశాలు అనుసరించే ప్రభుత్వం కేంద్రంలో వుండటం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు కనిపిస్తున్నా భారతీయ ముస్లిం జన బాహుళ్యం దేశంలోనే భవిష్యత్తు వెతుక్కొంటున్నారు.పైగా వారిలో అత్యధికులు నిరుపేదలు కావడం వల్ల సచార్ కమిటీ నివేదిక వంటిది అమలైతే మంచిదని ఆశిస్తున్నారు. టెర్రరిస్టు దాడులను చాపకిందనీరులా పనిచేసే సంస్థలను కనిపెడుతూనే దేశ జనాభాలో 17 శాతం వరకూ వున్న ముస్లింలలో భరోసా కల్పించగలిగితే ఐఎస్‌ఐఎస్‌లాటివి గానీ, అమెరికా యూరప్‌ల తరహా పరిస్థితులు గాని ఇక్కడ తలెత్తకపోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.