అత్యాచారానికి శిక్ష- బాధితురాలి స్థయిర్యం

పదకొండేళ్లుగా నేను న్యాయం కోసం నిరీక్షించాను. ఇన్నాళ్లకు అది సాధ్యమైంది. ఆ రోజున నన్ను కారులో వెనకసీటుకు కట్టేసి రాక్షసంగా హింసించి ఉన్మాదంతో కేకలు వేశారు. ఇప్పుడు వాళ్లందరికీ కోర్టు శిక్ష విధించింది గనక వేడుక చేసుకునే వంతు నాది అని ప్రకటించింది ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసియానా ప్రాంతంలో అమానుష అత్యాచారానికి బలైన బాధితురాలు. 2005 మే 5వ తేదీన జరిగిన ఈ ఘటనలో చాలామందికి శిక్ష పడినా ప్రధాన నిందితుడైన గౌరవ్ శుక్లా నేరం జరిగినప్పుడు మైనర్‌ననే సాకుతో తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడతనికి ఇరవై తొమ్మిదేళ్లు. పాతగుడ్డపీలికలు ఏరుకుని బతికే ఇంట్లో పుట్టిన ఆ బాలికను దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని హింసిస్తూ రాక్షసానందం పొందారు. వారంతా సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇంతకాలం కేసు నడిపించగలిగారు. ఘటన జరిగిన వెంటనే శుక్లాను అదుపులోకి తీసుకున్న మైనర్ అనే వాదనతో బయిటపడ్డాడు. నిర్భయ ఘటనకు ముందే దేశంలోనే ఈ విధమైన నేరాల గురించిన చర్చ తీవ్రం కావడానికి ఏషియానా
దురంతం కారణమైంది. ఆనాడు 13 ఏళ్ల వయసులో వున్న అమ్మాయి ఇప్పుడు 11వ తరగతి చదువుతున్నది. శుక్లాకు కూడా శిక్ష పడినట్టు ఫోన్ రాగానే ఆమె మొహం వెలిగిపోయింది. ఐద్వా కార్యాలయంలో అందరికీ మిఠాయిలు పంచిపెట్టింది. ఇప్పటి వరకూ నా మొహానికి కట్టుకున్న ముసుగును తీసేస్తాను. తప్పు చేసిన వారు కటకటాల్లో వున్నారు నేనేం అపరాధిని కాదని గట్టిగా చాటిచెబుతాను. ఇలాటి దుర్మార్గులకు శిక్షలు పడేదాకా పోరాడాలని చెబుతాను. నేను కూడా చదువుకుని న్యాయమూర్తినై ఇలాటి రక్కసులకు శిక్షలు వేసి మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తాను అని ఆ అమ్మాయిఉద్వేగంగా చెప్పింది.