అమెరికా సైన్యాలకు విడిదిగా భారత్‌!

india us
అమెరికా అంతర్జాతీయ వ్యూహాలలో అంతకంతకూ భారత దేశం పావుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ఆదేశ రక్షణ శాఖ కార్యదర్శి ఆష్టన్‌ కార్డర్‌ పర్యటన సందర్భంగా మోడీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇరుదేశాల సైన్యాలు తమ సదుపాయాలను ఇచ్చిపుచ్చుకోవడానికి రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌తో చర్చలలో ప్రాథమిక అంగీకారం కుదిరింది. లాజిస్టిక్స్‌ ఎక్స్జేంజి మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండిగ్‌(లెమోగా) అనే ఈ ఒప్పందం మేరకు మన సైనిక సదుపాయాలు స్థావరాలు అమెరికా ఉపయోగించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన స్తావరాలలో వారు విడిది చేయొచ్చు.భారత దేశం మరో దేశంపైకి దాడికి వెళ్లే పరిస్థితి ఎన్నడూ వుండదు గాని అమెరికా ఆధిపత్యం కోసం ఏదో ఒక దేశంపై దాడి దండయాత్ర చేస్తూనేవుంటుంది. వేల మైళ్లదూరంలో కూడా తన ప్రయోజనాలకు ముప్పు కలిగిందంటూ విమానాలను పంపిస్తుంది. వీటికి మధ్యలో ఆగే ఏర్పాట్లు ఇంధన సదుపాయాలు కావాలి. ప్రతిచోటా అలాటి ఏర్పాట్లు వుంటే మరిన్ని దేశాలపై దాడికి దిగడడం సులభమై పోతుంది. చంద్రశేఖర్‌ స్వల్పకాలిక ప్రభుత్వం వుండగా ఇరాక్‌పై దాడికి వెళ్లే అమెరికా విమానాలకు ఇక్కడ ఇంధనం నింపడం పెద్ద వివాదంగా మారింది. తర్వాత కూడా అమెరికన్లు ఎంత ఒత్తిడి తెస్తున్నా మన ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. వాజ్‌పేయి హయాంలో విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ అప్పటి అమెరికా అధికారి స్ట్రాట్‌టాల్బోట్‌తో 17 సార్లు సమావేశమైనారు కాని తర్వాత ఆ ప్రభుత్వం ఓడిపోయింది. వ్యాపార విషయాల్లో వారికి తలుపులు బార్లాతెరిచిన మన్మోహన్‌ ప్రభుత్వం కూడా రక్షణ రంగంలో చేతులు కలపడానికి సంకోచించింది. ఈ పదేళ్లపైబడిన కాలంలో వారి ఒత్తిడి కొనసాగుతూనే వుంది. ఎట్టకేలకు ఇప్పుడు మోడీ సర్కారు అందుకు పూర్తిగా అవకాశాలు కల్పించేందుకు అంగీకరించింది. ఇది అలీన విధాన సూత్రాలకు విరుద్ధమంటూ వచ్చే విమర్శలను తోసిపుచ్చింది. నిజానికి పొరుగుదేశం పాకిస్తాన్‌కు ఎఫ్‌16 విమానాలు ఇవ్వడంతో సహా ఇప్పటికీ అమెరికా అండదండలు లభిస్తున్నాయి. మరి అలాటి దేశంతో రక్షణ రంగాన్ని పంచుకోవడం భారత దేశానికి ఎంత వరకు సురక్షితమే ఎవరైనా చెప్పగలరు.
దీంతోపాటే సముద్ర జలాలకు సంబంధించి కూడా ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహనకు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో వైరుద్యాల పెరుగుదల రీత్యా భారత్‌తో చేతులు కలపడం అవసరమన్నది అమెరికా modi cartr111 వ్యూహం. అంతర్జాతీయంగా అమెరికా తర్వాతి స్థానాన్ని చైనా భారత దేశాలు ఆక్రమిస్తున్నాయి గనక వాటిని విడగొట్టడం దానికి లాభదాయకం. అదే కోణంలో భారత చైనాల సమస్యలు పరిష్కరించుకుని ముందుకు పోవడం ఈ రెండు దేశాలకూ మంచిది. అమెరికా సైన్యాలు తిష్టవేస్తే మన దేశానికి కూడా భద్రత భంగమవుతుందనే మాట అటుంచి వారి శత్రువులను మన శత్రువులుగా చేసుకోవడం తథ్యం. అలీన దేశంగా అందరి మనన్న పొందిన ఇండియా ఈ విధంగా అమెరికా ఉపగ్రహంగా మారితే ఉపద్రవం కొనితెచ్చుకోవడమే అవుతుంది.

ఈ సమయంలోనే మేధాపరమైన హక్కులు అంటే పేటెంట్ల విషయంలోనూ అమెరికా ఔషదకంపెనీల ఒత్తిడికి కేంద్రం లొంగిపోవడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మన దేశ ప్రజలపై మందుల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది.ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం ఇదంతా చాలనట్టు ఇంకా మా విదేశీ వాణిజ్యవిధానం అస్పష్టంగా వుందని చెబుతున్నారు. మరోవైపున అమెరికా తరపున ఆయనతో చర్చించిన అశ్లీ జె టెల్లిస్‌ మీరు అలీన విధానం ఛాయల నుంచి బయిటపడి మాతో మరింతగా చేతులు కలిపితేనే మీ అభివృద్దిలో మూడవ ఘట్టం మొదలవుతుందని సలహా ఇవ్వడం విశేషం. అదీ మన నడక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *