జపాన్ పనిభూతం కరోషికి 1500 మంది బలి
అంతూపంతూలేని పనిభారం, వత్తిడి కారణంగా జపాన్‌లో గత ఏడాది 1456 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా వెల్లడైంది. ఈ పనివొత్తిడి భూతాన్నే ఆ భాషలో కరోషి అంటున్నారు. ఒక నెలలో వందగంటలు ఓవర్ టైమ్ చేసినా లేక రెండు మాసాల పాటు నెలకు 80 గంటల పాటు ఓవర్ టైమ్ చేసినా పని వొత్తిడికి గురై గుండె నొప్పి వచ్చినట్టు లెక్కవేస్తారు. అలాగాక నెలలో 160 గంటలు ఓవర్‌టైమ్ చేసిన ఫలితంగా గుండె నొప్పి వస్తే అది ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. ఇంతకూ అభివృద్ధి చెందిన మర్యాదస్తుల దేశంగా చెప్పే జపాన్‌లో పనిగంటలకు పరిమితి వుండదు. పైగా వయోజనులు ఎక్కువగా వున్నారనీ, 1.28 ఉద్యోగాలకు ఒక్కరే అందుబాటులో వుంటున్నార
ని సాకులు చెబుతూ ఈ పనిభారాన్ని యాజమాన్యాలు సమర్థించుకుంటున్నాయి. దేశంలో 38 శాతం మంది నిబంధనలు లేని కాంట్రాక్టు పద్ధతులలో పనిచేస్తున్నట్లు అధికారిక లెక్క.కాని ఆచరణలో ఇది మరింత ఎక్కువగా వుంటుంది. వీరిలో దాదాపు 70 శాతం మంది మహిళలు వుండటం మరో విపరీతం. కరోషితో మరణించిన వారిలోనూ 20శాతం మంది మహిళలుంటున్నారు. 2015లో కరోషి మరణాల కింద 1456 మందికి పరిహారం ఇవ్వాల్సి వచ్చిందని కార్మిక శాఖా మంత్రి హిరోషీ కవహిటో ప్రకటించారు. చెప్పాలంటే జనాభా పనిచేసే వారు అత్యధికంగా వున్న ఇండియాలోనూ నిపుణుల కొరత పేరిట పనిభారం రుద్దడం లేదూ? కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వాలే ప్రోత్సహించడం లేదూ? బాల శ్రామికులు మహిళలను మరింత దారుణంగా దోచుకోవడం ఇక్కడ నిత్యకృత్యం. జపాన్ అనుభవాన్ని హెచ్చరికగా తీసుకోకపోతే విషమ ఫలితాలు తప్పవు.
