ఆడవాళ్లకూ అయ్యప్ప శరణం

sabari111!

శనిసిగ్నాపూర్‌ ఆలయం అంతర్బాగంలోకి మహిళల ప్రవేశం అనుమతించిన తర్వాత మిగిలిన నిషిద్ద స్థలాలు కూడా తెరుచుకోకతప్పడం లేదు. త్రయంబకేశ్వర్‌లో కూడా స్త్రీలను రానివ్వాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు సుప్రసిద్ధమైన శబరిమలై కొండమీదకు కూడా మహిళలను అనుమతించడంపై వాదోపవాదాలు వినాల్సిందేనని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తాము రాజ్యాంగం ప్రకారం వెళతామే గాని తరతరాల నమ్మకాలనబడే వాటిని పట్టుకు వేళ్లాడలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు ప్రాచీన సంప్రదాయాల ప్రకారం తండ్రికన్నా గురువు కన్నా ముందు తల్లిని పూజించే పద్ధతి వుంటే వారినే ఎలా రాకుండా అడ్డుకోగలమని కోర్టు ప్రశ్నించింది. శబరిమలై కొండమీదకు రజస్వల కాని బాలికలను లేదా రుతుస్రావం ఆగిపోయిన మహిళలను మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ కూడా వారికి ఆపాదించిన మాలిన్యమే సమస్య. పైగా చాలా మతాలు స్త్రీలు అపవిత్రతను తెస్తారని మోహానికి లోనుచేస్తారని వారిపై నిందలు వేశాయి. వాస్తవంలో ఇది . తమ బలహీనతలను స్త్రీలకు ఆపాదించే కరుడుగట్టిన పురుషాధిక్యత మాత్రమే. మహిళల్లో కూడా అత్యధికులు శబరిమలై సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారని దేవస్థానం బోర్డు చేసిన వాదనతోనూ కోర్టు ఏకీభవించలేదు. తాము మెజార్టి అభిప్రాయాలను బట్టి గాక రాజ్యాంగాన్ని బట్టి వెళ్లవలసి వుంటుందని చెప్పింది. మొదట మార్పునకు అనుకూలంగా అఫిడవిట్‌ వేసిన కేరళ ప్రభుత్వం తర్వాత సంప్రదాయానికి అనుకూలంగా మార్చుకుంది. ఇలాటి పిల్లిమొగ్గలు వేసినప్పటికీ తమ విచారణ కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇంత పోరాటం జరుగుతున్నా స్వామీ స్వరూపానంద వారు మాత్రం స్త్రీలను అనుమతించడం అరిష్టమనీ వారికే నష్టమనీ మొండిగా సమర్థించడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *