ే అస్పష్టతలు అనుమానాల మధ్య అమరావతి

పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం సింగూరులో 300 ఎకరాలు పరిహారం ఇచ్చికూడా సంక్షోభాన్ని ఎదుర్కోలేక పోయింది. అదే మా చంద్రబాబు నాయుడు పరిహారం పైసా ఇవ్వకుండానే 36 వేల ఎకరాలు సమీకరించగలిగారని నిన్నశనివారం విజయవాడలో కలిసిన తెలుగుదేశం నాయకులు ప్రజా ప్రతినిధులు అన్నారు. రైతులకు లాభం జరుగుతుందనే నమ్మకం కలిగించి భూమి రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృతకృత్యులైనారనే విషయం ఒప్పుకోవలసిందే. ఇందుకు భూముల రేట్లు పెరుగుతాయనే ఆశ, ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందనే విశ్వాసం ఆ ప్రాంతాల సామాజిక ఆర్థిక పొందిక తోడైనాయి. అయితే ఇదంతా సినిమా భాషలో చెప్పుకునే ఫస్ట్‌హాఫ్ మాత్రమే. అసలు సవాళ్లు సమస్యలు ఇప్పుడు మొదలవుతాయి. భూములిచ్చిన రైతులకు పరిహారంగా ఇచ్చే వాణిజ్య ప్లాట్లు 32 గజాల పరిమాణం నుంచి మొదలవుతున్నాయి. అంత పెద్ద నిర్మాణ యజ్ఞంలో వంద యాభై గజాల వారికే ఠికానా వుండదు గనక యాభైకి లోపు వారంతా ఏదో విధంగా మరొకరికి అప్పగించకతప్పదు. ఇప్పుడు నడుస్తున్న ప్రకారమైతే అది రేపు నిర్మాణాల కాంట్రాక్టు తీసుకునే సంస్థలకు బడాబాబులకు అప్పగించక తప్పని స్థితి వారికి ఎదురవుతుంది. ఆ కొద్దిపాటి స్థలానికి లెక్కకట్టి పంపేయడం అనివార్యమే.
ప్లాట్ల విభజనలో చిన్నవి ఒకచోట, మధ్యతరహావి మరో చోట, పెద్దవి వూరికి దూరంగా వుండేలా ప్లాను రూపొందించారు. ఈ క్రమంలో అంతర్గత రోడ్ల విస్తీర్ణం బాగా పెంచడం వల్ల రోడ్డు పక్కన ప్లాట్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అనుసంధాన రోడ్డు ఒక్కటే వేసి దానికి లింకు రోడ్లు వేసేట్టయితే తమకు ఎక్కడో మూలన ప్లాట్లు వచ్చి విలువ లేకుండా పోతుందనే భయం రైతులలో నెలకొంది. రైతులకు కొన్ని గజాలు అదనంగా కావలసి వస్తే పక్కనే ఇస్తామని మొదట చెప్పిన మాట కూడా నిలబడేలా లేదు. ఎందుకంటే అలాటి అవసరాలన్ని కలిపి ఒకచోట వేలం వేస్తామంటున్నారు. దాన్నుంచి వచ్చే మొత్తంతో వారు ఎలాగో సమకూర్చుకోవాలన్నది అవగాహన. రైతుల విజ్ఞప్తిపై సెల్లార్ పార్కింగు విస్తీర్ణాన్ని పెంచారు గాని దాంతోపాటే సెట్బ్యాక్స్ను కూడా మార్చారు. 300 గజాలు పైబడిన వారికి ఒక అంతస్తు అదనంగా వేసుకోవడానికి అవకాశం ఇస్తామంటున్నా ఇదంతా పై తరగతివారికే తప్ప చిన్న తరహా వారికి ఉపయోగపడేది తక్కువన్న భావన బలంగా వినిపిస్తున్నది. అసలు ఒకసారి ప్లాట్లు కేటాయించిన తర్వాత ప్రైవేటు కాంట్రాక్టర్లు తప్ప ప్రభుత్వ పాత్రనే నామమాత్రమై పోతుంది గనక ప్రతిదీ వివాదమై పరిష్కారం కోసం ఎదురు చూడవలసి వుంటుంది. పెద్దప్లాట్లు వచ్చిన వారు కూడా వాటిని చిన్నవిగా మార్చుకోవడానికి అనుమతించే అవకాశమే లేదని అదనపు కమిషనర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టంగా చెప్పడం తమకు ఆందోళన కలిగించిందని రైతులు వాపోతున్నారు. రైతులు మొదట సమీకరణ ఒప్పందంలో ఏఏ షరతులకు అంగీకరించారో అవే అమలవుతాయని వాటిని మార్చే ప్రసక్తి వుండదని ఆయన చెప్పినట్టు సమాచారం.
నివాస ప్రాంత ప్లాట్లు వాణిజ్యప్లాట్లు వీటికి సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా వున్నాయి. ఏఏ చోట్ల ఏతరహా నిర్మాణాలు చేయొచ్చు ఏవి చేయకూడదానేది భిన్నంగా వుంటుంది. కనుక వాణిజ్య స్థలం అనగానే లాభాలు వచ్చిపడిపోతాయని భావించడానికి లేదు. ఆ నిబంధనలు కూడా క్రిడా ఒకవైపు కాంట్రాక్టర్లు మరోవైపు చేరి ఎన్ని చిక్కుముడులు వచ్చేది చెప్పడం కష్టం.
ఎక్కువ చోట్ల ప్లాట్లను 130 గజాలు 260 గజాలు, 540 గజాలు, 1500 గజాలు ఇలా విభజించారు. మొదటి నిబంధనల ప్రకారమైతే 120,240,510,1495 గజాలుగా చూపించారు. ఈ తేడా వున్న భూమిని తమ దగ్గరే పెట్టుకుని గ్రామ రెవెన్యూ పరిధిలో చేర్చి వేలం వేస్తారు.
సమీకరించిన భూమిలో పదివేల ఎకరాలు క్రిడా వేలం వేస్తుంది. వేలం అనగానే పాడుకున్నవారికి పెద్ద చేతులకు మాత్రమే దక్కుతుందని చెప్పనవసరం లేదు. వాణిజ్య గృహ సముదాయాలు నిర్మించే పెద్ద సంస్థలే వీటిని స్వంతం చేసుకోవడం తథ్యం. ఒక వంతు రహదారులకు మరో వంతు ఈ వాణిజ్య సామ్రాజ్యాలకు పోయిన తర్వాత మిగిలిన మూడో వంతులో చిన్న చితక రైతులు బుల్లి బుల్లి ప్లాట్లతో వుండటం ఎలాగూ కుదిరేపని కాదు గనక వాటిని కూడా ఏదో ఒక ధరకు ధారాదత్తం చేసి మరో చోటికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందడితో ఇతరత్రా కూడా భూముల రేట్లు పెరుగుతాయి గనక సామాన్యులకు అందుబాటులో వుండకుండా పోతాయి. మూడు పంటలు పండే భూములు మూడుపువ్వుల ఆరుకాయలుగా లాభాల పంటలు పండిస్తుంటే సంపన్న కుటుంబాలకు సదుపాయంగా వుండొచ్చు సన్నకారు రైతులు సన్నజీవాలు మాత్రం అయోమయంలో పడిపోతారు. పునరావాసం కల్పించకుండా తొలగించడం సరికాదని న్యాయస్థానాలు మానవ హక్కుల సంస్థలు ఘోషిస్తున్నా ప్రభుత్వం మొదట తొలగించి భూమిని చేతుల్లోకి తీసుకుంది. ఇప్పటిలాగే వ్యవహరిస్తే అన్నీ అధికారులకు వదిలేస్తే మాత్రం అయోమయం పెరుగుతుంది తప్ప తగ్గదు.
ఈ సమస్యలు ప్రస్తావిస్తే అభివృద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి ఆగ్రహిస్తారు గాని నిజంగా రైతుల్లో వున్న అనుమానాలు ఆందోళనలు పరిగణనలోకి తీసుకోవడం ప్రభుత్వానికే మంచిది. ఎందుకంటే ఇప్పటికి వారు ఆయన ఏదో చేస్తాడని నమ్ముతూనే అనుమానంగా అస్పష్టంగా చూస్తున్నారు. అయోమయం కొనసాగితే అప్పుడు ఆగ్రహంగానూ మారొచ్చు. నల్లేరుమీద బండిలా నడిచిపోతుందనుకోకుండా నిజాలను గుర్తించి సందేహాలు నివారించడం అవసరం.విశ్వాసం పొంది భూ సమీకరణ చేయడం ఒక ఎత్తు అయితే తర్వాత ఆ విశ్వాసాన్ని ఆచరణలో చూపించడం మరింత ముఖ్యం.పైగా రైతులకు ఒకసారి చెల్లింపుతప్ప మళ్లీ ఏమీ ముట్టలేదని కూడా గమనించాలి.