బడా బకాయిదార్లకు రక్షా కవచాలు

stock-vector-spike-ball-follow-the-bank-defaulter-concept-design-vector-392684986
బారతీయ బ్యాంకుల కన్సార్టియంకు తాను బాకీ పడిన 9000 కోట్ల రూపాయలకు గాను 4000 కోట్లు చెల్లిస్తానని బేరం పెడుతూ కబురు పంపిన కింగ్‌ ఫిషర్‌ విజరు మాల్యాకు బ్యాంకుల్లోనూ కోర్టులోనూ చుక్కెదురైంది. లేనిపోని బేరాలు మాని తనకూ కుటుంబ సభ్యులకూ మొత్త ఆస్తిపాస్తులు ఎంత విలువ కలిగి వున్నాయో చెప్పవలసిందిగా కోర్టు ఆదేశించింది. దానికన్నా ముందు అసలు కోర్టుకు హాజరు కావాలని తాఖీదు నిచ్చింది. ఏప్రిల్‌22 లోగా మాల్యా ఈ పని చేయవలసి వుంటుంది. న్యాయమూర్తులు కురియన్‌ జోసఫ్‌, రోహితన్‌ నారీమన్‌లతో కూడిన బెంచి విజరు మాల్యా తరపు న్యాయవాదుల వాదన విన్న తర్వాత బ్యాంకుల వాదనతో ఏకీభవించింది. ఏదో కబురు పంపించడం గాక వచ్చి సమగ్రపరిష్కారం కుదర్చుకోవాలని చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం బాగానే వుంది గాని వాస్తవానికి బ్యాంకులపై వత్తిళ్ల కారణంగా బడా బకాయిదార్లపై చర్యలకు వెనుకాడటమే ఆందోళన కలిగిస్తుంది. ఇలాటివారి ప్రాసిక్యూషన్‌కు బ్యాంకులు చెల్లింపులలో వైఫల్యం తర్వాత నాలుగు నెలల్లోనే చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఎప్పుడో ఆదేశించింది. కాని ఆయా బ్యాంకుల యాజమాన్య బోర్డులు 16 కేసుల్లో అలాటి చర్యలకు సిద్దం కాలేదు. మొత్తం 43 ఇలాటి కేసులు వుంటే 8 బ్యాంకులకు సంబంధించిన 16 కేసుల్లోనే దాదాపు 37శాతం ఎగవేత మొత్తాలున్నాయి. ఓరియంటల్‌, ఓవర్సీస్‌ బ్యాంక్‌,వివిధ రకాల స్టేట్‌ బ్యాంకులు స్పందించని వాటిలో వున్నాయి. మరికొంత వ్యవధి ఇస్తే మంచిదన్న వాదనతో అలా దాటేస్తుంటారు. ఇందుకు బ్యాంకుల డైరెక్టర్లు బోర్డులదే బాధ్యత అన్నట్టు ప్రభుత్వం మాట్లాడుతుంటే రాజకీయ వేత్తల జోక్యం వల్లనే ఆ బాకీలు మంజూరు చేయాల్సి వస్తుందని చెల్లించకపోయినా చర్య తీసుకోకుండా వారే అడ్డుపడతారని బ్యాంకు అధికారులు వాపోతున్నారు. ఇప్పుడు కూడా ఆర్‌బిఐ సుప్రీం కోర్టుకు ఇచ్చిన సీల్డు కవర్‌లో ఎగవేతదార్ల పేర్లు రహస్యంగా వుంచాలని షరతు విధించింది! కనక ఎవరిని ఎవరు కాపాడుతున్నారో తెలియడం లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *