పనామా పనోరమా

two_ships_passing_in_the_night__brandan_reynolds_1
సరళీకరణ అనంతర ప్రపంచంలో తలుపులన్నీ బార్లా తెరిచేశాక అక్రమ సంపదలు గుట్టలు గుట్టలుగా ఎలా ఎల్లలు దాటి తరలిపోతున్నాయో పనామా పత్రాలు మరోసారి వెల్లడిస్తున్నాయి. ఈ సంచలన పత్రాల్లో తెలుగువాళ్లతో సహా 500 భారతీయుల పేర్లు ఇప్పటికి విడుదలైనాయి. అందులో గత ప్రస్తుత పాలకుల సన్నిహితులున్నారు. బినామీ పేర్లు మరెన్నో! రాజకీయ అనుబంధాలున్న ఘరానా కార్పోరేట్‌ చక్రవర్తుల ఏజంట్లు మరింత మంది వుంటారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని అక్రమ ధనం తెప్పించి ఇంటింటికి పంపిణీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ గద్దెక్కాక ఆ పనిచేయలేకపోవడానికి కారణమదే. పైగా ి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అక్రమ ధనాన్ని సక్రమం చేసుకోవడానికి చాలా వరాలు ప్రకటించారు. ప్రపంచంలోని వందలాది మీడియా సంస్థలు ఒక సమాఖ్యగా ఏర్పడి( ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌) సాగించిన అతి పెద్ద పరిశోధనలో పనామాలోని నకిలీ కంపెనీలకు సంబంధించిన లక్షలాది పత్రాలు వెలికితీశామంటున్నారు. ఇందులో ఐస్‌లాండ్‌, రష్యా చైనా బ్రిటన్‌ పాకిస్తాన్‌ ఉక్రెయిన్‌ దేశాల అధినేతల బంధుమిత్రుల పేర్లున్నాయి. అంతర్జాతీయ బేహారుల వివరాలున్నాయి. ఐస్‌లాండ్‌ ప్రధాని ఇప్పటికే ఇంటిదారి పట్టగా బ్రిటన్‌, పాకిస్తాన్‌ ప్రధానుల ప్రతినిధులు తప్పేమీలేదని వాదిస్తున్నారు. రష్యా ప్రభుత్వం ఇది అద్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా సాగిన కుట్ర అని ఖండిస్తే చైనా తాము ఈ కథనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రకటించింది.

భారత దేశానికి సంబంధించి అమితాబ్‌ బచన్‌, ఐశ్యర్యా రారు, డిఎల్‌ఎప్‌ సంస్థ అధినేత కెపిసింగ్‌, వ్యాపారవేత్త అదానీ సోదరుడు గౌతం అదానీ, మీడియా దళారీ నీరా రాడియా వంటి వారితో పాటు చాలామంది పేర్లు బయిటకు వచ్చాయి. మోటూరు శ్రీనివాస్‌ ప్రసాద్‌, ఒలన్‌ భాస్కరరావు, బవనాసి జయకుమార్‌ అనే మూడు తెలుగు పేర్లు ముందుగా వినిపించాయి.(టిడిపి వైసీపీ పరస్పరం ఆరోపించుకుంటున్న పేర్లు మాత్రం లేవు!) వీరిలో చాలా మంది తప్పు జరగలేదని,ఆ కంపెనీలు ఇప్పుడు లేవని వాదిస్తున్నారే గాని సంబంధమే లేదని కొట్టేయలేదు. తన పేరు దుర్వినియోగమై వుండొచ్చని అమితాబ్‌ వివరణ ఇచ్చారు గాని ఆయన కోడలు మౌనం దాల్చారు. వీరిలో కొందరు పన్ను ఎగవేతకోసం సంపదలు తరలించి వుండొచ్చు గాని ఎక్కువ మంది అక్రమ సంపదను దాచుకోవడం కోసమే పనామా మార్గం ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. అది ప్రకృతి వనరులను ప్రజాధనాన్ని దోచుకుని లేదా భారీ లంచాలు తీసుకుని కూడబెట్టినదై వుంటుంది. దాన్ని ఇక్కడ చూపే అవకాశం లేదు గనక బయిటకు పంపి మరో మార్గంలో తెప్పించుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక విధానాల కింద పన్ను స్వర్గాలు(టాక్స్‌హెవన్స్‌) ఎలాటి జవాబుదారీ తనం లేకుండా సంపదలు దాచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక గోప్యత అంటూ వివరాలు అడగవు. ఇందుకోసం వాటికి కొంత వడ్డీ ఎదురిస్తే చాలు. అమెరికా ఖండంలోని పనామా, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌,బెర్ముడా వంటివి ప్రధానంగా బ్రిటిష్‌ సార్వభౌమత్వానికి లోబడివుండే నామకార్థపు పాలక వ్యవస్థలు మాత్రమే. అంతేగాక కెనడా, దక్షిణాఫ్రికా, ఇజ్రాయిల్‌, నార్వే, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌,జర్మనీ వంటి పెద్ద దేశాలు కూడా మొత్తం 83 ఈ రెండు తరహాలో ఏదో ఒకవిధమైన సదుపాయం కలిగిస్తున్నాయి. ఏఏ కంపెనీలు లేదా వ్యక్తులు ఎక్కడి నుంచి ఏ సంపద ఎలాటి దొంగసొమ్ము తెచ్చి దాచి పెట్టుకుంటున్నారనేది వాటికి అనవసరం. షెల్‌ కంపెనీలు లేదా సూట్‌కేసు కంపెనీలు సృష్టించుకుని వాటిని కోటానుకోట్ల నిధులు తెచ్చుకోవడానికి సహకరిస్తాయి. అలాటి కంపెనీలను సృష్టించే ఒక కిరాయి సంస్థ మెసాక్‌ ఫోన్సెకా. దానిదగ్గరున్న సమాచారం కూడా అంతా రాలేదనేది ఒకటైతే తక్కిన వాటిదగ్గర మరెంత గుప్త సంపద వుండొచ్చనేది వూహించుకోవలసిందే.

అయితే పనామా పత్రాల్లో అమెరికా కోణం విస్మరించడానికి లేదు. ఈ ఆపరేషన్‌ మొత్తం అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసి కేంద్రంగా ఫోర్డ్‌, కెల్లోగ్‌,కార్నెగీ, రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ వంటి వాటి ఆర్థిక సహకారంతో జరిగింది. దశాబ్దాల తరబడి అమెరికా సామ్రాజ్యవాద పాలకవర్గాలతో ముడిపడివున్న ఈ సంస్థలివి. అమెరికా ప్రభుత్వంలో భాగంగా సిఐఎతో సన్నిహితంగా పనిచేసే యుఎస్‌ ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యుఎస్‌ఎఐడి) తమకు సహకరించినట్టు కూడా ఐసిఐజె తెలియజేసింది. పనామా పత్రాల్లో అంతర్జాతీయంగా అమెరికా తర్వాత స్థానంలో – రష్యా చైనా ఇండియా తదితర దేశాలకు సంబంధించినవి వివరాలే తప్ప ఒక్కటంటే ఒక్క అమెరికా రాజకీయ వేత్త ప్రస్తావన లేదు. గతంలో అనేక రహస్యాలు బయిటపెట్టిన వికీలీక్స్‌ కూడా అమెరికన్ల వివరాలు ఐసిఐజె బయిటపెట్టలేదని అదే విమర్శించింది. ఐసిఐజెకు ఆర్థిక సహకారం అందించిన జార్జిసొరోస్‌ హిల్లరీ క్లింటన్‌ అద్యక్ష పోటీకి కూడా ప్రధాన సహాయకుడు. ఆ వివరాలు బయిటపెడితే పార్టీలో తమ ప్రత్యర్తిగా సోషలిస్టు భాషలో మాట్లాడుతున్న బెర్నీ సాండర్స్‌కు మేలు జరుగుతుందని భయపడివుండొచ్చు.
పన్నులు లైసెన్సులు వంటివి అవినీతిని పెంచుతున్నాయనీ, సరళీకరణ విధానాలు వ్యాపార ప్రపంచంలో పారదర్శకత పెంచుతాయని చాలా మంది వూదరగొట్టారు. 1970లలో జిడిపిలో ఏడు శాతం మాత్రమే వున్న నల్లడబ్బు ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌ కన్నా అనేక రెట్లు పెరిగిపోయిందంటే పాతికేళ్ల ప్రపంచీకరణ విధానాలే కారణమన్నది స్పష్టం. దేశభక్తి గురించి వ్యర్థ వివాదాలు రగిలించేవారే దేశద్రోహాన్ని మించిన సంపదల తరలింపును నిరాఘాటంగా అనుమతిస్తున్నారు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు దీని వెనక వున్నాయన్నది స్పష్టమే అయినా ఈ పత్రాల ప్రభావాన్ని తక్కువగా చూడలేము. రష్యా ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌లతో సహా అన్ని చోట్లా సోవియట్‌ విచ్చిన్నం తర్వాత నయా రాజకీయవేత్తలు ఒకనాటి సమిష్టి సంపదలు కొల్లగొట్టారని చాలా సార్లు రుజువైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా అధికారికంగానే అవినీతి పట్ల ఆందోళన చేస్తూ పోరాటానికి పిలుపునిస్తున్నది. కనుక ఈ సందర్భంలో ఎవరి పాత్ర ఎంత అనేది ముందుముందు తేలాలి. ఏది ఏమైనా గత పాతికేళ్లుగామార్కెట్‌ శక్తుల మాయాజాలం పెట్టుబడుల అక్రమ సంచారం ప్రతిచోటా విష ప్రభావం చూపిస్తున్నది.

ఈ కథనాల కారణంగా తమను బలిపశువును చేయొద్దని పనామా ప్రభుత్వం చెబుతుంది. తమ క్లయింట్ట సంస్థలు ఎలా పనిచేస్తాయనేదాంతో తమకు నిమిత్తం లేదని మొసాక్‌ ఫోన్సెకా చెబుతుంది. తమ ఖాతాలన్నీ సక్రమమేనని పాక్‌,ఉక్రెయిన్‌ అధినేతలు చెబుతారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామరాజన్‌ ఇవన్నీ హేతుబద్దమైన వ్యాపారాలు కావచ్చునంటున్నారు. ఏతావాతా పన్ను స్వర్గాలకు నిధులు తరలించినందుకు ఎవరూ శిక్షించబడకపోవచ్చు. రాబర్ట్‌ వదేరాకు లాభం చేకూర్చినట్టు ఆరోపణలున్న డిఎల్‌ఎప్‌ అధినేత కెపిసింగ్‌ గురించి కాంగ్రెస్‌ గాని, తమకు సన్నిహితుడైన అదానీ కుటుంబ పాత్రపై బిజెపి గాని నోరు విప్పవు! గప్‌చిప్‌గా ఏవో రాజకీయ పదజాలంతో సమస్యను దాటేస్తాయి. 2013 వరకూ భారత దేశం నుంచి విదేశాలకు పెట్టుబడులు తరలించుకుపోవడం అపరాధం. ఆ ఏడాది కొత్త చట్టం వచ్చినప్పటికీ వివరాలు బ్యాంకులకు ప్రభుత్వానికి తెలిపిన తర్వాతనే విదేశాలకు తీసుకుపోవాలి. అవన్నీ పాటించివుంటే అక్రమ ఖాతాల అవసరమేముంటుంది? ి ఈ వ్యవస్థలో ఏదోలా సంపద పెంచుకోవడమే ఘనత. అసంఖ్యాక ప్రజానీకం దారిద్య్రంలో మగ్గుతున్నా పథకాల విదిలింపు తప్ప ఆర్థిక సాధికారిత, భూమి ఉపాధి కల్పన జరగవు. దేశంలోని ఒక్క శాతం మహా మహా సంపన్నులే దేశ సంపదలో సగంపైగా కలిగి వున్నారని, ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా మన కుబేరులే శరవేగంగా పెరుగుతున్నారనీ లెక్కలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీకి నిర్ణయాత్మకమైన ఆధిక్యత వచ్చాక వీరు అంతులేకుండా పెరుగుతున్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలే గాక వాణిజ్య అధ్యయన సంస్థల నివేదికలు కూడా చెబుతున్నాయి. కాబట్టి పనామా పత్రాలపై అందరికన్నా ఎక్కువ ఉలిక్కి పడాల్సింది మనమే. గమనం, ఎడిట్‌పేజి, ఆంధ్రజ్యోతి 8.4.2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *