క్రిష్ చిత్రాల్లో చారిత్రికత, సామాజిక కోణం
జాతీయ సినిమా అవార్డులలో రాజమౌళి సాంకేతిక అద్భుతం బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవగా దర్శకుడు క్రిష్ తీసిన ‘కంచె’ ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందింది. బాహుబలి ప్రపంచమంతా ప్రసిద్ది పొందినా ఏ కోణంలో అది ఉత్తమ చిత్రం అయిందనే చర్చ చాలా జరిగింది కాని క్రిష్ కంచెకు వచ్చిన అవార్డుపై చర్చలేమీ లేకపోగా విభిన్న చిత్రానికి న్యాయం జరిగిందనే మాట అందరినుంచి వచ్చింది.కమర్షియల్ మసాలాలు వదులుకోవద్దని తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి సలహా ఇస్తున్న తరుణంలోనే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్ తీసిన ఈ చిత్రం గౌరవం నోచుకోవడం అదనంగా చెప్పుకోవలసిన విషయం.
తెలుగు సినిమాలలో వివిధ దశల్లో మూస వాణిజ్య ధోరణికి సమాంతరంగా విభిన్న ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. . ఆఫ్‌బీట్ చిత్రాలు తీసిన వారూ లేకపోలేదు. కె.రాఘవేంద్రరావు జ్యోతితోనూ, విశ్వనాథ్ ఓ సీత కథతోనూ, దాసరి ఇంకా చాలా చిత్రాల్లోనూ అలాటి ప్రయత్నాలు ప్రయోగాలు చేశారు. ఎన్టీఆర్ అక్కినేని ఎల్‌వి ప్రసాద్, కెఎస్ ప్రకాశరావు, ఆదుర్తి వి.మధుసూదనరావు, ప్రత్యగాత్మ వంటి వారు కూడా మొదట్లోనే ఆతరహా చిత్రాలు అందించారు. కాని ఇవి చాలా త్వరితంగా ఆగిపోయాయి. ఒకటి రెండు పరాజయాలతోనే ఈ హేమాహేమీలు ఫార్ములా దారికి తిరిగివచ్చారు. చిన్న చిత్రాల్లో జరిగిన ప్రయత్నాలకు లెక్కేలేదు. రామోజీ రావు నిర్మాతగానూ కొన్ని విభిన్న చిత్రాలు వచ్చాయి. కాని ఇదొక ఒరవడిగా సాగింది లేదు. ఇటీవలి సంవత్సరాలలో ఆ వరవడికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి అనే పేరును క్రిష్‌గా మార్చుకోవడంతోనే కొత్తదనం ఆగకుండా నవ్యమైన కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు.
తొలి చిత్రంతోనే గమ్యం
1978లో పుట్టిన క్రిష్ ముప్పై ఏళ్లకే 2008లో ‘గమ్యం’ తీశారు. విజయం సాధించడ
మే గాక పరిశ్రమలోనూ ప్రేక్షకులలోనూ కొత్త ఆలోచనలు తీసుకురాగలిగారు. శర్వానంద్, అల్లరి నరేష్‌లు ప్రధాన పాత్రధారులగా నటించిన ఈ చిత్రం మన సినిమాలకు కొత్త గమ్యాలు కూడా నిర్ణయించుకోవచ్చన్న మెళకువ కలిగించింది. స్పష్టంగా చెప్పకపోయినా చే గువేరా ప్రసిద్ధమైన మోటార్ సైకిల్ డైరీని ప్రేరణగా తీసుకుని ఈ కథ రూపొందించారు. కోటీశ్వరుడైన శర్వానంద్ తనపై జుగుప్సతో దూరమైన చైతన్యవంతురాలైన డాక్టర్ ప్రేయసి కమలిని ముఖర్జీ కోసం వెళుతుంటే వెంట పడి వెనక కూచున్న గాలి నరేష్‌తో కలసి ఏ అనుభవాల చూశాడు? ఏఏ కఠోర జీవిత వాస్తవాలు తెలుసుకున్నాడు? వినోదం, ఉద్వేగం కలగలిపి చాలా పట్టుగా సాగే కథ. పరస్పర మారణహౌమంలా మారిన మావోయిజాన్ని కూడా చర్చకు పెట్టి ప్రజలలో చైతన్యం రాకుండా ఎవరోకొందరు తుపాకులు పట్టుకుంటే సరిపోదని స్పష్టంగా చెప్పిన కథ. చే మోటార్ సైకిల్ డైరీని, వేల సంవత్సరాల నాటి బుద్ధుడి జ్ఞానోదయ ఇతివృత్తాన్ని కలగలిపి తీసినట్టనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ తరహా కథలు చాలా అరుదే.(దీంతో పోలిస్తే ఇదే నగ్జలిజం ఇతివృత్తంగా తీసుకున్న జల్సా అచ్చమైన వాణిజ్య ఫార్ములాలో రాజకీయ రహితంగా నడవడం గమనించవచ్చు) ఈ చిత్రం పెద్దతారాగణం లేకపోయినా మంచి విజయం సాధించడమే గాక నంది అవార్డు,ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.
వేదం వేదనా స్వరం
గమ్యం తర్వాత రెండేళ్లకు 2010లో క్రిష్ తీసిన వేదం కూడా మూస ధోరణికి భిన్నంగా అనేక బాధామయ జీవితగాధలను కలగలిపి చూపిస్తుంది. బలవంతాన వేశ్యగా మారి బయిటపడాలని పెనుగులాడే ఒక యువతి తల్లి ఆశలకు భిన్నంగా సుఖజీవనం గడపాలనే ఆరాటం గల ఒకయుువకుడు, అతని వాహనం కింద పడిన ఒక పేద తల్లి ప్రేయసిని తాను ధనవంతుడినని నమ్మించడం కోసం దొంగతనానికి సిద్దమయ్యే ఒక అవారా, సిరిసిల్ల నేత కార్మికుల జీవన్మరణావస్థ, పాతబస్తీలో మతఘర్షణల బాధితులైన మైనార్టీ దంపతులు ఇలా మొత్తం పాత్రలన్నీ అధోజగత్సహౌదరులవే. శ్రీశ్రీ చెప్పిన పతితులు భ్రష్టులూ బాధాసర్పదష్టులవే. ఇవన్నీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకంగా తారసపడటం, జీవిత వేదన తెలుసుకుని తప్పుదారి వదలి ఉదాత్తంగా మారడం ఇతివృత్తం. వీరిమధ్యలోనే లోఫర్లు డాఫర్లు దళారులు దండాకోర్లు దర్శనమిస్తుంటారు. అల్లుఅర్జున్ అనుష్క, మంచు మనోజ్, దీక్షా సేఠ్ తదితరులతో నిర్మించిన ఈ చిత్రం కూడా మంచి పేరుతో పాటు వసూళ్లను కూడా తెచ్చిపెట్టింది. అసలు చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో ఇన్నిరకాల పాత్రలను చూసి జీవన వేదం చూడగలిగామనే భావం యువ ప్రేక్షకులలోనూ కలిగింది.
కృష్ణం వందే ….
తర్వాత సంవత్సరం వానం అనే తమిళ చిత్రం తీసిన క్రిష్ 2012లో మళ్లీ కృష్ణం వందే జగద్గురుం తీశారు. గమ్యంలో లాటిన్ అమెరికా విప్లవ తార చే గువేరా మోటార్ సైకిల్‌డైరీని అనుసరిస్తే ఈచిత్రంలో అచ్చమైన జానపద నాటక సంప్రదాయాన్ని అనుసరించారు. చితికి పోతున్న నాటకరంగం, సంప్రదాయ కళాకారుల బాధలోనూ కళనుబతికించాలని తపన పడటం చూపించారు. బిటెక్ చదివిన కథానాయకుడు ఈ కళాతపనకూ తన వ్యక్తిగత ఆశలకూ మధ్య నలిగిపోతున్న దశలో దోపిడీ శక్తులతో ఘర్షణ పడాల్సి వస్తుంది. అక్రమ గనుల తవ్వకం ఆధారాలతో సేకరిస్తున్న ఒక పరిశోధనాత్మక జర్నలిస్టుతో కలసి అతను ముందుకు పోతాడు. ఈ క్రమంలో తన నాటక కళను ఉపయోగిస్తూనే దుష్టశక్తులపై పోరాడతాడు. నరసింహావతారంలో నాడు హిరణ్యకశ్యపుణ్ని హతమార్చినట్టు ఇప్పుడు ఈ ప్రజాద్రోహులను చీల్చిచంపుతాడు. ఒకప్పుడు ప్రజా నాట్యమండలి ప్రయోక్తలు వీధిభాగవతాలను ఆంతర్జాతీయ రాజకీయాలతో కూడా మేళవించిన తీరులోనే క్రిష్ నాటక కళలో నేటి దుష్పరిణామాలను మిళితం చేసి చివరకు దుష్టశిక్షణ చేయిస్తాడు. ఈ జీవితం నుంచి పారిపోవాలనుకునే హీరో చివరకు ఇక్కడే వుండి కర్తవ్యం నెరవేర్చడం ఆయన గత రెండు చిత్రాల్లో తరహాలోనే సామాజిక చైతన్యాన్ని చెబుతుంది. ఇక్కడ విశేషం ఏమంటే చాలామందిలాగా ఈ దర్శకుడు పనిగట్టుకుని నినాదాలు చెప్పించడు. సందేశాలు ఇప్పించడు. అసలు ప్రేక్షకుడు కథలో మరేదో సందేశం దాగివుందని గుర్తించకుండానే విషయం ఆస్వాదిస్తాడు.అది మంచి దర్శకుడి లక్షణం. ఈ క్రమంలో నటీనటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను పూర్తిగా ఉపయోగిస్తాడు. పాత్రలు సహజంగా కనిపించేలా శ్రద్ధతీసుకుంటాడు. రానా నటజీవితంలో పరిపూర్ణమైన పాత్ర ఏదైనా వుందంటే కృష్ణం వందే జగద్గురుం అనే చెబుతారు. కాకపోతే టైటిల్ ఆకర్షించలేకపోయిందనే అభిప్రాయం ఒకటి వుంది. లేకపోతే ఇది మరింత విజయం సాధించేదని పరిశ్రమ వర్గాలు చెబుతాయి.
అంతర్జాతీయ కాన్వాస్
ఇక జాతీయ పురస్కారం పొందిన కంచెతో క్రిష్ మరో మెట్టు పైకెదిగాడు. సెంటిమెంట్లు ఫార్ములాలు, డైలాగులు నినాదాలకే పరిమితమైన తెలుగు సినిమాకు ప్రపంచ చరిత్రను పరిచయం చేశాడు. భారత దేశంలో ఒక గ్రామంలో ఫ్యూడల్ అణచివేతలో వున్న ఒక పల్లెటూరును, నాజీ నరహంతకుల క్రూరత్వానికి బలైన ప్రపంచ పరిస్థితులను సమాంతరంగా చూపించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలలో ఎన్ని ఘనతలున్నా విదేశాల వాతావరణాన్ని చారిత్రిక పరిణామాలను యథాతథంగా ప్రతిబింబించే ప్రయత్నం జరగలేదు. అవసరం లేకపోయినా దండగమారి ఖర్చుతో విదేశాల్లో పాటలు తీసి జతచేయడం మాత్రమే చూస్తుంటాం. నాజీ జర్మనీ హిట్లర్ జాత్యహంకార మారణ కాండ వంటివాటిని మన వారెప్పుడూ ప్రస్తావించరు. దానికి మనం చూసే కుల వివక్షకూ మత చాందసానికి మధ్యన పోలిక వుందని గుర్తించడం, చిత్రించడం నిజంగా సాహసమే. కథానాయకుడు క్షౌరవృత్తి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఘర్షణతో సహా చూపించడం బహుశా ఇదే ప్రథమం.(తూర్పు వెళ్లే రైలులో ఆకలి రాజ్యంలో మరో విధంగా చూపిస్తారు) ఈ వ్యక్తి బ్రిటిషిండియా సైన్యంలో చేరి నాజీల కిరాతకాలను ప్రత్యక్షంగా చూడటం , దానికీ తమ గ్రామంలోకి కుల వివక్షకూ పోలిక గుర్తించడం సగటు సినిమా కన్నా ఒక అడుగు ముందుకేసినట్టే. తెలుగు సినిమాలలో విదేశాలను ఫీల్‌గుడ్ కోసమో లేక నేరస్త ముఠాలను పట్టుకోవడం కోసమో చూపిస్తుంటారు. పాత సినిమాలలోనైతే భూకంపాలు, యుద్ధాల సన్నివేశాల క్లిప్పింగులు జొప్పిస్తుంటారు. క్రిస్ కంచెలో అందుకు భిన్నంగా నాటి పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు. వరుణ్ తేజ్‌కు కూడా ఇదో మంచి చిత్రంగా మిగిల్చారు. జాతీయ పురస్కారం కూడా రావడంతో ఆయనే గాక విభిన్న చిత్రాలు కోరే వారంతా ఆనందించవచ్చు. ఈ మూడు నాలుగు చిత్రాలు కలిపి చూస్తే క్రిష్‌లో అరుదైన చారిత్రిక అంతర్జాతీయ కోణం వున్నట్టు స్పష్టమవుతుంది.
క్రిష్ దాదాపు ఎనిమిదేళ్లుగా పట్టువదలకుండా సామాజిక ఇతివృత్తాలను జోడించిన కథలే ఎ ంచుకుంటున్నారు. ఆ కారణంగానే తన చిత్రాల్లోని ఇతరేతర లోపాలకన్నా ఈ వరవడిని ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తుంది.ఇప్పుడాయన బాలకృష్టతో గౌతమీ పుత్ర శాతకర్ణి తీస్తున్నారు గనక గత చరిత్రను ఎలా చిత్రిస్తారో చూడటం ఆసక్తికరం.
