బాహుబలి లోపాలపై కాసరవల్లి

బాహుబలి సాంకేతికంగానూ వసూళ్లలోనూ సంచలనం సృష్టించినా జాతీయ ఉత్తమ చిత్రం ఎలా అయిందనే చర్చ 63వ సినిమా అవార్డులు ప్రకటించిన రోజు నుంచి వింటున్నాం. ప్రముఖ కన్నడ సమాంతర దర్శకుడు, అవార్డుల గ్రహీత గిరిష్ కాసరవల్లి ఆ విమర్శలకు మరిన్ని కొత్త కోణాలు జోడించారు. అవార్డులు పొందిన కన్నడ చిత్రాల నిపుణులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లో వచ్చిన చిత్రాలు అనేక సమస్యలను సృశించినా పట్టించుకోకుండా దాన్ని ఎంపిక చేశారని కాసరవల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విజయవంతమైన వినోదాత్మక చిత్రాలకు అవార్డులు ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదని అన్నారు. ే బాహుబలిలో అణగారిన తెగలను ఉపేక్షిత తరగతులను చూపించేప్పుడు వుండాల్సిన సున్నితత్వం లేదని కాసరవల్లి విమర్శించారు. వారిని అనాగరికంగా చూపడం సరికాదని అలా చూపించే దశ దాటి చాలాదూరం వచ్చేశామని స్పష్టం చేశారు. బాహుబలికి అవార్డు ఇవ్వడం ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిందని కూడా వ్యాఖ్యానించారు.. బాహుబలిలో దండయాత్రకు వచ్చిన కాలకేయులను నల్లగా వికారంగా చూపించి అర్థం కాని భాష పెట్టడం, ప్రభాస్‌ను పెంచిన గిరిజన తెగల ప్రజలను కూడా వెనకబడినవారిగా చూపించడం ఆయన దృష్టిలో వుండొచ్చు. వీరయోధుడు,ఆయుధాగార అధిపతి కట్టప్పను కట్టుబానిసగా చూపించడం, కాలు నెత్తిన పెట్టించడం కూడా ఇలాటివే. చరిత్రలో ఇలాటివి వున్నాయా లేదా అనేది ఒకటైతే వాటికి మనం ఈ కాలంలో కూడా విమర్శనా రహితంగా చూపించాలా అనేది ప్రశ్న.
లోగడ చాలా అవార్డులు పొందిన మరో కన్నడ దర్శకుడు పి.శేషాద్రి ఈ సభలో అదే ధోరణిలో మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం తప్ప బాహుబలిలో మరేమీ లేదని వ్యాఖ్యానించారు. జమున నుంచి గిరీష్ కాసరవెల్లి వరకూ చేసిన విమర్శలను, మా వంటి వారి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి రాబోయే భాగంలోనైనా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా అంటే బహుశా అది జరక్కపోవచ్చు. ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యలు హావభావాలు చూస్తే అనుకున్నట్టే అద్బుతం సాధించేశానన్న ఆనందం తప్ప వచ్చిన విమర్శలను కూడా గమనించాననే మాటే రాలేదు. వాస్తవానికి ఆయన తండ్రి ఈ చిత్ర కథకుడు విజయేంద్రప్రసాద్‌ను ఈ విషయంలో మెచ్చుకోవాలి. విజయేంద్ర ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలో కూడా తానేదో అద్బుతం సృష్టించానని చెప్పుకోలేదు. సీన్లు చెబుతూ వెళ్లానని మాత్రమే చెప్పారు. అంతకంటే గొప్ప సంగతి – పసివాడిప్రాణం చూసి భజరంగి భారుజాన్ కథ రూపొందించానని నిస్సంకోచంగా ప్రకటించడం. నిజం చెప్పాలంటే అచ్చమైన కమర్షియల్ దర్శకులకు రచయితలకు మాత్రమే ఈ విధమైన నిజాయితీ వుంటుంది. తండ్రీ కొడుకులు కలసి ముగింపులోనైనా విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలి మరి.