పనామాలో తెలుగోళ్లు.. తమది పాపం కాదన్న పాలకులు..

pnma1111

పనామా పత్రాల రెండవ రోజున తెలుగు వారి కీర్తికి లోటు లేకుండా ముగ్గురి పేర్లు వెల్లడైనాయి. మోటూరి శ్రీనివాసప్రసాద్‌, ఒలన్‌ భాస్కరరావు, బనవాసి జయకుమార్‌ అనే ముగ్గురు సంపన్నులు ఉత్తుత్తి కంపెనీలను ఏర్పాటు చేసినట్టు బయిటపడింది. వీరంతా ప్రస్తుతం క్లీన్‌టెక్‌ అనే సంస్థకు ఆధ్వర్యం వహిస్తున్నారు. మీడియా ఆరా తీసినప్పుడు సమగ్ర సమాధానాలు రాలేదు గాని ఆ కంపెనీలు ఎప్పుడో స్థాపించి వదిలేశామని మాత్రమే చెప్పారు. ముగ్గురిలో ఒకరి బాధ్యత ఎవరిదనే దానిపైనా రకరకాల సమాధానాలు వచ్చాయి.
మరో వైపున ఈ పత్రాలలో పేర్లు వెల్లడైన ఐస్‌లాండ్‌ ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన సిపార్సు చేసినా పార్లమెంటును రద్దు చేసేందుకు ఆ దేశాద్యక్షుడు నిరాకరించారు. అయితే ఉక్రెయిన్‌ అద్యక్షుడు పెట్రో పురషెంకో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. తను పదవి చేపట్టే సమయంలో తనకున్న ఆస్తులు పక్కన పెట్టడానికి ఏదో ఒక కంపెనీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఇది చట్టప్రకారమే జరిగింది గనక తనను ఇతరులతో కలిపి చూడరాదని చెప్పారు. ఇక ఎప్పుడో కన్నుమూసిన తన తండ్రి నుంచి బ్రిటిష్‌ ప్రధాని కామెరూన్‌ ఎలాటి వారసత్వ సంపదలు తీసుకోలేదని కనుక ఆయన పేరువచ్చినా ప్రధానికి సంబంధం లేదని అధికారిక వివరణ వెలువడింది. ఈ కథనాలను తాము పట్టించుకోవడం లేదని వీటిలోని పేర్లపై ఏ విధంగానూ స్పందించబోమని చైనా ప్రకటించింది. ఇవన్నీ అమెరికా ప్రేరితమనే అభిప్రాయం బలంగానే వినిపిస్తున్నది. రష్యా అద్యక్షభవనం మొదటే ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *