కెటిఆర్‌ నమూనాలో లోకేశ్‌?

ktrlksh
ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌కు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి తెలుగుదేశంలో లోకేష్‌కు యువరాజాభిషేకం చేయాలనే హడావుడి నడుస్తున్నది. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో లోకేశ్‌కు మంత్రి పదవి కథనం రావడంతో దాన్ని దాదాపు ధృవీకరించుకుంటున్నారు. రాజ్యమే మనదైనప్పుడు రాజ్యాంగేతరం అనిపించుకోవడమెందుకనే ఆలోచన దీని వెనక వుందంటున్నారు. ఇప్పటికే కీలకమైన ఏ రాజకీయ పాలనా పరమైన నిర్ణయమూ లోకేశ్‌ జోక్యం ఆమోదం లేకుండా జరగడం లేదని పార్టీ వర్గాల కథనం. మంత్రులకు కూడా కొన్నిసార్లు ఆయన నిర్ణయం తర్వాత తెలుస్తుంటుందని అంటారు. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ వారసత్వం ఆమోదిత సత్యమై పోయింది గనక పెద్దగా పట్టించుకోనవసరం లేదు. లోకేశ్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పినా ఓటుకు నోటు వ్యవహారంతో సంబంధం పెద్ద దెబ్బే తీసింది. తర్వాత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మరింత దెబ్బ తగిలింది. అప్పటికే ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రతిష్టించినా ఈ నేపథ్యంలో అంతకంటే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని అవకాశాలను ఉపయోగించుకోవడమే కీలకమై పోయింది. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కొంతకాలం కథలునడిచినా సన్నిహిత వర్గాలు అప్పుడే తోసిపుచ్చాయి. నేర్చుకోవలసింది ఇక్కడ వుండగా ముందు ఢిల్లీకి పంపడం ఇబ్బందులు కొనితెచ్చుకోవడమేనని చంద్రబాబు ఆయన సలహాదారులు భావించినట్టు కనిపిస్తుంది. కనుక నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటే అధికారిక ముద్రతో పాటు రేపు వారసత్వ బదలాయింపు కూడా తేలివకవుతుందనే అంచనా కూడా వుండొచ్చు. ఇక్కడ తమాషా అయిన సమస్య బాలకృష్ణకు జ్యోతిష్య పరంగా తాను ముఖ్యమంత్రినవుతాననే నమ్మకం వుండటం లోకేశ్‌ కావడానికి ఆయన అల్లుడే అయినా తన జాతకంలో వుంది గనక ఏదో ఒకటి జరగాలనే భావం ఆయన పదే పదే వెలిబుచ్చినట్టు చంద్రబాబుకు దగ్గరగా వుండే వారు, ఇతర అధికార ప్రతినిధులు కూడా అప్పుడప్పుడు చెబుతున్నమాట. ముఖ్యమంత్రి కాకున్నాకనీసం మంత్రిగానైనా చేద్దామనుకుంటే మామా అల్లుళ్లు ఇద్దరినీ తీసుకోవడం ఎబ్బెట్టుగా వుంటుందనే మీమాంస. బాలయ్యకు నచ్చజెప్పిన తర్వాతనే ఈ నిర్ణయం లీక్‌ చేసినట్టు కనిపిస్తుంది.
తెలంగాణలో కెటిఆర్‌ను ప్రమోట్‌ చేయడం కూడా లోకేశ్‌పై చాలా ప్రభావం చూపిస్తున్నది. నిజానికి వాళ్లిద్దరి నేపథ్యాలూ రాజకీయ పరిస్థితులూ కూడా వేరు వేరు. మంత్రి కాకముందే కెటిఆర్‌ ఒకటికి రెండు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికవడంతో పాటు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలతో పూర్తిగా అధికారిక వారసుడై తండ్రి లేనప్పుడు డీ ఫ్యాక్టో సిఎం అనిపించుకుంటున్నారు కెటిఆర్‌. లోకేశ్‌ ఇటీవలి వరకూ తండ్రికి సహాయం చేయడానికే పరిమితమైనారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కెటిఆర్‌వర్సెస్‌ లోకేశ్‌ అన్నట్టు మీడియాలో వార్తలు రావడం ఒకింత మేలే చేసినట్టు ఆయన సహాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ అవకాశాలు దాదాపు హరించుకుపోయాయి గనక ఎపిలో మంత్రిగా వుంటే ప్రభుత్వ నిర్వహణలో సహరించడం ప్రత్యక్ష పరిజ్ఞానం పెంచుకోవడం జరుగుతుందని అనుకుంటున్నారు. ప్రస్తుత ఐటి శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి పనితీరు బాగాలేదనే పేరిట ఆ శాఖను లోకేశ్‌కు ఇచ్చేస్తే కెటిఆర్‌ తరహాలోనే వుంటుందని భావిస్తున్నారు గాని అది మరీ కార్బన్‌ కాపీలా వుండదా? హైటెక్‌ సిటీగా ప్రసిద్ధమైన హైదరాబాదులో ఐటిని ముందుకు తీసుకుపోవడానికి ఎపిలో ప్రారంభ ఘట్టం నడిపించడానికి చాలా తేడా వుంటుందనేది నిజం. అందుకే ఈ పరిణామాలు ఒక కొలిక్కి రావడానికి సమయం పట్టొచ్చు. అప్పుడు గాని తుది నిర్ణయం బయిటకు రాదు.పైగా వ్యక్తులుగా ఎవరొచ్చినా విధానాలలో పెద్ద మార్పు వుండదు కూడా. ఏమైనా కెటిఆర్‌ది రెండవ తరం వారసత్వం, సమకాలీన నాయకత్వం కాగా లోకేశ్‌ది మూడవ తరం కావడం ఒక విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *