గుత్తాధిపత్యం కలల్లో చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్‌లో మనం మాత్రమే అధికారంలో వుండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేతల సమావేశంలో చెప్పిన మాటలు ఆతృతకూ అభద్రతకూ అద్దంపడుతున్నాయి. మనం మాత్రమే వుండాలని అనడంలో మరెవరూ వుండకూడదు అన్న భావం అనివార్యంగా ధ్వనిస్తుంది. ఇందుకు సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకోవడం కూడా యాదృచ్చికం కాదు. అతి తక్కువ జనాభాతో నగర రాజ్యంగా పెట్టుబడిదారీ ప్రపంచానికి చిన్న సంతమార్కెట్‌గా రవాణా కేంద్రంగా వినోద బిందువుగా వుంటున్నది. సింగపూర్ నమూనాను చైతన్యవంతమైన ఆంధ్ర ప్రదేశ్‌పై రుద్దగలనని ఆయన ఎలా అనుకుంటున్నారో అర్థం కాదు. ప్రపంచ బ్యాంకుకు ప్రీతిపాత్రమైన సింగపూర్ బ్యాంకు రికార్డుల ప్రకారం ఇప్పటికి పదేళ్లుగా అత్యంత వ్యాపారానుకూల దేశంగా నమోదవుతున్నది. అలాటి హౌదానే కొద్ది మాసాల కిందట దేశంలో ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా లభించడం గమనించదగ్గది. నిజానికి అది 47 దీవుల సముదాయం. అక్కడ జనాభాలో 90 శాతం మందికి ఇళ్లు వున్నాయంటారు గాని నిజానికి జనాభాలో 30 శాతం మంది మాత్రమే స్వదేశీయులు. తక్కిన వారంతా విదేశీ జాతుల వారూ పర్యాటకులే. ఆగేయాసియాలో అంతర్జాతీయ సామ్రాజ్యవాద వ్యూహాత్మక ప్రయోజనాల కోసం దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు తప్ప మరో గొప్పతనమేమీ లేదు. 120 కోట్ల భారతదేశం అందులో అయిదున్నరకోట్ల మంది వున్న ఆంధ్ర ప్రదేశకు సింగపూర్‌తో పోలికే అసంబద్దమైంది. ఏడడుగులు కలసి నడిస్తే వారు వీరవుతారన్నట్టు సింగపూర్ చుట్టూ తిరిగీ తిరిగీ చంద్రబాబుకు ఆ నమూనా బాగా తలకెక్కినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా జ్యోతిబాసులా ఇరవై ఏళ్లు పాలించాలని తరచూ అంటుండేవారు.సామాన్య ప్రజల పక్షాన సారథ్యం వహించిన జ్యోతిబాసు పాలనా రీతులకు సంపన్న వర్గాలు కోరే ప్రపంచ బ్యాంకు బోధనలే వేదమనే చంద్రబాబు పాలనా పద్దతులకు హస్తిమశకాంతరం. ఆ రోజుల్లో చంద్రబాబును ప్రపంచ స్వప్న మంత్రివర్గంలో సభ్యుడుగా తీసుకోవడం పెద్ద కథ. విద్యుచ్చక్తి ఉద్యమం తర్వాత క్రమేణా ప్రజాగ్రహం పెరిగి ఆయన ఒక్క ఎన్నికల విజయంతోనే ఇంటిదారి పట్టడంతో జ్యోతిబాసు కల చెదిరిపోకతప్పలేదు. ఆ తర్వాతా మరో పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
ప్రతిపక్షంగానూ గజిబిజి
పదేళ్లు ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గాల గురించి కనీసం చర్చించకపోగా చంద్రబాబు తను అధికారంలో వున్న కాలమే స్వర్ణయుగమని దృఢంగా నమ్ముతూ వచ్చారు. వానలు పడకపోవడం తప్ప విధానాల్లో పొరబాటు వుందని ఎన్నడూ గుర్తించలేదు. నేను మారాను అని మాట వరసకు అంటున్నా తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి చేయడం వూతపదంగా చేసుకున్నారు. అంత కాలం ఎవరూ చేయలేదన్నది నిజమే కాని దాని వెనక వున్న ప్రత్యేక పరిస్థితులను కూడా గమనించాలి. విభజన సమస్యపైనా అస్పష్ట వ్యూహం చేపట్టి చివరి వరకూ ద్వంద్వ ప్రహసనం నడిపారు. వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి జగన్‌పై కేసులు జైలుకు వెళ్లడం వంటివి జరిగినా ఆ పార్టీకే ప్రజలు విజయం చేకూర్చారంటే తెలుగుదేశంపై అసంతృప్తి ఏ స్థాయిలో వుందో అర్థమవుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్థిరత్వంలో కూరుకుపోయి ఒక్కతాపుకే కూలిపోయే స్థితి వున్నా వైసీపీకి మేలు జరుగుతుంది గనక ఆ పనిచేయకుండా ఉత్తుత్తి విమర్శలకే పరిమితమైనారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి, పదేళ్ల ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజనపై చివరి చర్చలోనూ పాల్గొనకుండా దాటేశారు. పైన పార్లమెంటులో తమ సభ్యులతో రెండు విధాలుగా మాట్లాడించడమే గాక ఆ పార్టీ ఎంపిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న జుగుప్సాకరమైన పరిస్థితిని చూశాం. ఇవన్నీ అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయంపై నిరాహారదీక్షలు, బస్సు యాత్రలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి చాలామందిని చేర్చుకున్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తేనే విభజిత రాష్ట్రానికి మేలు జరుగుతుందని మోత మోగించారు. వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు, లోటుపాట్లు ఇందుకు తోడై చివరకు రెందు శాతంకంటే తక్కువ ఓట్ల తేడాతోనే 35కు పైగాసీట్లు అధికంగా తెచ్చుకుని అధికారంలోకి రాగలిగారు. ఇందుకోసం మరోసారి బిజెపితో చేతులు కలపడమే గాక తొలిసారి ప్రభుత్వంలో భాగం కల్పించారు.
అంతా ఏకపక్షమే
ఇవన్నీ వివరంగా చెప్పడమెందుకంటే తెలుగుదేశం అధికారంలోకి రావడం చాలా హౌరాహౌరీగా జరిగింది గాని నల్లేరు మీద బండిలాగా వచ్చింది కాదు. ఈ వాస్తవాలకు తోడు విభజన గాయాలు కూడా గుర్తుంచుకుంటే చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నించి వుండాల్సింది. కాని మొదటి రోజు నుంచి ఆయన తను తన పార్టీ అన్న ధోరణి తప్ప అఖిలపక్ష వైఖరి ఒక్క సారికూడా తీసుకోలేదు. రాజధాని నిర్ణయం వంటి చారిత్రాత్మక సన్నివేశంలోనైనా అందరినీ భాగస్వాములను చేయాలనుకోలేదు. అనేక మల్లగుల్లాల తర్వాత అన్ని నిర్ణయించేసుకుని అసెంబ్లీ వేదికపై లాంఛనంగా ప్రకటన చేసి సరిపెట్టారు. విభజన పూర్వరంగంలో అన్ని ప్రాంతాలనూ అన్ని తరగతులకూ విశ్వాసంలోకి తీసుకోవలసిన ప్రత్యేక అవసరం కూడా ఆయన దృష్టిలో లేకపోయింది.్ట సింగపూర్‌తో పదేపదే మాట్లాడారు గాని స్వరాష్ట్ర రాజకీయ పక్షాలతో సంప్రదించాలనుకోలేదు! భూసేకరణ చట్టాలను పక్కనపెట్టడం కోసం సమీకరణ అనే తారకమంత్రం తీసుకొచ్చి అయోమయాన్ని సృష్టించారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూనే సింగపూర్ తరహా వాణిజ్య నమూనాను ఎంచుకున్నారు. ఈ వాణిజ్య స్థలాల్లో వచ్చే లాభాలు భూములిచ్చిన రైతులకు దక్కుతాయని ఆశ కల్పించి 36 వేల ఎకరాలు రాబట్టారు. ఒక్క రూపాయి వెచ్చించకుండా ఇంత భూమి సేకరించడం ప్రపంచంలోనే అద్బుతమైన విజయమని చెప్పుకుంటున్నారు. అయితే ఇది విజయమేనా?అయితే ఎవరిది? విశ్వాసాన్ని నిలబెట్టుకుని రైతులకు నిజంగా పరిహారం, లాభదాయకమైన భూమి కేటాయించినప్పుడు కదా ప్రక్రియ పూర్తయ్యేది? పరిహారం లేకుండా వారినుంచి తీసుకున్న భూమని విదేశీ నిర్మాణ సంస్థలకో లేక స్వదేశీ కార్పొరేట్లకే అప్పగించడం ప్రజల కోణంలో ఏం విజయం? సమీకరణ పరిధికి బయిట మంత్రులతో సహా పాలపక్ష నేతలు భూములు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఆరోపణలు నిగ్గుతేల్చమంటే దర్యాప్తుకు నిరాకరించారు. అంతకు ముందు కాల్‌మనీ, ఇసుక దందా వంటివన్నీ కప్పిపుచ్చేసి భవిష్యత్తులో జరగనివ్వబోమని సరిపెట్టారు. ఏదో ఒక విధంగా తన వెనక వున్న వారిని నిలబెట్టుకోవడం కోసం ఇవన్నీ దిగమింగమంటున్నారు.
మా మాటే శాసనం. ఫిరాయింపులకు ఆహ్వానం
అక్రమాల సంగతి అటుంచితే- అధికారిక నిర్ణయాలు కేటాయింపులు పనులలోనూ తెలుగుదేశం ముద్ర తప్పనిసరి అనే పరిస్థితి తీసుకొచ్చారు. జన్మభూమి కమిటీలంటూ వేసి వారే ఈ రాష్ట్రానికి హక్కుదార్లంటున్నారు. ఒక నియోజకవర్గంలో గెలిచిన ఎంఎల్‌ఎ అయినవారి మాట గాక ఓడిన తెదేపా నాయకుల మాటే వినాలంటున్నారు. మొదట జరిగిన కలెక్టర్ల సమావేశంలోనే ముఖ్యమంత్రి అధికారపక్షం మాట వినాల్సిందేనని హుకుం జారీ చేశారు. బ్యాంకు రుణాల నుంచి గ్రామాల్లో పించన్ల వరకూ ఏదైనా వారి కనుసన్నల్లోనే వుండాలంటున్నారు.కార్మికులు ఉద్యోగులు లేవనెత్తిన ఏ సమస్యనూ పరిష్కరించకపోగా పోలీసులను ప్రయోగించడం ముందస్తుగానే అరెస్టులు చేయడం రివాజుగా మారింది. మనమే వుండాలని ఇప్పుడు చెప్పిన మాట చాలా కాలంగా అమలు చేస్తున్న తీరుకు ఇవన్నీ ఉదాహరణలు. ఆఖరుకు శాసనసభలోనూ వైసీపీకి అనుభవం లేదంటూనే సభా నిబంధనలు అధికారికంగా పక్కనపెట్టించారు. ఆ పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం వ్యూహాత్మకమా కాదా అనే మాట పక్కనపెడితే దానిపై చర్చ నిర్ణయించడంలోనూ ముగించడంలోనూ ఓట్ల డివిజన్ తీసుకోవడంలోనూ అడుగడుగునా ఏకపక్షంగానే వ్యవహరించారు. ఈ ధోరణి కారణంగానే రోజాపై వేటు వేసే సందర్భంలో పొరబాటు నిబంధనను వినియోగించి హైకోర్టులో అక్షింతలు వేయించుకున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వం వారిని కాపాడేందుకు పడిన తంటాలను ఇవి తెలియజేస్తాయి. ఇంకా మరింత మందిని తీసుకుంటామని వైసీపీనుంచే గాక కాంగ్రెస్ నుంచి కూడా తీసుకోవచ్చని చంద్రబాబు ఆ సమావేశంలో తలుపులు తెరవడం బలానికి సూచనా లేక బలహీనతకు ప్రతిబింబమా?
ఏ పార్టీ అయినా తానే అధికారంలో వుండాలనీ మళ్లీ మళ్లీ గెలవాలని ఆశపడొచ్చు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి సమస్యలు పరిష్కరించి పారదర్శక పాలన అందించి ఆ కోర్కె నెరవేర్చుకోవాలి. అంతేతప్ప అవనీతి శక్తులకు అండగా నిలవడం, అప్రజాస్వామికంగా అణచివేయడం, అవతలి పార్టీల వారిని అనైతిక మార్గాల్లో ఆకర్షించడం వంటి అవాంచనీయ పద్ధతుల ద్వారా కాదు. అలాటి అప్రజాస్వామిక పోకడల వల్లే గతంలో చంద్రబాబు నాయుడుకు స్వప్నభంగమైంది. ఇప్పుడు వాటిని మరింత తీవ్రంగా అమలు చేస్తూ అధికారం శాశ్వతం చేసుకోవాలనుకోవడం హాస్యాస్పదం. కమ్యూనిస్టులకు సభలో స్థానాలు లేవు గనక కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది గనక వైసీపీని ఎలాగో దెబ్బతీస్తే ఏకచ్చత్రాధిపత్యం సిద్ధిస్తుందని ఆయన ఆలోచన అయితే అంతకన్నా పొరబాటు వుండదు. ప్రజల తరపున పోరాడే కమ్యూనిస్టుపార్టీలు నిరంతరం ప్రజల తరపున పోరాడుతూనే వుంటాయి తప్ప సీట్లు లేనంత మాత్రాన కనుమరుగైపోవు. తెలంగాణలో ఫిరాయింపుల కారణంగా అస్తిత్వసంక్షోభం ఎదుర్కొంటున్న తెలుగుదేశం ఆంధ్ర ప్రదేశ్‌లో పాఠం నేర్చుకోకపోవడం విచిత్రం. ఈ రాజకీయ పేరాశలు అప్రజాస్వామిక పోకడలూ విరమించి విభజిత రాష్ట్రం కోసం అందరినీ కలుపుకొనిపోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని ఛేదిస్తానంటూ వచ్చిన తెలుగుదేశం ఈనాడు తానూ అదే కోరుకోవడం ఒక చారిత్రిక వైపరీత్యం. గత చరిత్ర అనుభవాలు మర్చిపోయిన వారికి ఆ చరిత్రే మళ్లీ గుర్తుచేయడం తథ్యం.
