కర్ణాటకంలో కర్కోటకం

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ౖ కుల వివక్ష వికృత రూపాలు ఆందోళన కరంగా సాగుతున్నాయి. శుక్రవారం నాడు ఒక దేవాలయంలో దళితుల ప్రవేశాన్ని అడ్డుకున్న చాందసత్వం చూస్తే శనివారం నాడు దళితున్ని ప్రేమించిన నేరానికి ఒక యువతిని కుటుంబ సభ్యులే పొట్టనపెట్టుకున్నారు.
మాండ్యా జిల్లా తిమ్మన్న హౌసూరుకు చెందిన మోనిక అనే చదువుకుంటున్నది. కొంతకాలంగా ఈమె ఒక దళిత యువకుడిని ప్రేమిస్తున్నది.సహజంగానే ఇంట్లో వారికి ఇది నచ్చలేదు. అయినా ఆమె వారి మాటలు వినడానికి నిరాకరించింది. ఇటీవలనే పెళ్లి కూడా చేసుకుని వెళ్లిపోయింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆమె తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఆమె మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులే ఆమెను ఇంటికి వెళదామని నమ్మించి తీసుకొచ్చి మార్గమధ్యంలో హత్య చేసి పెట్రోలు పోసి తగలబెట్టి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరవ హత్యలుగా చలామణి అవుతున్న ఈ కుల విద్వేష హత్యలు మానవత్వాన్నే మంటకలుపుతున్నాయి.
ఇక హసన్ జిల్లాలోని హౌలీనర్సిపూర్‌లో బసవేశ్వరాలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన దళితులను అగ్రవర్ణ పెత్తందార్లు కుల దురహంకారులు అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుల మత భేదాలు వద్దని చెప్పిన బసవేశ్వరుని ఆలయంలోనే ఇంత దారుణం జరగడం వివక్షకు పరాకాష్ట. వాస్తవానికి గత ఏడాది ఇదే గుడిలోకి కొందరు దళిత మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడమే గాక జరిమానా కూడా విధించారు. ఈసారి దళితులు ముందుగానే అధికారులకు మెమోరాండాలు ఇచ్చి బయిలుదేరారు. వారు కూడా రాజకీయ నేతలతో గ్రామ పెద్దలతో చర్చలు జరిపి ఒప్పించేందుకు కృషి చేశారు. అయితే ఇంతలోనే దౌర్జన్య శక్తులు అధికారులను కూడా చుట్టుముట్టి భయపెట్టారు. ఉద్రిక్తత తాండవించింది.