వీళ్లు భరత మాతలు కారా?

మహిళలను ఎంతగానో గౌరవించే సంసృతి మనదని చెబుతూనే వారిపట్ల వివక్ష చూపడం చాందసులకు పరిపాటి. మహారాష్ట్రలోని శనిసిగ్నాపూర్‌ోగుడిలోకి స్త్రీలను అనుమతించకపోవడంపై తృప్తి దేశారు నాయకత్వంలో భూమాత రణరాగిని బ్రిగేడ్ చాలాకాలంగా ఆందోళన చేస్తున్నది. వారిని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని మొన్ననే ముంబాయి హైకోర్టు కూడా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనైనా తమను అనుమతించాలని వెళ్లిన తృప్తి దేశారు బృందానికి గుడి నిర్వాహకులు స్థానికుల నుంచి తీవ్ర అవరోధం ఎదురైంది.వారిని బలవంతంగా అడ్డుకుని వెనక్కు నెట్టేశారు. దీనిపై నిరసనగా ఆ బృందం ధర్నా చేసింది. అయితే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కోర్టు తీర్పు రాజ్యాంగ స్పూర్తి రక్షించవలసిన పోలీసులు శాంతి భద్రతలకు భంగం కలగకుండా మహిళలను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. మాట్లాడితే వందేమాతరం పాడుతూ ఇటీవలి కాలంలో భారత్ మాతాకు జై అన్న నినాదాన్ని వివాదం చేసిన పెద్ద మనుషులూ జాతీయవాదులూ ఈ మహిళలను మాతృమూర్తులుగా చూడరా? జననీ జన్మ
భూమి అన్నారు కదా.. జననిని వదలి వేస్తారా? ఇంతకన్నా బూటకం ఏముంటుంది? మరో తమాషా ఏమంటే గోదారమ్మ పుట్టిన త్రయంబకేశ్వరంలోని ఆలయంలో కూడా స్త్రీలను అనుమతించకపోవడం. సంప్రదాయ సమాజానికి పురుషాధిక్యత కుల వివక్షత రెండు వ్రణాలు అని ఈ తాజా ఉదంతం నిరూపించడం లేదూ? ఇస్లాంలో స్త్రీ దుస్థితి గురించి కన్నీరు కార్చేవారు దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ మధ్యనే స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా మాట్లాడిన ఆరెస్సెస్ జోక్యం చేసుకోదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోర్టుతీర్పును గౌరవించరా?